ఆశాలు.. సెకెండ్‌ ఏఎన్‌ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు

– అమలుపై సమగ్ర రిపోర్టు ఇవ్వాలి :మంత్రి హరీశ్‌ రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు, సెకండ్‌ ఏఎన్‌ఎంలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలని వైద్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. దీనిపై సమగ్ర అధ్యయనం చేసి రిపోర్టు అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా ఆశాలు, ఏఎన్‌ఎంలతో మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఆశాలకు దేశంలోనే అత్యధిక పారితోషకం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మూడు సార్లు వేతనాలు పెంచామనీ, ప్రస్తుతం రూ.9,750 ఇస్తున్నామని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్‌ 14న నిర్వహించనున్న వైద్యారోగ్య దినోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ప్రసవాల్లో ప్రభుత్వాసుపత్రులు టాప్‌
ప్రసవాల్లో ప్రభుత్వాస్పత్రులు ముందు నిలవడమే కాకుండా దేశ చరిత్రలో 69 శాతం ప్రసవాలతో అవి రికార్డు సృష్టించాయని హరీశ్‌రావు తెలిపారు. ఎక్కువ ప్రసవాలు నమోదు చేసిన జిల్లాల సిబ్బందికి ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు. ఇమ్యూనైజేషన్‌ తక్కువగా నమోదవుతున్న సూర్యాపేట జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీనలకు సిబ్బందిని పంపి తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి జేడీని ఆయన ఆదేశించారు. మాతృత్వ ఆరోగ్య సంరక్షణ పనితీరులో చివరి స్థానంలో ఉన్న వనపర్తి, మహబూబాబాద్‌, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, సూర్యాపేట జిల్లాల్లో పురోగతి కనిపించాలని ఆదేశించారు. కనిష్ఠ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నట్టు గుర్తించిన 53 సబ్‌ సెంటర్ల పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ కు సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఈ- ఔషదీ’ ó ద్వారానే మందులు పంపిణీ చేస్తూ, మూడు నెలల కనీస నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమం విభాగం కమిషనర్‌ శ్వేతా మహంతి, రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love