తలకిందుల వాదనలు

Arguments upside downఉదారవాద బూర్జువా ప్రజాస్వామ్యం నుంచి ఫాసిస్టు నియంతృత్వ పాలనగా జర్మనీలో ప్రభుత్వ స్వభావం మారడంలో 1933లో జర్మన్‌ పార్లమెంట్‌ (రీచ్‌స్టాగ్‌) భవనానికి జరిగిన అగ్ని ప్రమాదం ఒక కీలక ఘట్టం. నాజీలే ఆ అగ్ని ప్రమాదానికి కారకులు అని అనుమానించడానికి బల మైన ఆధారాలున్నాయి. కాని ఆ ప్రమాదానికి కమ్యూనిస్టులే కారకులంటూ తప్పుడు అభియో గాలు మోపి ఆ సాకుతో పెద్దఎత్తున భయోత్పా తాన్ని సృష్టించారు. అనేకుల్ని నిర్బంధించారు. వారిలో 81 మంది కమ్యూనిస్టు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు. దాంతో అంతవరకూ పార్లమెంటులో పూర్తి మెజారిటీ లేని నాజీలకు మంచి అవకాశం లభించింది.వాళ్లు జర్మనీని ఒక ఫాసిస్టు రాజ్యంగా మార్చివేశారు. రీచ్‌స్టాగ్‌ అగ్నిప్రమాదంలో నేరారోపణను ఎదుర్కొన్నవారిలో జార్జి డిమిట్రోవ్‌ కూడా ఉన్నారు. ఆయన బల్గేరియాకు చెందిన విప్లవకారుడు. ఆ సమయంలో జర్మనీలో ఉన్నారు.
విచారణ జరిగే సమయంలో డిమిట్రోవ్‌ తన కేసును తానే వాదించుకున్నారు. హిట్లర్‌ కుడి భుజంగా వ్యవహరిస్తున్న హెర్మన్‌ గోరింగ్‌ అప్పటి జర్మన్‌ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. అతడిని విచారించడానికి డిమిట్రోవ్‌ కోర్టును అనుమతి కోరాడు. ఆ కేసును విచారిస్తున్న న్యాయ మూర్తి హిట్లర్‌ ప్రభుత్వం ఎంపిక చేసినవాడే. అయినప్పటికీ కోర్టు గోరింగ్‌ను విచారించడానికి డిమిట్రోవ్‌కు అనుమతినిచ్చింది. ఆ విచారణలో డిమిట్రోవ్‌ హెర్మన్‌ గోరింగ్‌తో తలపడిన తీరు ఇప్పుడు జగత్ప్రసిద్ధం. తీవ్రంగా తనపై ఎదురుదాడి చేస్తూ పరుష పదజాలంతో, బెదిరింపులతో గోరింగ్‌ వ్యవహరించిన దానికి పూర్తి భిన్నంగా డిమిట్రోవ్‌ ఆ దాడిని చాలా ప్రశాంతంగా, సంయ మనంతో ఎదుర్కొన్నారు. చివరికి నాజీల కనుసన్నలలో నడిచే ఆ కోర్టు సైతం డిమిట్రోవ్‌ను ఆ కేసులో నిర్దోషిగా పరిగణిస్తూ విడుదల చేయవలసి వచ్చింది. ఆ తర్వాత డిమిట్రోవ్‌ కమ్యూనిస్టు ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. 1935లో కొమింటర్న్‌ ఏడవ అంతర్జాతీయ మహాసభలో ఫాసిజాన్ని ఎదిరించడానికి ఐక్యవేదికను నిర్మించే వ్యూహాన్ని ప్రతిపాదించాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌ 5న సుప్రీంకోర్టు ప్రొఫెసర్‌ షోమా సేన్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. అప్పటికే ఆమె బీమా-కొరెగావ్‌ కేసులో అరెస్టయి నిర్బంధంలో ఆరేండ్లుగా కొనసాగుతున్నారు. ఆమెకు ఎటువంటి ఉగ్రవాద చర్యలతోగాని, ఏ ఉగ్రవాద సంస్థలతోగాని సంబంధాలు ఉన్నట్టు ఏ ప్రాథమిక ఆధారాలూ కనిపించడం లేదని బెయిల్‌ మంజూరు చేసిన న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ ఆమె ఆరేండ్లపాటు జైలులో మగ్గవలసి వచ్చింది.
