అక్బరు అనంతరం

After Akbarఅక్బరు ఆస్థానంలో క్రీ.శ.1580 – 90 మధ్య అనుభవజ్ఞులైన కళాకారుల వలన కళల నైపుణ్యం గొప్ప ఎత్తుకి ఎదిగింది. పర్షియన్‌, భారతీయ, యూరోపియన్‌ శైలి, పద్ధతుల కలగలుపు, మిశ్రమాల సంతులనం అనిపించే చిత్రాలు వెలికి తెచ్చారు నిపుణత గల కళాకారులు. ఆ సమయంలో యూరోపియన్‌ మిషనరీ వారు అక్బరు ఆస్థానానికి క్రైస్తవ ప్రచారం కోసం క్రైస్తవ గ్రంథాలు తీసుకువచ్చినప్పుడు, అక్బరు వాటి శైలి కొత్తదనం ఇష్టపడి ప్రతి లిపిలు చేయించడం వలన కళాకారులకు ఆ పద్ధతి నేర్చుకోవటానికి అవకాశం దొరికింది. యూరోపియన్‌ చిత్రాలలో దగ్గర వస్తువు దగ్గరగా, దూరపు వస్తువు దూరంగా చూపించే పద్ధతి అక్బరు ఆస్థాన చరిత్రకారులని ఆకర్షించింది. ఆ విధంగా దగ్గర, దూరం అనే వివరాలు చిత్రంలో చూపడానికి వీరు మరో విధానం కనుగొని, అలాంటి కొత్త శైలిలో చిత్రాలు వేయప్రారంభించారు.
ఆ తరువాత అక్బరు ఆస్థానంలో రాజకీయ విషయాలతో పాటు చిత్రకళలలోనూ ఒడిదుడుకులు రావడం మొదలయ్యాయి. ఇతను తన రాజధానిని క్రీ.శ. 1585లో ఫతేపూర్‌ సిక్రి నుండి లాహోర్‌ కి మార్చాడు. 14 ఏళ్ల తరువాత క్రీ.శ. 1598లో మళ్లీ మొదటి స్థలానికి తిరిగి వచ్చాడు. ఇందుకు కారణం అతని కొడుకు సలీమ్‌ తిరుగుబాటు ప్రవర్తన. క్రీ.శ. 1600 లో సలీం తన మహల్‌ చిత్రకారులని తీసుకుని అలహాబాద్‌ వెళ్లిపోయాడు. పర్షియన్‌ చిత్రకారుడు ఆకారిజా, అతని కొడుకు అబుల్‌ హసన్‌, మిర్జాగులామ్‌ వంటి ఉద్దండ చిత్రకారులు, వారి వద్ద కొందరు చిత్రాలు నేర్చుకుంటున్న వారూ సలీంతో పాటు అలహాబాద్‌ చేరారు. అక్కడ వారు సలీం మహల్‌లో చిత్రాలు గీయడం మొదలుపెట్టారు. ఈ చిత్రకారులూ అక్బర్‌ ఆస్థానంలో పనిచేసిన వారే కదా! వీరు ఇక్కడ వేసిన చిత్రాలకూ, అక్కడ అక్బరు ఆస్థానంలో వేసిన చిత్రాలకూ పోలిక కన్పించడం మొదలుపెట్టింది. రెంటిలోనూ అరబిక్‌ డిజైన్లు, పుష్పాలు చిత్రించిన విధానాలలో పోలికలు కన్పించాయి. పోట్రేటు ప్రతిమ చిత్రాలు రెండుచోట్లా కలిపి సంఖ్య పెరిగింది. ఇవన్నీ కలిపి పెద్ద ఆల్బములు కూర్చారు.
అక్బరు అనంతరం సలీమ్‌ క్రీ.శ. 1605లో సింహాసనం ఎక్కాడు. అతని పేరు జహంగీర్‌ లేదా నూరుద్దీన్‌గా మారింది. అంతకు ముందు ఎన్నో రకాల కళలు వేస్తూ, ఎంతో గొప్ప పరిధిలో పనిచేస్తున్న మొగలు చిత్రకారుల కార్ఖానా ఒక పరిధిలోకి కుదించబడింది. పేరున్న కళాకారులకు పెద్ద కళాకారులకు మటుకే చిత్రాల కార్ఖానాలో స్థానం దొరికింది. యువ కళాకారులకు స్థానం లేకపోయింది. పెద్ద కళాకారులు అలవాటు ప్రకారం ఒకరకమైన చిత్రాలు వేస్తుంటే అవి మటుకే బయటకు రావడం మొదలెట్టినాయి. అందువలన వైవిధ్యం తగ్గింది. కొత్తదనం, వ్యత్యాసం లేని చిత్రకళ చిత్రించబడింది. ఆ చిత్రకారులు ఒక్కరాజుని గురించి, రాజ దర్బారు, వేట, విహార విషయాలూ ఇవి మటుకే రాజుకు నచ్చే విధంగా చిత్రించమొదలుపెట్టారు. రాజుకు నచ్చకపోతే అలాంటి చిత్రాలు వేసిన వారిని దర్బారు నుండి తీసివేయడం జరిగింది. వారు వేరే రాజ ఆస్థానాలు, దాతలను వెత్తుకుంటూ వెళ్లిపోయారు. ఆ విధంగా మొగల్‌ చిత్రశైలి, దక్కని రాజస్థాన్‌ రాజ్యాలకు పాకింది.
