అమర్ నాథ్ యాత్రలో ఈ ఆహార పదార్థాలపై బ్యాన్

నవతెలంగాణ – హైదరాబాద్
వచ్చే నెలలో ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్ర నిర్వహణ బాధ్యతలను శ్రీ అమర్ నాథ్ ఆలయ బోర్డు పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా యాత్రీకులకు బోర్డు పలు సూచనలు చేసింది. యాత్రీకుల ఆరోగ్యం దృష్ట్యా పలు ఆహార పదార్థాలపై నిషేధం విధించింది. ఇలాంటి పదార్థాలను అనుమతించబోమని, యాత్ర మధ్యలో ఏర్పాటు చేసిన హోటళ్లలోనూ ఆ పదార్థాలు అమ్మబోరని పేర్కొంది. 14 కిలోమీటర్ల ఈ యాత్రలో భాగంగా పర్వతాలు ఎక్కాల్సి ఉంటుందని, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే యాత్రను పూర్తిచేయగలరని బోర్డు సభ్యులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల యాత్ర మధ్యలో అనారోగ్యానికి గురైతే భక్తులు ఇబ్బంది పడతారని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

నిషేధించిన ఆహార పదార్థాలు ఇవే..
వేపుడు పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, జిలేబీ, గులాబ్ జామూన్ వంటి స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు, దోసెలు తదితర పదార్థాలను యాత్రీకులతో అనుమతించరు.

ఏం తీసుకు వెళ్లవచ్చంటే..
అన్నం, వేయించిన శనగలు, అటుకులు, ఊతప్పం, ఇడ్లీ, రోటీ, చాకొలెట్లు, ఖీర్, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, తేనె.. తదితర ఆహార పదార్థాలను తీసుకెళ్లవచ్చు.

Spread the love