రాజకీయ రొచ్చులోకి సైన్యం?

Army into politics?– ఎన్నికల ప్రయోజనాలకు
– సైనికులను వాడుకోజుస్తున్న కేంద్రం
– మాజీ అధికారులు, రక్షణ నిపుణుల ఆగ్రహం
– ప్రతిపక్షాల మండిపాటు
– హిందూత్వ ఎజెండా అమలుకే ఈ ఎత్తుగడలని ధ్వజం
– మత రాజకీయాలతో గట్టెక్కే యత్నం
ప్రజల అభివృద్ధిని, అకాంక్షలను ఎన్నికల ఎజెండాగా మోడీ బృందం అస్సలు గుర్తించదు. ఎన్నికలు రాగానే మత రాజకీయాలతో గట్టెక్కాలనుకుంటుంది. తాజాగా పార్లమెంటుకు సెవిూఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అదే విధానాన్ని సాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ అధికారులను రథ్‌ ప్రభారీలుగా మార్చి తను ప్రచారానికి వినియోగించుకోవాలనుకుంటోంది. చివరికి సైన్యాన్ని కూడా ఈ రొచ్చులోకి లాగాలనుకుంటోంది. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దిగజారుడు తనానికి నిదర్శమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
న్యూఢిల్లీ : సాయుధ దళాలకు, రక్షణ మంత్రిత్వ శాఖకు ఇటీవలి కాలంలో మోడీ ప్రభుత్వం జారీ చేస్తున్న అధికారిక ఆదేశాలపై మాజీ సైనికాధికారులు, రక్షణ రంగ నిపుణులు, ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. సైన్యాన్ని రాజకీయ రొచ్చులోకి లాగడమేమిటని నిలదీస్తున్నాయి. సైన్యాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకునే ఉద్దేశంతో జారీ చేస్తున్న ఆదేశాలపై వారు విమర్శలు సంధిస్తూ బీజేపీ నేతలు తమ హిందూత్వ ఎజెండాను అమలు చేసేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
సాయుధ దళాలను రాజకీయాలకు దూరంగా ఉంచడం ప్రజాస్వామ్యంలో ఎంతో అవసరమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ప్రధానిని ఉద్దేశించి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ఓ లేఖ రాస్తూ సైనికులను ప్రభుత్వ పథకాల ప్రచారానికి మార్కెటింగ్‌ ఏజెంట్లుగా వాడుకోవడం సాయుధ దళాల రాజకీయీకరణ దిశగా ప్రమాదకరమైన అడుగు అని అభివర్ణించారు. ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం సైనిక దళాల సేవలను నిస్సిగ్గుగా వినియోగించుకుంటోందని ఓ సీనియర్‌ అధికారి విమర్శించారు. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం అర్రులు చాస్తున్న ఉన్నతాధికారులు ఈ ఎత్తుగడలకు వంతపాడుతున్నారని చెప్పారు. సైనిక దళాలలో నియామకాలు, పదోన్నతులు ప్రభుత్వ పెద్దల అభీష్టం మేరకే జరుగుతున్నాయని మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ఎస్‌. పనాగ్‌ తెలిపారు. సాయుధ దళాలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తోందని, ప్రభుత్వ చర్య ఫెడరల్‌ నిర్మాణాన్ని ఆక్రమించడమే అవుతుందని ఉత్తర, మధ్య సైనిక దళాల మజీ కమాండర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గత వారంలో ప్రాజెక్ట్‌ ఉద్భవ్‌ను ప్రారంభించారు. ప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక సైనిక పద్ధతులతో మేళవించి, ఆధునిక భద్రతా సవాళ్లను అధిగమిం చేందుకు ఓ విధానాన్ని రూపొందించడమే ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశం. భారత సైనిక దళాలు, న్యూఢిల్లీ లోని యునైటెడ్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ (యూఎస్‌ఐ) సంయుక్తంగా దీనిని నిర్వహి స్తాయి. అయితే ఈ ప్రాజెక్టును పలువురు మాజీ సైనిక ఉన్నతాధికారులు వ్యతిరేకించారు. ఆధు నిక కాలానికి ప్రాచీన విజ్ఞానం పనికిరాదని రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ బీఎస్‌ ధానోవా అభిప్రాయపడ్డారు. ఆధునిక సైనిక వ్యూహాలకు ప్రాచీన విజ్ఞానంతో పని ఏముందని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఘనతలను ప్రచారం చేసేందుకు దేశవ్యాప్తంగా 822 సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన కూడా విమర్శలకు దారితీసింది. ఇక మేలో న్యూఢిల్లీలోని సైనిక దళాల ప్రధాన కార్యాలయం అధికారికంగా ఓ సూచన చేస్తూ సెలవులో ఉన్న సైనికులందరూ తమ స్వస్థలాలలో ‘జాతి నిర్మాణం’ గురించి ప్రచారం చేయాలని తెలిపింది. జాతి నిర్మాణం అంటే మోడీ ప్రభుత్వ ఘనకార్యాలేనని వేరుగా చెప్పనక్కర లేదు. ఈ విధంగా మోడీ ప్రభుత్వం సైనిక దళాలను తమ విజయాల ప్రచారం కోసం వినియోగించు కోవడం, అది కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఎత్తుగడ వేయడంపై రక్షణ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love