జహంగీర్‌ పోట్రేటు చిత్రాలు అందులోనూ నూతన పోట్రేటు చిత్రాలు ఎక్కువ ఇష్టపడ్డాడు.
తన జ్ఞాపకాలని, తన జీవన విషయాలను ‘కథలా’ అనిపించేలా చిత్రాలు చిత్రింపజేశాడు. ఆ చిత్రాల గ్రంథం పేరు ‘జహంగీర్‌ నామా’. ఇతనికి ఉన్న చిత్ర సౌందర్యపిపాస, ప్రకృతి, జీవ, జంతు విషయాలు, విశేషాలపై వున్న ప్రీతి ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ఇతనికి పర్షియన్‌ శైలి చిత్రాలంటే ఇష్టమనే విషయమూ ఈ గ్రంథం ద్వారా అర్థం అవుతుంది. ఈ గ్రంథంలో జహంగీర్‌ మాటలూ కొన్ని నమోదు చేయబడ్డాయి. జహంగీర్‌ మాట ప్రకారం అతను చిత్రాన్ని వివరంగా పరిశీలించి ఆనందిస్తాడు. చిత్రం మీద కళాకారుడి పేరు లేకపోయినా, ఎవరు ఆ చిత్రం వేశారో, ముఖం ఎవరు, కళ్లు, కనుబొమ్మలు ఎవరు గీశారో కూడా చెప్పగలుగుతాడు.
జహంగీర్‌ ఆస్థానంలో అబుల్‌ హసన్‌ చిత్రాలంటే ఇతనికి ఎంతో ఇష్టం. ఇతను క్రీ.శ. 1600 – 1628 మధ్య చురుకుగా పనిచేసి, రాజవంశ పోట్రేటులు చిత్రించాడు. ఆనాటి దృశ్యాలకు పర్షియన్‌ శైలి మెరుగులు దిద్ది చిత్రించేవాడు. అబుల్‌ హసన్‌ తండ్రి మొగల్‌ ఆస్థాన్‌ చిత్రకారుడవడం వల్ల అక్కడే పుట్టి పెరగడం వల్ల అతనికి ఆనాటి విషయాలను అంతే సులువుగా చిత్రాలుగా మార్చగలిగాడు. ఉస్తాద్‌ మంసూర్‌ చిత్రాలన్నా జహంగీర్‌కి చాలా ప్రీతి. ఇతని చిత్రాలు క్రీ.శ. 1589 – 1628 మధ్య కనిపిస్తాయి. ప్రకృతి, జీవ, జంతు సంపద చిత్రాలపై ఇతని చిత్రాల పట్టు కనిపిస్తుంది. చేయి తిరిగిన సుతిమెత్తని గీతలతో పలుచటి రంగు పొరలు దిద్దిన ఇతని చిత్రం ఇతనికే గుర్తులా వుంటాయి. జహంగీర్‌ ఈ మంసూర్‌ అనే కళాకారుణ్ణి కాశ్మీర్‌ పంపి, అక్కడి వసంతం, పూలు, ప్రకృతి వివరంగా చిత్రించమని పురమాయించాడు. అతను కనీసం వంద రకాల పూలను పరిశీలించి, చిత్రాలు గీసి తెచ్చాడు. ఆ చిత్రాలను ఆ తరువాత కూడా మళ్ళీ మళ్లీ చిత్రాలలో చిత్రించడం జరిగింది. బిష్ణుదాస్‌ అనే మరో చిత్రకారుడు విషయాన్ని ‘ఇది నిజం’ అనిపించేలా గొప్ప నైపుణ్యంతో చిత్రించగలడు. అందుకని అతనిని షా అబ్బాస్‌ అనే రాజు పోట్రేట్‌ చిత్రం చిత్రించడానికి పంపాడు. ఆ రాజుని జహంగీర్‌ ఎప్పుడూ కలవలేదు. రాజులని, వారి వ్యక్తిత్వాలను పోట్రేటులా చిత్రం గీయించి చూసి అర్ధం చేసుకునే పద్ధతి ఇతని తండ్రి అక్బరు మొదలుపెట్టాడు. బిచిత్ర అనే చిత్రకారుడు క్లిష్టమైన చారిత్రాత్మక విషయాలు చిత్రించేవాడు. మొహమ్మద్‌ షరీఫ్‌, బసవన్‌, మిస్కీన్‌, మనోహర్‌, దౌలత్‌, ఫరుఖ్‌బేగ్‌, గోవర్ధన్‌ అనే కళాకారులు అక్బర్‌, జహంగీర్‌ ఇద్దరి వద్ద పనిచేశారు.
