భానుడి భగభగలు

ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే వణుకుతున్న జనం రోడ్లన్నీ నిర్మానుషం వికారాబాద్‌ 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు 40 డిగ్రీలకు తగ్గని ఉష్ణోగ్రత మరో వారంపాటు ఇదే పరిస్థితి అంటున్న వాతావరణ శాఖ
  ఉదయం 10-11గంటలకే రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. ఒక్కరూ కూడా బయటకు రావడం లేదు. అత్యవసరం ఉండి బయటకు వచ్చిన వారు అడపాదడపా అక్కడక్కడ కనిపిస్తున్నారు. దీన్నిచూసి ఆ రోజు ఆదివారమో, సెలవు దినమో అనుకుంటే పొరపాటే. గురువారం రోజు జిల్లాలో కనిపించిన దృశ్యం ఇది. దీనికి కారణం భానుడి భగభగలు. గతంలో ఎన్నడూ లేని విధంగా భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రికార్డు స్థాయిలో ఎండలు నమోదు కావడంతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 5గంటల తరువాతే బయటకు వచ్చే పరిస్థితి నెలకొంది. దారి తప్పి మిట్ట మధ్యాహ్నం బయటకు వస్తే అంతే సంగతులు. భానుడి ఉగ్ర రూపానికి బలి కావాల్సిందే. ఇందుకు నిదర్శనమే రంగారెడ్డి జిల్లాలో గరిష్టంగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు. జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలపై కథనం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 15 రోజుల నుంచి ఎండాల తీవ్రత ఎక్కువగా ఉంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 6 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదైంది. గురువారం రంగారెడ్డి జిల్లాలో 41.9 డీగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే రోజు గతేడాది 36.3 నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో గతేడాది 37.4 డీగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ఈ ఏడాది గురువారం 43.2 ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు మాడిపోతు న్నారు. పిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా తల్లిదం డ్రులు కంటికి రెప్పాలా కాపాడుకుంటున్నారు. ఇన్‌డోర్‌ గేమ్స్‌ ఆడుతూ పిల్లలు ఇంటికే పరిమితమవుతున్నారు. ఇక వివిధ పనుల మీద బయటికి వెళ్లాల్సి వస్తే ఎండాల భారీ నుంచి తప్పుచుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. నెత్తికి తలపాగ లేకుండా ఇంటి నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. టోపీలు, గొడుగులు వాడుతూ ప్రజలు ఇంటి నుంచి బయటికి వస్తున్నారు.
విద్యుత్‌ కోతలతో ఉక్కపోత
ఉష్ణోగ్రత తీవ్రత విద్యుత్‌ సరఫరాపై చూపుతోంది. విద్యుత్‌ వినియోగం ఎక్కువ కావడంతో సరఫరాలో అంతరాయాలు ఏర్పాడుతున్నాయి. దీంతో తరుచుగా విద్యత్‌ సరఫరా నిలిచిపోతుంది. ఇండ్లలో ఉక్కపోత అధికంగా ఉండటంతో ప్రజలు అల్లాడుతున్నారు. గంటల తరబడి కరెంటు పోవడం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భానుడి వేడికి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సైతం సరిపోవడం లేదు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే కచ్ఛితంగా టోపీ ధరించాలి. నెత్తికి రుమాలు కట్టుకోవాలి. దీని వలన వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. శరీరం డీ హైడ్రేషన్‌కు గురికుండా రోజు కచ్ఛితంగా 4-5 లీటర్ల నీరు తాగాలి. తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. ఫలితంగా వడదెబ్బ సోకుతుంది. అయితే ఇంటి నుంచి బయటకు వెళితే నీళ్ల బాటిల్‌ తీసుకెళ్లాలి. దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. అందులో నిమ్మరసం పిండుకుంటే ఇంకా మంచిది. ఇలా చేయడం వలన వడదెబ్బ బారి నుంచి రక్షించుకోవచ్చు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే చర్మానికి లోషన్‌ రాసుకోవాలి. దీంతో సూర్య కిరణాలు మనపై పడినా వడదెబ్బ సోకకుండా చేసుకునే వీలుంటుంది. ఎండా కాలంలో మద్యం తాగడం అంత మంచిది కాదు. శరీరం డీ హైడ్రేడ్‌ అయితే కోలుకోవడం కష్టం. అందుకే అల్కహాల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చలువ కోసం కొబ్బరి బొండాలు తాగడం ఉత్తమం.
– వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి

Spread the love