‘ఆరోగ్య భారత్‌’ అందని ద్రాక్షేనా?

Is 'Arogya Bharat' a miracle?ముఖ్యంగా మనదేశంలో వైద్య రంగం దాదాపు ప్రయివేటీకరణ, కార్పోరేట్‌ వ్యక్తుల సంస్థల్లో ఉన్నదనేది వాస్తవం. అధిక ఫీజులు, స్కానింగ్‌, మందులు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పేద మధ్య తరగతి ప్రజలకు పూర్తిగా వైద్యం ఎండమావి వలే ఉన్నది. ముఖ్యంగా మహిళలు పిల్లలు రక్తహీనత, న్యూమోనియా, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా ఈ విషయాలను ధ్రువపరుస్తుంది. ప్రజలకు ఆరోగ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదే అయినా, మనదేశంలో మాత్రం ఇదో ఓట్లు దండుకునే కార్యక్రమంగా ఉచిత, సంక్షేమ పథకాలు అమల్లో భాగంగా చూడటం బాధాకరం.

1948 ఏప్రిల్‌ 7న ” ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)” ఏర్పడిన రోజునే 1949 నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రపంచ జనాభా అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో, అనేక వ్యాధులు నిర్మూలనకు కృషి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇటీవల కాలంలో మనందరం చూసిన ‘కరోనా’ విస్ఫోటనం మన ఆరోగ్య వ్యవస్థ ఎలా ఎంతగా దిగజారిందో బట్టబయలు చేసింది. అప్పటినుంచే ప్రపంచ దేశాలు, ప్రజలు ఆరోగ్య సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో నిమగమయ్యాఇయి. అయితే ఇటీవల వెల్లడించిన 2024 గ్లోబల్‌ హెల్త్‌ ఇండెక్స్‌ సూచికలో సింగపూర్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆఖరి స్థానంలో ఆఫ్రికా దేశమైన లెసోతో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి. మనదేశంలో ప్రతీ 10,189 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉన్నాడు. అందుబాటులో ఉన్న వైద్య నివేదికల ప్రకారం..మనదేశంలో 10 లక్షల మంది వైద్యులు రిజిస్టర్‌ కాబడి ఉన్నారు. వీరిలో 58 శాతం పట్టణ/నగర ప్రాంతాలలో సేవలందిస్తుండగా, కేవలం 18.8 శాతం వైద్యులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. ప్రపంచంలో స్పెయిన్‌, ఇటలీ, ఐస్‌లాండ్‌, జపాన్‌, స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, ఆస్ట్రేలియా వంటి దేశాలు ఆరోగ్య రంగంలో ముందంజలో ఉంటూ, ఆదేశ ప్రజలకు సురక్షిత ఆరోగ్యం అందిస్తున్నాయి. ఇక మన పొరుగు దేశమైన ‘భూటాన్‌’ తీవ్రంగా వైద్యుల కొరతతో సతమతమవుతోంది. ఈ దేశంలో ప్రతీ ఐదు వేల మందికి ఒక వైద్యుడు ఉండటం ఆందోళన కలిగించే అంశం. జపాన్‌ ప్రజలు మంచి ఆరోగ్యంతో ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక మన భారతదేశంలో అందరికీ ఆరోగ్యం అందని ద్రాక్షవలే ఉన్నది. 142 కోట్ల మందికి అవసరమైన డాక్టర్లు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఆసుపత్రులు అందుబాటులో లేవు. దీనికి ప్రధాన కారణం మనదేశ స్థూల జాతీయోత్పత్తిలో కేవలం ఒక శాతం నిధులు మాత్రమే నేటికీ కేటాయించడం జరుగుతోంది. ఇంత తక్కువ నిధులతో అందరికీ ఆరోగ్యం ఎలా అందిస్తారో… పాలకులకే తెలియాలి. ఈ ఏడాది ” మై హెల్త్‌ – మై రైట్‌” అనే థీమ్‌ తో జరుపుకుంటున్న ఈ ఆరోగ్య దినోత్సవం మనదేశంలో అందరికీ ఈ సౌకర్యం లభిస్తుందా? అనేది బిలియన్‌ డాలర్ల ప్రశ్న..!? కేరళ, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వైద్య రంగానికి బడ్జెట్లో నిధులు ఎక్కువగా కేటాయించి ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ, ప్రజల అందరికీ అందుబాటులో ఉంచుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల కూడా కొంత మేరకు ఆరోగ్య సేవలందించటం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ”ఆయుష్మాన్‌ భవ” వంటి కార్యక్రమాలు చేపడుతున్నా, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా నేటికీ మనదేశంలో నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులో లేదు. దీనికి ప్రధాన కారణం పేదరికం, నిరుద్యోగంతో పాటు ప్రభుత్వ విధానాలు. ముఖ్యంగా మనదేశంలో వైద్య రంగం దాదాపు ప్రయివేటీకరణ, కార్పోరేట్‌ వ్యక్తుల సంస్థల్లో ఉన్నదనేది వాస్తవం. అధిక ఫీజులు, స్కానింగ్‌, మందులు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో పేద మధ్య తరగతి ప్రజలకు పూర్తిగా వైద్యం ఎండమావి వలే ఉన్నది. ముఖ్యంగా మహిళలు పిల్లలు రక్తహీనత, న్యూమోనియా, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా ఈ విషయాలను ధ్రువపరుస్తుంది. ప్రజలకు ఆరోగ్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదే అయినా, మనదేశంలో మాత్రం ఇదో ఓట్లు దండుకునే కార్యక్రమంగా ఉచిత, సంక్షేమ పథకాలు అమల్లో భాగంగా చూడటం బాధాకరం.
ఇక మనదేశంలో వైద్య విద్య నేటికీ ఖరీదైన చదువుగానే పరిగణించబడుతోంది. ధనికులకు మాత్రమే లభ్యమవుతుంది. దీనికి ప్రధాన కారణం వైద్య కళాశాలలు ఎక్కువగా ప్రయివేటు రంగంలో నెలకొల్పారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య లభించుటలేదు. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో తగినంత బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో నాణ్యత గల విద్య అందిపుచ్చుకుని లేకపోవడం జరుగుతుంది. అందుచేతనే అమెరికా, రష్యా, చైనా, ఉక్రెయిన్‌, ఆస్ట్రేలియా వంటి విదేశాలకు విద్యార్థులు వలసపోతున్నారు.అక్కడే చదువుకుని, అక్కడే స్థిరపడుతున్నారు. అక్కడ ఉన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, ప్రభుత్వాల విధానాలు వారిని ఆకర్షించుట చేత అక్కడే వైద్యులుగా స్థిరపడుతున్నారు. ఇక మన భారతదేశంలో అనేక వివక్షతలు వెంటాడుతూనే ఉండుట, రాజకీయ విధానాలు, సౌకర్యాల లేమి వల్ల వైద్యులు, ఇతర సిబ్బంది ఇక్కడ పనిచేయుటకు సుముఖత చూపడం లేదు.
2047 నాటికి వికసిత భారత్‌ అనే లక్ష్యం చేరుకోవాలంటే ముందు అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలి. వైద్య రంగానికి ఇక నుంచైనా బడ్జెట్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఎక్కువగా కేటాయించి ఖర్చు చేయాలి. లైబ్రరీలు, లాబొరేటరీస్‌, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. రిసెర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని గ్రహించాలి. మగవారితో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో సమభాగం కల్పించాలి. వివక్షతలు లేకుండా చూడాలి. ఇప్పటికే మనదేశంలో ఊబకాయం, డయాబెటిస్‌, థైరాయిడ్‌, మానసిక అనారోగ్యం, వివిధ శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కల్తీలతో ఆహారం కలుషితమవుతుంది. వాయు కాలుష్యము, పెస్టిసైడ్స్‌ వలన కాలుష్యం మానవుని అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. జంక్‌ ఫుడ్స్‌, ఫ్రైడ్‌ ఐటమ్స్‌ తినుట వలన కూడా యవ్వనంలోనే అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. తస్మాత్‌ జాగ్రత్త. గుండె, ఊపిరి తిత్తులు, మూత్రపిండాల సంబంధించిన వ్యాధులు ప్రబలి తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం వలన కూడా అనారో గ్యాలతో బాధపడుతున్నారు. కనీసం ప్రతీ రోజూ ఒక గంట వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం చేయడం జరగాలి. పరిశుభ్రత పాటించాలి. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. అందరికీ ప్రభుత్వం మంచినీరు సరఫరా చేయాలి. ప్రజలు కూడా ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. పరిశుభ్రత పాటించాలి. ”ఆరోగ్యమే మహాభాగ్యము” అనే భావన అందరిలో కల్పించడమే ఈ దినోత్సవ పరమార్థం.
(నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)

– ఐ.ప్రసాదరావు 6305682733

Spread the love