ఆశయమై నడిపించిన అద్భుతమైన పాట

A wonderful song driven by ambitionకొన్నిసార్లు మన ప్రయాణానికి ఆటంకాలు కలుగుతాయి. చీకట్లు ముసురుకుంటాయి. లోలోపల ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లనిపిస్తుంది. మన అనుకున్నవాళ్ళే నమ్మకద్రోహం చేస్తుంటారు. ఇలాంటి అననుకూల పరిస్థితులు ఎదురైనపుడు జీవితం విలవిల లాడిపోతుంది. అలా ఆవిరైపోతున్న ఆశయానికి ఊపిరి పోసేలాగా, ఎగిసిపడుతున్న ఆవేదనకు ఉపశమనాన్ని అందించేలాగా అద్భుతమైన పాటను రెహమాన్‌ రాశాడు. ఆ పాటనిపుడు పరిశీలిద్దాం..
నేడు ఉప్పెనలా ఎగిసిపడే సంచలన గీతాలు రాస్తున్న సినీగీత రచయితల్లో రెహమాన్‌ ఒకరు. సత్తా ఉన్న కలం ఆయనది. తాత్త్విక స్పర్శతో ఇట్టే ఆకట్టుకునే పదబంధాలెన్నో ఆయన పాటల్లో కనిపిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే అలాంటి పాట ఒకటి ‘కళాపురం'(2022) సినిమా కోసం రాశాడు రెహమాన్‌.
మనిషి జీవితం కొన్ని నమ్మకాలతో, ఆశలతో, ఆశయాలతో, కోరికలతో ముడిపడి సాగిపోతూ ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా మనం ఊహించని రీతిలో పెను మార్పులు సంభవిస్తే, అవి మనలో అలజడిని సృష్టిస్తే తట్టుకునే ధైర్యం కూడా మనిషికి ఉండి తీరాలి. కొన్నిసార్లు ఇలాంటి సందర్భాల్లో ధైర్యం కూడా కోల్పోతాం. ఎంత గుండె నిబ్బరంగా ఉందామనుకున్నా ఉండలేకపోతాం. మన మనసు మన ఆధీనంలో ఉండదు. మనసే కాదు మనిషి కూడా నిలబడలేక చతికిలబడిపోతాడు. అలాంటి సమయంలో ఈ పాట గుండె ధైర్యాన్ని ఇస్తుంది.
సినిమా కథ పరంగా చూసినట్లయితే హీరో తాను నమ్మినవారే తనను మోసం చేస్తుంటారు. స్నేహహస్తం చూపినవారే వెన్నుపోటు పొడుస్తారు. ప్రేమను పంచిన హృదయమే సర్పమై పడగ విప్పి కాటేస్తుంది. ఇది కలలో కూడా జరగదు అనుకున్నదే అతని కళ్ళముందు జరిగిపోతుంది. అపుడతని జీవితం ప్రశ్నార్థకమవుతుంది. ఎటూ తోచని పరిస్థితిలో అతని జీవితం ఒంటరిగా రోడ్డుపై నిలబడిపోతుంది. ఎవరిని నమ్మాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాదు. గొప్ప సినిమా దర్శకుడవ్వాలన్న అతని ఆశయం సన్నగిల్లుతుంది. అందరూ అతని కళని, ఆశయాన్ని తక్కువ చేసినవారే. వారి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలన్న కసి అతని లోపల ఉన్నా తనకు జరిగిన అన్యాయాల వల నుంచి, మోసాల నుంచి తొందరగా తేరుకోలేకపోతాడు.
తనలో ఉన్న ఆశలే తనను మోసం చేశాయి. తనతో కష్టాలనే చీకట్లో తోడుగా రాలేకపోయాయి. ఇది అతని మనసే అతనికి చెబుతుంది. ప్రాణం పోసే శ్వాసే చేదుగా అనిపిస్తుంది. అంటే.. బతుకే విరక్తిగా, బరువుగా ఉంది. జ్ఞాపకాలన్నీ బాధై పొంగిపోతున్నాయి. ఆ బాధల ప్రవాహాన్ని ఆపే వీలు కూడా లేక విలవిల లాడి పోతున్నాడతడు. సతమత మవుతున్నాడు.
