అప్పంపల్లి ఓ మానని గాయం

Appampally is a permanent wound– పోలీసులకు ఎదురొడ్డి నిలిచిన గ్రామం
– నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి 11మంది వీరమరణం
–  76 ఏండ్లు దాటినా నేటికీ అందని సహాయం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
అప్పంపల్లి పొలిమెరలోకి అడుగుపెట్టగానే మాయని గాయమేదో మనస్సుకు తాకుతున్నట్టు అనిపిస్తుంది. ఊరిలోకి పాదం మోపగానే వీరుల జ్ఞాపకాలు తట్టిలేపుతాయి. అమరుల త్యాగాలు యాదికొస్తాయి. నైజాం రజాకార్ల రాక్షస క్రీడకు సజీవ సాక్ష్యంగా రాగిచెట్టు నేటికీ ఉంది. దొరల గడీలో దొంగచాటుగా ఉండి కాల్పులు జరిగిన కిటికీ నేటికీ అద్దం పడుతోంది. నాటి నైజాం పోలీసుల రాక్షస క్రీడ గుర్తొస్తే రక్తం సలసల కాగుతుంది. ఈ రాక్షస క్రీడలో 11 మంది బలయ్యారు. తెలంగాణ విముక్తికోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన వారి స్ఫూర్తికి ప్రతీకగా నేటికీ అప్పంపల్లి వెగులు చిమ్ముతూనేవుంది.
మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి గ్రామంలో అక్టోబరు 7న 11 మందిని నైజాం పోలీసులు, రజాకార్లు పొట్టన పెట్టుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణ ప్రాంతం ఇంకా నైజాం నవాబుల చేతులో బందీగా ఉండటాన్ని నిరసిస్తూ.. వీరు అందోళనలు నిర్వహించారు. తెలంగాణకు స్వాతంత్య్రం కావాలని కర్నూల్‌ జిల్లా కాల్వ బుగ్గ దగ్గర ఉద్యమకారులకు శిక్షణ ఇచ్చేవారు. అక్కడ శిక్షణ పొందిన వారు అప్పంపల్లి, చింతకుంట, వడ్డెమాను తదితర గ్రామాల్లో ప్రజలను సమీకరించి చైతన్యం చేసేవారు. ఇది పసిగట్టిన నైజాం సర్కార్‌ పోలీసులు ఉద్యమాలను అణచివేయడానికి అప్పంపల్లి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఎదుర్కోవడానికి కారం పొడి, దుడ్డు కర్రలతో సిద్ధం కాగా, పోలీసులు గడీలో నుండే గాలిలోకి కాల్పులు జరిపారు. ప్రతిగా అప్పంపల్లి గ్రామస్తులు రాగిచెట్టు దగ్గరకు వచ్చి గడీలో ఉన్న పోలీసులను గడ్డి వేసి కాల్చే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన పోలీసులు 11మందిని కాల్చేశారు. చనిపోయిన వారిలో తంగెడి రారరెడ్డి, లక్ష్మారెడ్డి, బాల్‌రెడ్డి, చాకలి కుర్మన్న, పోతురాజు ఈశ్వరయ్య, కటికె నాన్నెమ్మ, హరిజన తిమ్మన్న, గొల్ల గజ్జలన్న, వడ్డెమాను నర్సన్న, కుర్వసాయన్న ఉన్నారు. వీరితోపాటు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా.. గ్రామస్థులు బెదరకుండా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న బెల్లం నాగన్న, నెల్లికొండి కిష్టారెడ్డిని పోలీసులకు చిక్కకుండా ఇతర ప్రాంతానికి తరలించారు.
అప్పంపల్లి బాధితులను ఆదుకోవాలి
తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిచిపోతున్నాయి. ప్రాణ త్యాగాలు చేసిన వారి కుటుంబాలు వీధిన పడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వాములైన అమరుల కుటుంబాలను ఆదుకోవాలి. అప్పంపల్లిలో నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరు చేసిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలి.
గుముడాల చక్రివర్తి గౌడ్‌, ఉపాధ్యాయుడు, అప్పంపల్లి
ఏ ప్రభుత్వమూ మాకు ఇచ్చిందేమీ లేదు.
ఉద్యమంలో మా కుటుంబం పాల్గొంది. ఆర్థికంగా చితికిపోయాం. మా నాన్న జైలుపాలు అయ్యాడు. మానాన్నను చంపాలని అనేక సార్లు ఊర్లో కాపలా పెట్టారు. గ్రామస్థులే ఆయన్ను కాపాడుకున్నారు. ఉన్న భూమి మొత్తం అమ్మి కేసుల చుట్టూ తిరిగాడు. ఇప్పుడు మాకు కనీసం తిండికి కూడా ఇబ్బంది ఉంది. నాకు 65 ఏండ్లు దాటినా పింఛను లేదు. ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు.
బెల్లం ఆంజనేయులు, అప్పంపల్లి, సీసీ కుంట- మహబూబ్‌నగర్‌ జిల్లా

Spread the love