ఇంకో జుమ్లా

Another sumప్రజల బాధలు, గాధలు, దు:ఖాలు, నిట్టూర్పులు, కండ్లనీళ్లు తుడవటం, ఇంటిల్లి పాదినీ కలవటం, ఓటు కోసం బతిమిలాడటం, దేబురించడం, అడుక్కోవటం అంతా ఓ దండుగ మారిపనిగా, ఔడ్డేటెడ్‌ వ్యవహారంగా భావించినట్టు ఉంది భారతీయ జనతా పార్టీ. పదేండ్ల అధికార అహంతో తెగించిందన్న విషయాన్ని ఆదివారం వారు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో చెప్పకనే చెబుతోంది. వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో దిశానిర్దేశం చేస్తుంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని, పైగా దిగజారిపోతున్నాయని ఇటీవల వెలువడిన నివేదికలు ఎండగడుతున్నాయి.
రైతులు, యువకులు, మహిళలు, పేదలే తమకు ముఖ్యమని చెప్పిన బీజేపీ… చివరకు తమ మేనిఫెస్టోలో వారినే విస్మరించింది. మరి వీరు లేని ‘వికసిత భారత్‌’నా బీజేపీ కోరుకోంటుంది? అసలు ఏ వర్గానికీ మేలు చేయని ఎన్నికల ప్రణాళికను కమలదళం అందమైన అబద్ధాలతో వండివార్చింది. బ్రిటీషు ఏలుబడిలో కంటే మోడీ పాలన లోనే భారతదేశంలో అసమానతలు అధికంగా ఉన్నాయని వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ అధ్యయనపత్రం హెచ్చరికలను పట్టించుకోని కమలనాధులు బీజేపీ సంకల్ప పత్రం పేరుతో ‘సంవిధాన్‌ బద్‌ లో పత్ర’ ను విడుదల చేశారు.
హిందూత్వ ఎజెండాతో మరోసారి అధికారంలోకి రావాలన్న కాంక్షతో హామీలను గుప్పిస్తున్నది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం, మహిళా రిజర్వేషన్‌ బిల్ల్లు, ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తెస్తామని ఆ పార్టీ చెబుతున్నది. ఆర్థికంగా దేశాన్ని ప్రపంచంలోనే మూడో స్థానంలోకి తీసుకొస్తామని ఇంతకు మించిన ప్రగతి ఏ దేశంలోనైనా సాధ్యమవుతుందా అని ఆ పార్టీ ప్రశ్నిస్తున్నది. కీలకమైన నిరుద్యోగం, పేదరికం, ధరల మంట గురించి ఆ పార్టీ ప్రస్తావించడం లేదు. అయితే అయోధ్యలో రామ మందిరం లాంటి భావోద్వేగ ఎజెండాతో మూడోసారి ఓట్లు కొల్లగొట్టాలని ఆలోచిస్తున్నది.
గత పదేండ్లలో తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నయా భారత్‌ను అడ్డుకోవడం అసాధ్యమని సాక్షాత్తు ప్రధాన మంత్రే సెలవిస్తున్నారు. కానీ, ఆకలి నుంచి ఆనందం వరకూ ప్రతీ విషయంలోనూ పరిస్థితులు దిగజారాయని, ఇరుగుపొరుగు చిన్నాచితకా దేశాలకంటే మన పరిస్థితి అత్యంత దయనీయమని అనేక సర్వేలు ప్రకటించాయి. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ అందుకు విరుద్ధంగా రైతాంగ వ్యతిరేక విధానాలు అమలు జరుపుతున్నారు. ఎంఎస్‌పీ అమలు ప్రస్తావన లేని ఎన్నికల ప్రణాళికలో వివాదాస్పద సిఎఎ అమలుకు మాత్రం హామీ ఇచ్చింది. అంతే కాదు, ప్రతి పదేండ్లకోకసారి జరిగే జన గణనను చేపట్టని అధికార పార్టీ…లౌకిక భారతాన్ని విచ్ఛిన్నం చేసే వినాశకర పౌరసత్వ చట్ట సవరణ- 2019ని ఎన్నికలనంతరం అమలు చేస్తామని చెప్పింది.
‘మోడీ గ్యారంటీ అంటే 24 క్యారెట్ల బంగారం వంటిది. అందుకే మాది ప్రపంచ పార్టీల మేనిఫెస్టోల్లోనే గోల్డ్‌ స్టాండర్డ్‌ మేనిఫెస్టో’ అని బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మరి ‘జన్‌ధన్‌’ ఖాతాలో రూ.15 లక్షల నగదు వేస్తమన్న హామీ సంగతేంటి? 2014 మ్యానిఫెస్టోలో ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. పదేండ్లలో ఆ హామీ అమలు కాలేదు. ఈసారి అసలు ఉద్యోగాల ముచ్చటే మ్యానిఫెస్టోలో పెట్టలేదు. కానీ, గిగ్‌ వర్క్‌ర్లకు ముద్రా లోన్‌ల కింద రూ.20లక్షల లోన్‌ ఇస్తామని చెబుతోంది. ఉపాధికి మౌలిక సదుపాయాలు కల్పించగుండా రూ.20లక్షల లోన్‌ ఇచ్చినా… రూ.60 లక్షల లోన్‌ ఇచ్చినా ఉపయోగం ఏంటి? ప్రభుత్వ పరంగా నిర్వహించిన జీ20 దేశాల సదస్సును కూడా వీరి ఖాతాలో వేసుకుంటున్నారు. అంతే కాదు భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించి సత్తా చాటుతాం అని కూడా వీరి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించిన ఎన్నికల ప్రణాళికలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరల అదుపు గురించి లేకపోవడం వైచిత్రి.
”ఉచితాల పేరుతో అధికారంలోకి రావాలన్న యావే తప్ప, వీటి వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమవు తుందన్న ధ్యాసే ప్రతిపక్షాలకు లేద”న్న ప్రధానమంత్రి, పదేండ్లలో చేసిందేమీ లేకపోవడంతో ఈ సారి ఎన్నికల్లో గెలిపిస్తే ఉచిత రేషన్‌, ఉచిత విద్యుత్‌, ఉచిత వైద్యం, ఉచిత ఇండ్లు పేరుతో ”ఉచిత పథకాల” జపం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, వాటిని తప్పు పట్టిన మోడీ తన మ్యానిఫెస్టోలో మాత్రం మొత్తం ఉచిత పథకాల హామీనే ఇచ్చారు. ఆయన ప్రభుత్వం గడిచిన పదేండ్లలో అమలు చేసిన పథకాలన్నీ అవసరమైన కొందరికే పరిమితం చేశారట..! రేషన్‌ బియ్యమైనా, రైతులకు ఆర్థిక సహాయమైనా, ఉచిత వైద్యమైనా, ఉచిత ఇండ్లయినా అదే జరిగింది. సుస్థిరత, సమర్థత, భద్రత, సంకల్ప్‌ లాంటి గంభీరమైన మాటలు జోడించి పేజీలు నింపారే తప్ప, నిజంగా భారతీయ సమాజం ఇవ్వాల ఏమి కోరుకుం టున్నదో గుర్తించి, దానిపై పార్టీ విధానం ప్రకటించలేదు. బహుశా, ఇదే బీజేపీ విధానమేమో..!

Spread the love