ఆధార్‌ అప్‌డేట్‌ గడువు పొడిగింపు

నవతెలంగాణ – హైదరాబాద్
పదేళ్లు దాటిన ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ గడువు పొడిగించింది. ఈమేరకు సంస్థ సీఈవో ప్రకటన విడుదల చేయగా, గడువు ముగిసినా అప్‌డేట్‌ చేసుకోని వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. దశాబ్దానికోసారి ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడం మస్ట్‌ కాగా, ఈ ఏడాది మార్చి 15 నుంచి మొదటిసారిగా అవకాశం కల్పించింది. నాలుగు నెలల పాటు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొనగా, జిల్లాలో లక్షల సంఖ్యలో ప్రజలు ఆధార్‌ కేంద్రాల ఎదుట క్యూలైన్లు కట్టారు. అయినా, పూర్తి కాకపోవడంతో అనేక మంది మిగిలిపోయారు. యూఐడీఏఐ ఇచ్చిన నాలుగు నెలల గడువు ఈనెల 14తో ముగియడంతో, ఆధార్‌ నవీకరణ చేసుకోని వారంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 14 వరకు గడువు పొడిగిస్తూ భారత విశిష్ట ప్రాధికార సంస్థ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ గడువు ముగిసిన అనంతరం విధిగా డబ్బులు చెల్లించి, నవీకరించుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడంతో, అత్యవసరంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు జిల్లా వాసులు తొందరపడుతున్నారు. ఆధార్‌ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. అయితే, యూఐడీఏఐ నిబంధనల మేరకు ‘మై ఆధార్‌ ’ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లలో కూడా నవీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, పుట్టిన తేదీ, చిరునామాతో పాటు తాజాగా దిగిన ఫొటోను కూడా అప్‌లోడ్‌ చేసుకునే వీలు కల్పించింది.
వెబ్‌సైట్‌ https:// myaadhaar .uidai. gov.inలో ఆధార్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. ప్రొసీడ్‌ టూ అప్‌డేట్‌ అడ్రస్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసిన అనంతరం వచ్చే డాక్యుమెంట్‌ అప్‌డేట్‌పై క్లిక్‌ చేయాలి. అప్పటికే అందులో పొందుపర్చిన వివరాలన్నీ తెరపైకి వస్తాయి. వీటిలో సవరణ ఉంటే చేసుకోవాలని, లేకుంటే ఉన్న వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నెక్స్‌పై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత కనిపించే డ్రాప్‌ డౌన్‌ జాబితా నుంచి ప్రూఫ్‌ ఆఫ్‌ ఐడెంటిటి, ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రస్‌ డాక్యుమెంట్లు ఎంచుకుని, వాటి స్కాన్‌ కాపీలు అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి. పద్నాలుగు అంకెల అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ స్క్రీన్‌పై వస్తుంది. దానితో అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకునే వీలు కలుగుతుంది.

Spread the love