ఇక్కడ రెండు మౌలికమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది: ఎటువంటి విచారణా లేకుండా ఇంత దీర్ఘకాలం పాటు ఆమెను జైలుపాలుచేసి బాధించినందుకు ఈ ప్రభుత్వం బాధ్యత వహించవలసిన పని లేదా? అందుకు శిక్ష ఏమిటి? ఎటువంటి ఆధారాలూ లేవని సుప్రీంకోర్టే స్వయంగా పేర్కొన్నప్పుడు ప్రొఫెసర్‌ షోమా సేన్‌ నిష్కారణంగా అనుభవించిన నిర్బంధానికి బాధ్యు లెవరు? రెండవది: రాజ్యాంగంలో పొందుపరిచిన పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత ఉన్న వివిధ దొంతరలలోని న్యాయస్థానాలు ఈ ఆరేండ్లపాటూ ఆమె జైల్లో మగ్గుతూంటే ఏం చేస్తున్నట్టు?
”ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్‌ పొందడం అనేది ఒక హక్కు కాదు” అంటూ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతున్నప్పుడు ఎన్‌ఐఎ (జాతీయ నేర పరిశోధనా సంస్థ) వాదించింది. ఈ వాదనను సుప్రీంకోర్టు తన తీర్పులో తిరస్కరించింది. ఇది రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని భంగపరుస్తుందని తీర్పు చెప్పింది. ఐనప్పటికీ ఎన్‌ఐఎ ఆ దారుణమైన వాదనకే కట్టుబడి కొనసాగించింది. ఉగ్రవాద కార్యకలాపాలతోగాని, ఉగ్రవాద సంస్థలతోగాని సంబంధాలు న్నట్టు ఎటువంటి ప్రాథమిక ఆధారాలూ లేకపోయినప్పటికీ, బెయిల్‌ పొందే హక్కులేదని వాదిం చడం అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే ఎవరినైనా, ఎంతకాలమైనా జైలులో నిర్బం ధించవచ్చుననేగా? ఎన్‌ఐఎ కేంద్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తుంది. ఆ సంస్థను అడ్డం పెట్టుకుని ”బెయిల్‌ పొందే హక్కు లేదని” వాదిస్తూ, నిందితులుగా నిర్ధారించే ఏ ఆధారాలూ లేకుండానే ఎంతకాలమైనా నిర్బంధానికి గురి చేయవచ్చా?
సాధారణ న్యాయ సూత్రాలు ”ఒక వ్యక్తి నేరస్తుడిగా రుజువు కానంతవరకూ ఆ వ్యక్తిని నిర్దోషిగానే పరిగణించాలి” అని నిర్దేశిస్తున్నాయి. కాని ఇప్పుడు మోడీ ప్రభుత్వం అమలు చేయ బూనుకున్న న్యాయ సూత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ”ఒక వ్యక్తి నిర్దోషి అని నిర్ధారణకు వచ్చే వరకూ, విచారణ కాలమంతా, అసలు ఏ విచారణా చేపట్టకపోయినా కూడా, ఆ వ్యక్తిని దోషిగానే పరిగణించాలి” అన్న తలకిందుల న్యాయాన్ని అమలు చేయబూనుకుంటున్నారు.
