ప్రభుత్వ కార్యాలయాల్లో ‘డ్రైవర్ కం ఓనర్’ దుస్థితి
తొమ్మిదేండ్లైనా రూ.34వేల కిరాయే
జీఎస్టీ, ఇన్సూరెన్స్, డ్రైవర్ వేతనం, డీజిల్ అంతా ఓనర్‌దే
రూ.65 నుంచి రూ. 103.82కు పెరిగిన డీజిల్ ధర
ఆర్థిక మంత్రి, ఉన్నతాధికారులకు
చేసిన విజ్ఞప్తులకు స్పందనేది?
ఆందోళనలో అద్దె కార్ల డ్రైవర్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ర్ట ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారుల కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌ఎంప్లాయిమెంట్ స్కీమ్ ‘డ్రైవర్ కం ఓనర్’ విధానాన్ని (1996) మూడు దశాబ్దాల క్రితం ప్రవేశ పెట్టింది. ఉన్నతాధికారుల కార్ల సౌకర్యం నుంచి తప్పించుకునేందుకు ఈ విధానాన్ని తెచ్చింది. ఈ పద్దతిలో ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేకుండా మొత్తం డ్రైవర్ కం ఓనర్‌పై భారాన్ని మోపింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్ని ఆ వ్యవస్థను మార్చకుండా దాన్నే కొనసాగిస్తూ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్దతిలో దాదాపు ఐదువేల అద్దె కార్లు (హైయ్యర్) నడుస్తున్నాయి. వీటిపై ఐదువేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. డ్రైవర్ కం ఓనర్ కింద ప్రభుత్వమే కార్ల ఓనర్లతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆ ఒప్పందం ప్రకారం డ్రైవర్ల బాగోగుల కంటే ఉన్నతాధికారులను తిప్పడమే వారి పని. అన్ని ప్రభుత్వాలు వారిన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న ధరలతో కార్ల నిర్వహణ ఖర్చులతో పెద్దగా భారంగా మారుతోంది.
బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లు క్రితం కార్ల అద్దెను రూ. 34వేలుగా నిర్ణయించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన అద్దెను కాంగ్రెస్ రెండున్నరేండ్లు కొనసాగిస్తున్నది. ఆ కిరాయి పెంచాలంటూ డ్రైవర్లు, ఓనర్లు ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన కరువైంది. విధిలేని పరిస్థితుల్లో మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అద్దెను రూ. 34వేల నుంచి రూ. 55వేలకు పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. తొమ్మిదేండ్లుగా కార్ల నిర్వహణ ఖర్చు బాగా పెరుగుతోంది. కానీ కార్ల అద్దెను మాత్రం ప్రభుత్వం పెంచడం లేదు. తొమ్మిదేండ్ల కింద డీజిల్ రూ. 65 ఉంటే,ప్రస్తుతం రూ. 103.85కు పెరిగింది. డ్రైవర్‌కు రూ. 8వేలు వేతనం ఇచ్చేది కానీ పెరుగుతున్న నేపథ్యంలో రూ. 18వేల వేతనం ఇస్తున్నారు. కారు సర్వీసింగ్ చేయించడానికి రూ. 2వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు సుమారుగా రూ. 6వేలు అవుతన్నది. ప్రతి నెల జీఎస్టీ రూ. 700 కూడా తప్పకుండా చెల్లించాల్సిందే. ఇన్సూరెన్స్ ఏడాదికి మరో రూ. 24వేలు ఓనరే భరించాల్సి వస్తోంది. ఇవి తప్పని సరిగా కార్ల నిర్వహణలో ఓనర్ కం డ్రైవర్ సాధారణంగా ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులే. ఇవీ కాకుండా 15 ఏండ్లు నిండిన కారుకు ఫిట్‌నెస్ చేయాల్సి వస్తే దానికి మూడు, నాలుగువేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఓనరే కారు నడుపుకుంటే అంతో ఇంతో మిగులుతోంది. కానీ ఓనర్ డ్రైవర్‌ను నియమించుకుంటే ఆయనకు మిగిలేది ఏమీ ఉండదు. దీంతో తన కుటుంబాన్ని పోషించడం కూడా వారికి కష్టంగా మారుతోంది. ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, వైద్యం ఖర్చులు మరింత భారంగా మారుతున్నాయి. పెరుగుతున్న ధరలు, కుటుంబ పోషణ కష్టంగా మారుతున్నది. వీటికి అనుగుణంగా కార్ల అద్దె ప్రతి నెల రూ. 55వేలు ఇవ్వాలని కోరుతున్నారు.
బిల్లుల చెల్లింపుల్లో ఆలసత్వం
ఉద్యోగులకు వేతనాలు చెల్లించినట్టుగా ఓనర్ కం డ్రైవర్ కింద ప్రభుత్వం అద్దెలు చెల్లించడం లేదు. బీఆర్‌ఎస్ హయాంలో మూడు నెలలకొసారి బిల్లులు చెల్లించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలళ్లకొసారి కూడా అద్దెలు చెల్లించడం లేదు. కొన్ని చోట్ల ఎనిమిదినెలలు గడిచింది. సకాలంలో కిరాయి రాకపోవడంతో అప్పులు చేసి కార్లను నడుపుతున్నారు. కుటుంబ పోషణకు కూడా చాలా ఇబ్బందిగా మారుతోంది. ప్రతి నెల చెల్లించాల్సిన అద్దెల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తున్నది. అద్దె ఇస్తలేరని ఇంటి వద్ద ఉంటే ఒప్పందాన్ని రద్దు చేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారు. డ్రైవర్ బాగోగులను ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారులు కార్లలో తిరుగుతున్నారు తప్ప కార్ల గురించి పట్టించుకోవడం లేదు. వారికి కావాల్సింది కారు వస్తుందా? లేదా? అనేదే ముఖ్యం.
అద్దె పెంచేదాకా పోరాటం
నర్సింగ్ యాదవ్, అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ హయ్యార్ వెహికిల్స్ అసోసియేషన్ పరిపాలనలో భాగస్వాములుగా ఉన్నాం. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వెంటనే ఎనిమిది నెలల నుంచి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. తొమ్మిదేండ్ల క్రితం నిర్ణయించిన రూ. 34వేల అద్దె ఏ మూలకు సరిపోవడం లేదు. ఇంటి కిరాయిలు పెరిగాయి. డీజిల్ ధరలు పెరిగాయి. పెరుగుతున్న కార్ల నిర్వహణ ఖర్చులను భరించలేకపోతున్నాం. వెంటనే కార్ల కిరాయి రూ. 34వేల నుంచి రూ. 55వేలకు పెంచాలి. కార్లకు అద్దె పెంచేదాక పోరాటం చేస్తాం.
బారెడు ఖర్చు..మూరెడు అద్దె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



