ప్రతిపక్ష నాయకుల అరెస్టు దుర్మార్గం

Opposition leaders Arrest is misdemeanor– కాంగ్రెస్‌ అకౌంట్లను సీజ్‌ చేయడం అప్రజాస్వామికం
– కేజ్రీవాల్‌ను బేషరతుగా విడుదల చేయాలి
– సీఎంలను అరెస్టు చేయడం మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్య : వామపక్ష నేతలు ఎస్‌ వీరయ్య, అజీజ్‌పాషా, గోవర్ధన్‌, చలపతిరావు
– వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలోని ప్రతిపక్ష నాయకులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అరెస్టు చేయడం దుర్మార్గమని వామపక్ష పార్టీల నాయకులు విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు నాయకత్వం వహించే ముఖ్యమంత్రులను అరెస్టు చేయడం నిరంకుశ ధోరణులకు నిదర్శనమని అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అకౌంట్లను సీజ్‌ చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మోడీ ప్రభుత్వ నిరంకుశ చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘మోడీ ప్రభుత్వ నిరంకుశ వైఖరి నశించాలి, మోడీ హఠావో దేశ్‌కో బచావో, ఏక్‌ దో, ఏక్‌ దో మోడీ కో ఫేక్‌ దో’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ రాజ్యాంగం ఆధారంగా ఎన్నికైన మోడీ ఆ విలువలనే తుంగలో తొక్కుతున్నారనీ, నిరంకుశ పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. మోడీనీ, బీజేపీని ప్రశ్నించే వారిని, విమర్శించే వారిని సహించడం లేదన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ ద్వారా దాడులు చేసి తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారనీ, జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. బీజేపీ బ్లాక్‌మెయిల్‌ ఎత్తుగడలకు లొంగి ఆ పార్టీలో చేరితే ఎంతటి నేరస్తులైనా కేసులుండడం లేదన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో ఆప్‌ భాగస్వామ్య పార్టీగా ఉందని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారనీ, అంతకుముందు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరేన్‌ను అదే పనిచేశారని వివరించారు. ముఖ్యమంత్రులను అరెస్టు చేయడమనే కొత్త పద్ధతికి బీజేపీ తెరలేపిందన్నారు. రాజ్యాంగం, చట్టం, విలువలను పాటించకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్‌ అకౌంట్లను సీజ్‌ చేసి ఎన్నికల క్యాంపెయిన్‌కు డబ్బుల్లేకుండా చేశారన్నారు. బీజేపీని ఎవరు ప్రశ్నించినా ఇదే గతి పడుతుందంటూ ప్రతిపక్ష పార్టీలకు ఓ హెచ్చరిక చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, లౌకికవాదాన్ని కాపాడుకోవడానికి ప్రజలు పోరాడతారని అన్నారు. కేంద్రం తీరు మారకుంటే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా మాట్లాడుతూ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం సిగ్గుచేటనీ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. 400 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీకి 200 సీట్లు కూడా రావని చెప్పారు. హ్యాట్రిక్‌ సాధించే అవకాశం లేదన్నారు. బీజేపీ నిరంకుశ విధానాలను ప్రజలు గమనిస్తున్నారనీ, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తారని వివరించారు. పేదరికం, మీడియా స్వేచ్ఛలో భారత్‌ వెనుకబడి ఉందని అన్నారు. సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్‌, ఆరెస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చలపతిరావు, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌రాజా, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ హిందువులను రెచ్చగొట్టి మతరాజ్యాన్ని స్థాపించాలని మోడీ భావిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం పాలన సాగించకుండా ప్రజలను విభజిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు దేశంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా కూటమిని బలహీనపరిచే చర్యల్లో భాగంగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నరసింహారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌ బాల మల్లేష్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నేతలు మల్లు లక్ష్మి, టి సాగర్‌, ఎం శ్రీనివాస్‌, ఆర్‌ శ్రీరాంనాయక్‌, టి స్కైలాబ్‌బాబు, జె బాబురావు, అరుణజ్యోతి, లెల్లెల బాలకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, న్యూడెమోక్రసీ నాయకులు అనురాధ, మండల వెంకన్న, అరుణ, కోటేశ్వరరావు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love