షోమాసేన్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం చాలా ముదావహం. బెయిల్‌ రావడమే కాదు, సుప్రీంకోర్టు ప్రభుత్వం ముందుకు తెచ్చిన వికృత న్యాయసూత్రాన్ని కూడా తిరస్కరించింది. ఐతే, ఇదే చివరిమాటగా పరిగణించవచ్చా? ఇలా సందేహించడానికి వెనుక రెండు కారణాలున్నాయి: మొదటిది: ఈ తీర్పు దేశంలోని అత్యున్నత స్థాయి న్యాయస్థానంలో మాత్రమే లభించింది. దిగువ స్థాయి కోర్టుల్లో స్పందన ఇదే తీరుగా ఇంతవరకూ కానరావడం లేదు. ప్రభుత్వ అధికారం దుర్వినియోగం ఫలితంగా దెబ్బ తింటున్న వ్యక్తుల హక్కులను పరిరక్షించాలనే స్పృహ అన్ని స్థాయిలలోని న్యాయస్థానాలలోనూ నెలకొనాల్సి వుంది. రెండవది: ఈ కేసులో విచారణ ముగిసే సమయంలో బెయిల్‌ మంజూరు చేయడానికి తమకెలాంటి అభ్యంతరమూ లేదంటూ ఎన్‌ఐఎ తన వాదనను ఉపసంహరించుకుంది. షోమాసేన్‌ను ప్రశ్నించడానికి ఇంకేమీ లేదని కోర్టుకు తెలిపింది. ఇది ఎంత అర్ధం, పర్ధం లేని వాదన! గత ఆరేండ్లుగా ఆమెను ఎన్‌ఐఎ విచారి స్తూనే వున్నట్టు, విచారణకు ఆరేండ్ల సుదీర్ఘ సమయం అవసరమైనట్టు, ఇప్పుడు ఇక ఆ అవసరం లేనట్టు ఎన్‌ఐఎ వాదనలు ఉన్నాయి. మరి ఎందుకు ఎన్‌ఐఎ ఆ విధంగా వ్యవహరించింది? బెయిల్‌ మంజూరు చేయడానికి తమ అభ్యంతరాన్ని కొనసాగించినా సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినట్టయితే, ఇక ముందు రాబోయే కేసుల్లో కూడా ఇదేమాదిరిగా తీర్పులు వెలువడే ఆస్కారం ఉంటుంది. అందుచేత తమకు అభ్యంతరం లేదు కనుకనే బెయిల్‌ మంజూరైందని తక్కిన కేసుల్లో వాదించడానికి వీలుగా ఈ కేసులో అభ్యంతరాన్ని ఎన్‌ఐఎ ఉపసంహరిం చుకుంది. అప్పుడు తక్కిన కేసుల్లో తన తలకిందుల న్యాయాన్ని అమలు చేస్తూ పోవచ్చు.
ఈ మాదిరి వికృత న్యాయాన్ని ఆచరిస్తున్న వైనానికి మరో ఉదాహరణ ప్రబీర్‌ పురకాయస్థ కేసు. కేంద్ర నిఘా సంస్థలు చాలా కాలంగా ప్రబీర్‌ ఇంటి వద్ద, ఆఫీసులోను ఆధారాల కోసం తమ వేటను కొనసాగించాయి. కాని వాళ్లకి ఏ ఆధారమూ దొరకలేదు. ఈ లోగా 2023 ఆగస్టు 5న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పూర్తి అవాస్తవమైన, దుర్బుద్ధితో కూడిన ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాలో నివసిస్తున్న ఒక అమెరికన్‌ శతకోటీశ్వరుడిమీద కథనం అది. అతగాడు అభ్యుదయవాది. ప్రపంచంలో ఉన్న పలు వామపక్ష సంస్థలకు, ముఖ్యంగా అమెరికా సాగిస్తున్న యుద్ధ ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్న సంస్థలకు అతడు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ఆ కథనం ఆరోపించింది. అతడికి చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నట్టు గాని, ఏదైనా సంస్థకు తోడ్పడినట్టు ఆధారాలను కాని, మరేదైనా చట్టవ్యతిరేక కార్యకలాపానికి అతడు పాల్పడినట్టు కాని ఆ కథనం నిర్దిష్టంగా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం నిందలు మాత్రం మోపింది. అమెరికాలో యుద్ధ వ్యతిరేక వైఖరితో ఉన్న సంస్థలమీద విష ప్రచార దాడి చేయడమే ఆ కథనం వెనుక వ్యూహం. అదే సమయంలో తమను చట్టపరంగా సవాలు చేయడానికి వీలులేని విధంగా ఆ కథనం ఉంది. ఆ కథనంలో ఆ శత కోటీశ్వరుడి నుంచి న్యూస్‌ క్లిక్‌ సంస్థ లబ్ధి పొందినట్టు సూచనప్రాయంగా మాత్రమే ప్రస్తావించారు.
