– 40 గంటల ఉత్కంఠ అనంతరం ఏసీబీ కోర్టు తీర్పు
– రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు
– నేడు రాష్ట్ర బంద్‌కు ఏపీ టీడీపీ పిలుపు
విజయవాడ : ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాము కేసులో ఏపీ ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆరు గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ఆదివారం సాయంత్రం 6.50 గంటలకు న్యాయమూర్తి హిమబిందు తీర్పు వెలువరించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించారు. నంద్యాలలో శనివారం తెల్లవారుజామున చంద్రబాబును అరెస్టు చేస్తారని అర్ధరాత్రి సమయంలో వార్తలు వచ్చినప్పటినుంచి మొదలైన ఉత్కంఠ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు వీడింది. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో విజయవాడ కోర్టు నుండి రాజమండ్రికి పటిష్ట భద్రత మధ్య తరలించారు. రిమాండు వార్త తెలిసిన వెంటనే సోమవారం నాడు రాష్ట్ర బంద్ నిర్వహించాలని ఏపీ టీడీపీ పిలుపునిచ్చింది. దీనికి జనసేన మద్దతు ప్రకటించింది. సీపీఐ సంఘీభావం తెలిపింది. శనివారంనాడు మొదలైన టీడీపీ శ్రేణుల నిరసనలు ఆదివారం రాత్రి కూడా కొనసాగాయి. కోర్టు తీర్పు వెలువడ్డాక ఎకడికక్కడ రాస్తారోకోలు, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు దహనం వంటివి జరిగాయి. మరోవైపు వైసిపి కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్టు వార్తలు వచ్చినా డీజీపీ కార్యాలయం తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. జిల్లా అధికారులు ఎక్కడికక్కడ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. తీర్పు నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు, చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్థార్థ లూధ్రా వాదించగా, ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు. ఈ నెల 22వ తేదీ వరకూ జ్యుడీషియల్ రిమాండు విధించిన న్యాయమూర్తి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించడంతో అప్పటికే పోలీసులు రెండు కాన్వారులను సిద్ధం చేసి ఉంచారు. అయితే తీర్పు ఇచ్చిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయనకు 73 సంవత్సరాలని, మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారని, అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి తీర్పు ఇచ్చే వరకూ సుమారు 36 గంటలపాటు నిద్ర కూడా లేదని, మాజీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అలాగే కూర్చుండిపోయారని, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా బెయిల్ ఇవ్వాలని, లేదా హౌస్ అరెస్టుకు అవకాశం ఇవ్వాలని, ఎన్‌ఎస్‌జీ భద్రతలో ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించాలని న్యాయమూర్తిని కోరారు. సాధ్యంకాని పక్షంలో జైలులో సౌకర్యాలు ఉండే గది కేటాయించాలనీ మరోపిటీషన్ దాఖలు చేశారు. తీర్పు అనంతరం కోర్టుకు చేరుకున్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కంటతడి పెట్టుకున్నారు. కోర్టులోనే లోకేష్ కూడా కొంత ఉద్విగతకు లోనయ్యారు. ఏపీలో అవినీతి ఆరోపణలతో రిమాండుకు గురైన తొలి మాజీ సీఎం చంద్రబాబే.
కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటీషన్
చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండు విధించిన వెంటనే ఆయనను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏపీ ఏసీబీ కోర్టులో సీఐడీ తరపు న్యాయవాదులు పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి సోమవారం దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. అలాగే కౌంటర్ దాఖలు చేయాలనీ సూచించారు.
నేడు బంద్‌కు ఏపీ టీడీపీ పిలుపు
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏపీ టీడీపీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. చంద్రబాబు అక్రమ అరెస్టు, ఆ సందర్భంలో నిరసన తెలిపిన పార్టీ శ్రేణులపై జరిగిన పోలీసు దమనకాండ, జగన్ కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపట్టాలని నిర్ణయించామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
రాజమహేంద్రవరంలో పోలీసుల హై అలర్ట్
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది. నగరంలో 37 చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. సెంట్రల్ జైల్ రోడ్డును మూడు కిలోమీటర్ల మేర బ్లాక్ చేశారు. నగరంలోని టీడీపీ ముఖ్య నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు. నంద్యాలలో మాదిరిగా ఘర్షణలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. నగరం మొత్తం పోలీసులు మోహరించారు.