జహంగీర్‌ కళాప్రేమ యూరోపియన్‌ చిత్రాలు సేకరించడం వరకూ పాకింది. అతను రాజు కాకముందు నుండీ ఆ చిత్రాలు సేకరించాడు. జేవియర్‌ అనే క్రీస్తు మత ప్రవక్త ఈ విషయాలను తన ఉత్తరాలలో రాశాడు. ఆల్బర్ట్‌ డ్యూరర్‌ అనే జర్మన్‌ కళాకారుడి చిత్రాలు జహంగీర్‌ సేకరించగా, అబుల్‌ హసన్‌ చిత్రకారుడు, వాటికి ప్రతిలిపీ, రంగులు చిత్రించాడు. నాదిరాబాను అనే స్త్రీ కళాకారిణి కూడా అబుల్‌ హసన్‌ శిష్యరికంలో ఈ చిత్రాలకు రంగులు దిద్దింది. ఒకటవ జేమ్స్‌ అనే ఇంగ్లండు రాజుగారి రాయబారి సర్‌ థామస్‌రో క్రీ.శ. 1615లో జహంగీర్‌ ఆస్థానానికి వచ్చి 4 సంవత్సరాలు గడిపాడు. జహంగీర్‌ అతనితో యూరోపియన్‌ చిత్రాలను తెప్పించాడు. వాటికి అతని ఆస్థాన చిత్రకారులు ప్రతిలిపిలు చిత్రించగా ఏది అసలు చిత్రం, ఏది ప్రతిలిపి అని ఆ రాయబారి కూడా చెప్పలేకపోయాడు. జహంగీర్‌ ఆస్థాన చిత్రాలలో ఈ యూరోపియన్‌ చిత్రాల ప్రభావం ఎక్కువగానే కనిపించడం మొదలైంది. ఒక చిత్రంలో జహంగీర్‌ని భూగోళంపై నిలబెట్టి, అతని శిరస్సు వెనుక చంద్రుడో, సూర్యుడో వెలుగు ఇస్తున్న ప్రభతో చిత్రించి అతను ఈ విశ్వానికే రాజు అని చూపడం జరిగింది. ఇలా అతని పరిపాలన, రాజ్యం గురించే గొప్పగా చెప్పగల చిత్రాలు చాలా, ఈ యూరోపియన్‌ చిత్ర ప్రభావంతో చిత్రించారు. రంగులు, ప్రకృతి దృశ్యాలు, జంతువులు, పక్షులు ఒకదానిని ఒకటి వేటాడే దృశ్యాలు… ఇలా ఎన్నో రకాల చిత్రాలతో చిత్రపటానికి వెడల్పు అంచులు చిత్రించేవారు. ఈ అంచులు ఏ రాజ్య కాలానికి చెందినవీ అని గుర్తించేటట్టు వుంటాయి.
క్రీ.శ. 1611లో జహంగీర్‌ నూర్‌జహాన్‌ అనే ఒక పర్షియన్‌ సుందరిని వివాహమాడాడు. ఆమె వస్త్రాల డిజైన్‌లు దిద్దేది. రాజ్యభారం కూడా తీసుకుని నడిపించేది. ఆమె పేరు మీద నాణాలు కూడా అచ్చువేశారు. ఆమె అడవివేటలోనూ నిపుణురాలు. ఒకసారి జహంగీర్‌ తన రాణీవాసంతో కలిసి వేటకు వెళ్లాడు. పెద్ద పులులు వేటాడే దూరంలో కనిపించగానే నూర్‌జహాన్‌ రాజును అడిగింది. రాజు గనక అనుమతి ఇస్తే, తనే ఆ పులులను తన తుపాకీతో వేటాడగలదని. రాజు అనుమతించగా ఆమె 4 పెద్ద పులులను చంపింది. 2 సార్లు పేల్చి రెండు పులులను, మరో రెండు సార్లు తుపాకి గుళ్లు పేల్చి రెండు పులులను పడగొట్టి, మరి రెండు గుళ్లతో ఆ రెంటినీ చంపింది. అలాంటి వేట ఇప్పుటి వరకూ చూడలేదని, ఏనుగుపై అంత ఎత్తున హోదాలో కూర్చుని, 6 తుపాకీ గుళ్లతో ఒక్కసారి కూడా గురి తప్పకుండా 4 పులులను కదలనీయకుండా కాల్చి చంపిందని, జహంగీర్‌ మురిసిపోయాడు. బహుమానంగా ఆమెపై వేయి అష్రఫీలు వెదలజల్లడమే కాక, లక్ష రూపాయల విలువ గల వజ్రాల చేతి కడియాల జత చేయించాడు ఆమె కోసం.
