కేజీబీవీ సిబ్బందికి టైంస్కేల్‌ వర్తింపచేయండి

– మంత్రి సబితకు పీఆర్టీయూటీఎస్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న సిబ్బందికి టైం స్కేల్‌ వర్తింపచేయాలని పీఆర్టీయూటీఎస్‌ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ కలిసి వినతిపత్రం సమర్పించారు. కేజీబీవీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ అదనపు బాధ్యతలను త్వరలోనే తొలగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కేజీబీవీల్లో కేర్‌టేకర్లను నియమిస్తామనీ, ఫైనాన్షియల్‌ గైడ్‌లైన్స్‌ను సవరిస్తామనీ, బియ్యం నేరుగా పాఠశాలకు సరఫరా చేస్తామనీ, ప్రత్యేక అధికారిని పేరును ప్రిన్సిపాల్‌గా మారుస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారని పేర్కొన్నారు. మినిమం టైం స్కేల్‌ వర్తింపు విషయంలో అదనపు బడ్జెట్‌ వివరాలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రతినిధులు ఝాన్సీ, మాధవి, సబిత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love