18 తరువాతే

After 18– కస్టడీ పిటిషన్‌పై విచారణ ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశం
– చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ విచారణ 19కి వాయిదా
అమరావతి : ఏపీ సిల్క్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల దుర్వినియోగం కేసులో సీిఐడీ నమోదు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణను ఈ నెల 18వ తేదీ వరకు చేపట్టరాదని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈలోగా ప్రతివాదులైన మంగళగిరి సీఐడీ ఎస్‌హెచ్‌ఒ, ఫిర్యాదుదారుడైన ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ కె అజరురెడ్డి తదితరులు తమ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్‌ కె శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని, ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్‌ కె శ్రీనివాస్‌రెడ్డి విచారణ జరిపారు. విచారణ ప్రారంభంలోనే తాను గతంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా చేశానని, అప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల్లో వాదనలు వినిపించానని, ఇప్పుడు ఈ కేసు విచారణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే (నాట్‌ బిఫోర్‌ మీ) చెప్పాలని న్యాయమూర్తి కోరారు. పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు తమకు అభ్యంతరం లేదని పిటిషనరు తరపున న్యాయవాది, ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో విచారణ చేపట్టారు. తొలుత సీఐడీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కల్పించుకుని కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు వారం రోజులపాటు గడువు కావాలని కోరడంతో అందుకు న్యాయమూర్తి అనుమతించారు. వెంటనే చంద్రబాబు తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కల్పించుకుని, చంద్రబాబును ఏసీబీ కోర్టు ఈ నెల 10న రిమాండ్‌ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో చంద్రబాబును విచారించేందుకు ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసిందని గుర్తు చేశారు. కింది కోర్టులో విచారణ కొనసాగితే పిటిషనర్‌కు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎసిబి కోర్టులోని కస్టడీ పిటిషన్‌పై విచారణను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.
రాజకీయ కక్షతో కేసులో ఇరికించారు : లూథ్రా
అంతకుముందు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా వాదిస్తూ రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టినట్టు చెప్పారు. ‘పబ్లిక్‌ సర్వెంట్‌పై కేసు నమోదు/విచారణ చేయాలంటే అవినీతి నిరోధక చట్టం (సవరణ)లోని సెక్షన్‌ 17ఏ ప్రకారం గవర్నర్‌ (కాంపిటెంట్‌ అథారిటీ) అనుమతిని విధిగా తీసుకోవాలన్న నిబంధనను సీఐడీ ఉల్లంఘించింది. 17ఏ సెక్షన్‌ 2018 జులై 26న అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2021లో సుప్రీంకోర్టు కాంపిటెంట్‌ అథారిటీ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తీర్పు చెప్పింది. ఈ కేసులో చంద్రబాబు విషయంలో సీఐడీ.. గవర్నర్‌ అనుమతి తీసుకోలేదు. ఒక్కసారిగా చంద్రబాబును నిందితుడిగా చేర్చి అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకం. ఎసిబి కోర్టు రిమాండ్‌కు పంపడం కూడా చెల్లదు. కేసు నమోదు, సిఐడి దర్యాప్తు, ఎసిబి కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలి. రిమాండ్‌ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకం. వాస్తవానికి ఈ కేసు ఎంపి, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే ప్రత్యేక కోర్టు పరిధిలోకి వస్తుంది. 2021 డిసెంబరు 9న నమోదు చేసిన ఈ కేసులో 22 నెలలు గడిచాక తీరుబడిగా కావాలనే చంద్రబాబును అందులో చేర్చుతున్నారు. తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి’ అని అంతకుముందు లూథ్రా వాదించారు.
మరో కేసులో నోటీసులు
అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ డిజైన్ల మార్పు పేరుతో జరిగిన భూదందాపై సీఐడీ 2022లో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Spread the love