మోడీ పాలనలో దాడులు పెరిగాయి

న్యూఢిల్లీ : మణిపూర్‌లో క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలపై ఇటీవల జరిగిన దాడులను కాథలిక్‌ సభ్యుల వేదిక తీవ్రంగా ఖండించింది. దీనిపై తన ఆందోళన వ్యక్తం చేస్తూ భారత కాథలిక్‌ బిషప్‌ల సదస్సుకు బహిరంగ లేఖ రాసింది. ప్రజా వ్యతిరేక ప్రభుతాన్ని తాము సమర్ధించబోమని, మౌనంగా ఉండలేమని ఆ లేఖలో స్పష్టం చేసింది. మణిపూర్‌ హింస తమను దిగ్భ్రాంతికి, అసహనానికి గురి చేసిందని కాథలిక్కులు ఆ లేఖలో తెలిపారు. మణిపూర్‌ హింసాకాండలో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 200 మంది గాయపడ్డారు. 30 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చివరికి క్రైస్తవులకు వ్యతిరేకంగా హింసకు దారి తీశాయని కాథలిక్‌ వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయని విమర్శిస్తూ కొందరు బిషప్‌లు బీజేపీ ప్రభుత్వానికి వంత పాడుతున్నారని మండిపడింది. దేశంలోని ముస్లింలు కూడా హింసకు గురవుతున్నారని, వారిని అడ్డు తొలగించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వేదిక స్పష్టం చేసింది.క్రైస్తవులపై దాడులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రెండు క్రైస్తవ సంస్థలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి. దాడులను నిరసిస్తూ జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఆ తర్వాత కొందరు మత పెద్దలు ప్రధాని మోడీకి వంత పాడుతూ ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో కాథలిక్‌ సభ్యుల వేదిక రాసిన బహిరంగ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.

Spread the love