ఈ నిరాధార కథనానికి ఊతం ఇచ్చేలా మార్కో రూబియో అనే ఒక మితవాద సెనేటర్‌ (ఇతడు ఫ్లోరిడా నుండి ఎన్నికయ్యాడు) అమెరికన్‌ అటార్నీ జనరల్‌కు ఒక లేఖ రాశాడు. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ఆధారంగా అమెరికాలో పని చేస్తున్న తొమ్మిది యుద్ధ వ్యతిరేక ప్రచార సంస్థల మీదా విచారణ చేపట్టాలని ఆ లేఖలో కోరాడు. కాని అటువంటి విచారణ చేపట్టడానికి కావలసిన ప్రాథ మికమైన ఆధారాలేవీ లేవు. ప్రపంచంలో ఎక్కడబడితే అక్కడ ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కుల్ని కాలరాయడంలో వెనుకాడని అమెరికా తన దేశంలోని మానవ హక్కుల విషయంలో మాత్రం అప్పుడప్పుడూ కొంత జాగ్రత్త పడుతూ వుంటుంది. అమెరికాలోనే విచారణకు పనికి రాకుండా పోయిన ఆ న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ఇక్కడ మన దేశంలో మాత్రం ప్రబీర్‌ను, అతడి సహచరుడిని నిర్బంధించ డానికి ఒక సాకుగా వాడుకున్నారు. ఆధారమే లేకుండా విచారణ చేయడం సాధ్యం కాదన్న వైఖరిని సామ్రాజ్యవాద అమెరికా తీసుకుంటే, ఇక్కడి నయా ఫాసిస్టు ప్రభుత్వం మాత్రం తన తలకిందుల న్యాయంతో ”విచారించేంత కాలమూ నేరస్తులే” అన్న వైఖరిని అనుసరిస్తోంది.
అరెస్టు చేసిన ఆర్నెల్ల తర్వాత ప్రబీర్‌ పైన ఒక చార్జిషీటు దాఖలు చేశారు. అందులో ప్రబీ ర్‌ను నేరస్తుడిగా అనుమానించడానికి న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని ఒక ఆధారంగా చూపించారు. దాంతోబాటు ప్రభుత్వం ఇక్కడ అనుసరించిన కోవిడ్‌ నియంత్రణ విధానాన్ని విమర్శించిందని, రైతుల ఆందోళనను బలపరిచిందని న్యూస్‌క్లిక్‌ కథనాలను కూడా తోడు చేశారు! ప్రభుత్వ విధా నాలను విమర్శిస్తే అది చట్టాన్ని ఉల్లంఘించినట్టా?
భారత ప్రభుత్వం ఒక నయా ఫాసిస్టు పాలనను కొనసాగిస్తున్నా, భారత రాజ్యాంగానికి విరుద్ధంగా తలకిందుల న్యాయ సూత్రాలను పాటిస్తున్నా, భారతీయ న్యాయ వ్యవస్థ ఆ ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తూనే వుంది. అదే హిట్లర్‌ కాలంలో అయితే జర్మనీలో రీచ్‌స్టాగ్‌ కేసులో జర్మన్‌ న్యాయ వ్యవస్థ ఏకంగా హెర్మన్‌ గోరింగ్‌ను ఒక సాక్షిగా బోనులో నిలబెట్టడానికి గాని, ఆ కేసులో డిమిట్రోవ్‌ నిర్దోషి అని తీర్పు చెప్పడానికి కాని వెనుకాడలేదు. తద్వారా జర్మన్‌ న్యాయవ్యవస్థ నాజీల ఫాసిస్టు దూకుడుకు అడ్డుపుల్ల వేసింది. అంతమాత్రాన హిట్లర్‌ ఫాసిస్టు దూకుడు ఏమీ ఆగి పోలేదనుకోండి. కాని అక్క డి న్యాయవ్యవస్థ తన రాజ్యాంగ విధులను నెరవేర్చడంలో తన నిబ ద్ధతను ఎంతో కొంత ప్రదర్శించగలిగింది. మన భారతీయ న్యాయ వ్యవస్థ నుండి కూడా అటువంటి ప్రదర్శనను ఆశిద్దాం.
ఇటీవల పలువురు దేశంలోను, విదేశాల్లో కూడా ప్రసిద్ధులైన విద్యావేత్తలు, రచయితలు, ప్రముఖ వ్యక్తులు భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు. ఇక్కడ అధికార యంత్రాంగం సాగిస్తున్న దాడి నుంచి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిందిగా వారంతా చేసిన విజ్ఞప్తి ప్రస్తుత నేపథ్యంలో ప్రాముఖ్యత సంతరించుకుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love