వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలి

– కేసీఆర్‌ కుటుంబ పాలనను ఇంటికి పంపాలి
– టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌
– షాద్‌నగర్‌ ముఖ్య కూడలిలో కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-షాద్‌నగర్‌
కేసీఆర్‌ కుటుంబ పాలనను ఇంటికి పంపాలని, రాహుల్‌ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం షాద్‌నగర్‌ ముఖ్య కూడలిలో కేటీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేటీఆర్‌ బొమ్మకు చావు డబ్బు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ దయా దక్షిణాలతో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన రాజ్యమేలుతుందని, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్‌, కేటీఆర్‌లకు లేదని అన్నారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ కోరాలని నినాదాలు చేశారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు తన అహంకారానికి నిదర్శనం అని అన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు పేరుతో రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం , రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనలేని ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని విమర్శించారు. రైతుబంధు పేరుతో వ్యవసాయ పనిముట్లను దూరం చేస్తూ, రైతులను దగా చేస్తున్న ఘనత కెేసీఆర్‌ ప్రభుత్వానికే చెల్లుతుందని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Spread the love