నమ్మిన స్నేహం చేయి విడిచేసింది. కష్టంలో తోడుగా వుండేదే నిజమైన స్నేహం. స్నేహమంటేనే ఇక నమ్మకం లేని స్థితిలోకి అతడు వెళ్ళిపోతాడు. తను కన్న కలలు ఇక నెరవేరవని తెలిసి కన్నీరు మున్నీరవుతాడు. కళ్ళలోని ఆ కల ముల్లై గుచ్చేస్తుంది. అంటే.. తను ప్రేమించినవారే, తనను ప్రేమించిన వారే తనపై ద్వేషం కక్కేస్తున్నారు. ఇది ఎప్పటికీ మానని గాయం. చివరికి ఆ గాయమే అతనికి మిగిలింది మరి.
ఒంటరితనం అంటే ఒక్కడై మిగలడం కదా! కాని ఒంటరితనమే ప్రతి మనిషికి ఒక తోడు అంటున్నాడు కవి. ఎవ్వరెన్ని చెప్పినా ఆగిపోవద్దంటూ ఆశయాన్ని, ఆవేశాన్ని నూరిపోస్తున్నాడు. జరిగిన అవమానాలకు, అన్యాయాలకు లోపల మంట రగిలిపోతుంది. అయితే ఆ మంటే బాధ. అయినా ఆ మంటనే ఆశయానికి, భవిష్యత్‌ బాటకి వెలుతురుగా చేసుకో అని బోధిస్తున్నాడు. ఈరోజు ఒరిగిన రెక్కలే రేపు ఆకాశం అంచుల్ని తాకాలి. అంటే.. నీలో చచ్చిపోతున్న విశ్వాసానికి ఊపిరి పోసి నింగి అంచుల దాకా ఎగరేయాలి. కాలం వెంట నడుస్తున్నంత మాత్రాన కాలానికి, మనకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వడిగితే కాలం ఆగిపోదు కదా! అలా అని నువ్వు ఓడిపోయినా కాలం జాలిపడదు కదా! కాలం ఏదీ పట్టించుకోదు. నువ్వు గెలిస్తే మెచ్చుకోదు. ఓడిపోతే ఓదార్చదు. కాబట్టి కాలం ఆగదు. నువ్వూ ఆగకు. ఏదేమైనా నువు ఇక లేచి ముందుకు సాగాల్సిందే అంటున్నాడు.
ఇది ప్రతి ఒక్కరికీ వర్తించేలా రాసిన పాట. రెహమాన్‌ చేసిన ‘గీతో’పదేశం ఇది. అందరిలో ఆశయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిన పాట ఇది.
పాట:-
నీలో ఉన్న ఆశలే నిన్నే మోసం చేసెలే/ చీకట్లోన నీతో సాగలేక/ చేదైపోయే శ్వాసలే బాధై పొంగే గురుతులే/ ఆపాలన్న ఆపే వీలులేక/ నువ్వే నమ్మినా స్నేహం చెయ్యే వీడగా/ కన్నుల్లోని ఆ స్వప్నం ముల్లై తాకగా/ లోలో రేగే గాయాలే/ ఒంటరైన గానీ నీకు నువ్వే తోడురా/ ఎవ్వరెన్ని అన్నా ఆగిపోకురా/ మనసులో మంటలే వెలుతురై నడపనీ/ ఒరిగిన రెక్కలే గగనమే అంటనీ/ నువ్వే అడిగితే కాలం నీకై ఆగునా/ నువ్వే ఓడితే కాలం జాలే చూపునా/ ఏదేమైనా లేలేలే..
డా||తిరునగరి శరత్‌ చంద్ర, [email protected]

Spread the love