ఈవీఎంల రవాణాకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలి

– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌
నవతెలంగాణ-ఖమ్మం
లోక్‌సభ సాధారణ ఎన్నికలకు ఈవీఎంల రవాణాకు పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వీపీ. గౌతమ్‌ అన్నారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి, నూతన కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో అధికారులతో ఇవిఎం ల రవాణా, స్ట్రాంగ్‌ రూం ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కలెక్టరేట్‌ లోని ఇవిఎం ల గిడ్డంగి నుండి, సెగ్మెంట్ల వారిగా కేటాయించిన ఇవిఎంలను ఆయా సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూం లకు రవాణా చేయాలన్నారు. రవాణాకు 15 ఆర్టీసీ డిజిటి వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. రవాణాలో జాగ్రత్తలు పాటించాలని, కలెక్టరేట్‌ గోడౌన్‌లో లోడ్‌ పిదప, వాహనం గమ్యస్థానంలో ఆగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల్లో ఇవిఎంల లోడింగ్‌ కు కార్యాచరణ చేయాలన్నారు. ఖమ్మం, పాలేరు సెగ్మెంట్లకు ఖమ్మం గ్రామీణ మండలం పొన్నెకల్‌ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్‌ కళాశాల, వైరా సెగ్మెంట్‌ కి వైరా లోని సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాల, మధిర సెగ్మెంట్‌ కి మధిర పాలిటెక్నిక్‌ కళాశాల, సత్తుపల్లి సెగ్మెంట్‌ కి సత్తుపల్లి లోని జ్యోతి నిలయం హైస్కూల్‌ లలో ఇవిఎం గోడౌన్‌ స్ట్రాంగ్‌ రూంల ఏర్పాటు జరుగుతున్నట్లు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మే 12 న సెగ్మెంట్లలో ఏర్పాటు చేయు డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది కొరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల్లో వినియోగించే బస్సు డ్రైవర్‌ లకు ఓటు వినియోగానికి ఫారం-12 డి లు ఇచ్చి, పోస్టల్‌ బ్యాలెట్‌ కు ఏర్పాట్లు చేయాలన్నారు. సెక్టార్‌ అధికారులకు వాహనాల ఏర్పాటు చేయాలన్నారు. వేసవి దష్ట్యా వడగాల్పులపై అవగాహనకు బస్సుల్లో పోస్టర్లు ప్రదర్శించాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి. మధుసూదన్‌ నాయక్‌, శిక్షణ సహాయ కలెక్టర్‌ మిర్నల్‌ శ్రేష్ఠ, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, జిల్లా రవాణా అధికారిణి ఆఫ్రీన్‌, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం పవిత్ర, కలెక్టరేట్‌ ఏవో అరుణ, ఎంవిఐలు వరప్రసాద్‌, వెంకట రమణ, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌లు మదన్‌ గోపాల్‌, రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love