తేజ సజ్జా, కార్తీక్ ఘట్టంనేని కాంబినేషన్‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న సూపర్ యోధ చిత్రం ‘మిరారు’ టైటిల్ గ్లింప్స్‌ని రామానాయుడు స్టూడియోలో డి.సురేష్ బాబు లాంచ్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ, ‘మిరారు అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దాన్ని కొందరు కాపాడుతుంటారు. ఈ నేపథ్యంతో దీన్ని అద్భుతమైన సినిమాగా మలచబోతున్నాను’ అని చెప్పారు. ‘కార్తీక్‌తో జర్నీ చాలా బాగుంది. తనకు ఓ విజన్ ఉంది. ఈ సినిమాలో ప్రతి పైసా వెండితెరపై కనులపండుగలా ఉంటుంది. పాన్ వరల్డ్‌గా సినిమాను చేయనున్నాం. తేజ సజ్జకు ముందు రికార్డ్‌లను బద్దలు కొట్టే సినిమా అవుతుంది’ అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ అన్నారు. తేజ సజ్జ మాట్లాడుతూ, ‘ఈ సినిమాని మాకున్న వనరులతో పెద్ద సినిమాగా చేయబోతున్నాం. నన్ను యోధునిగా కార్తీక్ చూపించబోతున్నాడు. ఇది తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’ అని తెలిపారు.