సెప్టెంబర్‌ 25న బీసీసీఐ ఏజీఎం

BCCI AGM on September 25– 2023 ప్రపంచకప్‌పైనే ప్రధాన చర్చ
ముంబయి : అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌లోని మొతెరా మైదానం అగ్ర జట్లు, గత వరల్డ్‌కప్‌ ఫైనలిస్ట్‌లు ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మెగా పోరుతో 2023 వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభానికి వేదిక కానుండగా.. అందుకు సరిగ్గా పది రోజుల ముంగిట భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక సమావేశానికి సిద్ధమైంది. సెప్టెంబర్‌ 25న ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బీసీసీఐ సమాచారం అందించింది!. చివరగా అక్టోబర్‌ 18, 2022న బీసీసీఐ ఏజీఎం సమావేశమైంది. వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐ.. ఇప్పటివరకు ఎక్కువగా విమర్శలే చవిచూసింది. షెడ్యూల్‌, టికెట్లను సైతం సరైన సమయంలో అభిమానులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఆరంభానికి ముందు చేదు సంఘటనలను మరిపించేలా.. ఆతిథ్యం ఇచ్చేందుకు బోర్డు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రపంచకప్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఏజీఎంలో ప్రధానంగా ఆతిథ్యంపైనే చర్చ సాగనుండగా.. ఐపీఎల్‌ 2023, మహిళల సీనియర్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ ఎంపిక సైతం చర్చించే అవకాశం కనిపిస్తోంది.
4న ఆరంభ వేడుకలు
అక్టోబర్‌ 4న వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. వన్డే వరల్డ్‌కప్‌లో పోటీపడుతున్న జట్ల కెప్టెన్ల సమావేశం సైతం అదే రోజు జరుగుతుంది. సాధారణంగా ఐపీఎల్‌ ఓపెనింగ్‌ సెర్మానికి బోర్డు రూ.20-25 కోట్లు ఖర్చు చేస్తుంది. ఐసీసీ వరల్డ్‌కప్‌ ఆరంభ వేడుకల కోసం రూ.50 కోట్ల వరకు వెచ్చించే అవకాశం లేకపోలేదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన ఉండనుంది. పాన్‌ ఇండియా, బాలీవుడ్‌ సినీ తారలు ఆరంభ వేడుకల వేదికపై నృత్య ప్రదర్శనలతో అభిమానులకు మధురమైన అనుభూతు లు మిగిల్చేలా బీసీసీఐ భారీ ఎత్తున ప్లాన్‌ చేస్తోంది.

Spread the love