జహంగీర్‌ ముసలితనంలో వేసిన ప్రతిమ పోట్రేటు ప్రకారం ఒక కిటికీ వద్ద కూర్చుని ఖురాను చదువుతూ కనిపిస్తాడు. వంగిపోయిన భుజాలు, నడుము వలన అది అతని ముసలితనం చిత్రం అని గుర్తించవచ్చు. తెల్లటి బట్టలలో కూర్చుని ఉన్న అతను చివరి దశలో వేదాంతిలా జీవించాడని చెప్పడానికి గుర్తుగా చిత్రించారు చిత్రకారులు.
క్రీ.శ. 1627లో కాశ్మీర్‌ నుండి తిరిగి వస్తూ లాహోర్‌ వద్ద జహంగీర్‌ మరణించాడు. అతని కొడుకు, అక్బరు ముద్దుల మనుమడు షాజహాన్‌ ఆగ్రాలో సిహాసనం అధిష్టించాడు. షాజహాన్‌కి నవరత్నాలను గుర్తించి పరికించే నిపుణత వుంది. వజ్రాలు, నీలాలు, కెంపులు, ముత్యాలతో నింపి, పది మిలియన్‌ రూపాయల విలువ గల నెమలి సింహాసనం చేయించుకున్నాడు. క్రీ.శ. 1628 – 58 వరకూ సాగిన ఇతని పరిపాలనలో చిత్రాలు, నిర్మాణ సౌధాలు, సంగీతానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు. అతని కొత్త రాజధాని షాజహానాబాద్‌ నిర్మించి, అక్కడ ఎర్రకోట వద్ద జామిమస్జీద్‌ నిర్మాణం జరిపించాడు. అది ఈనాటి ఢిల్లీ ప్రాంతం. క్రీ.శ. 1632లో అతని ప్రియపత్ని ముంతాజ్‌ సమాధికి తాజ్‌ మహల్‌ అని ఒక ప్రపంచ వింతల్లో నిలిచిన నిర్మాణం నిర్మించాడు. అది ఒక పాలరాతి కవిత వంటిది.
షాజహాన్‌ ఆస్థానంలో చిత్రం మొదటిదశలో పూర్వపు మొగల్‌ రాజుల ఆస్థాన చిత్రాలనే గుర్తు తెచ్చినా, కొంత సమయం గడిచేటప్పటికి మరింత వృద్ధి చెందింది. ఈ చక్రవర్తి తన జీవిత చరిత్రని, ఆస్థానం, సైన్యం, విజయయాత్రలని ‘పాదషానామా’ అనే చిత్రాల గ్రంధంగా రాయబడింది. ఇతని కాలంలో వేసిన పోట్రెటులలో వ్యక్తి బాహ్యరూపమే కాక అంతర్గత వ్యక్తిత్వం కూడా అర్థం చేసుకుని చిత్రించడం మొదలు పెట్టారనిపిస్తుంది. ఇతని కాలంలో చిత్రకళ పొందిన మరొక మెట్టు ‘నీమ్‌ కలమ్‌’. కలం మరియు సిరాతో సుతిమెత్తటి గీతల చిత్రాలు గీసి అందులో వివరాలు, దూరం, దగ్గర అనే బేధాలు, ఆకారాలు అన్నీ ఈ కలం సిరాతోనే పూర్తి చేస్తారు. ఇందులో వివిధ రంగులు కాదు వాడేది. ఇందులో రాజుల వేట దృశ్యాలు కూడా వివరంగా చిత్రించబడ్డాయి. ఇతని వద్ద చిత్రకారులు కొంతమంది అక్బరు కాలం నుండి వున్న వారేను. ఆపై ఇతని ఆస్థాన కళలో వస్త్రాలు, గలీచాలు, ఆభరణాల డిజైన్లు కూడా మొదలయ్యాయి.

– డా||యమ్‌.బాలామణి, 8106713356

Spread the love