పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం
ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి : ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
గంభీరావుపేటలో కాంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ – గంభీరావుపేట
వరి గడ్డితో బయోగ్యాస్ ఉత్పత్తి చేయొచ్చునని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పంట వ్యర్థాలు, గడ్డిని కాల్చడం వల్ల భూమితోపాటు ప్రకృతి కలుషితం అవుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని పంతులుతోటలో బయో టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటెడ్, మాజీ ఎమ్మెల్యే పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం పంతులు ఆధ్యర్వంలో ఏర్పాటు చేసిన నూతన కాంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రులతో కలిసి భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం సమావేశంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాష్టంలో ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరారు. ప్రాణహిత- చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలన్నారు. ఎక్కువ కాలం రైతులకు ఆదాయం సమకూర్చే విధంగా బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆధునిక సాగు పద్ధతులతో వ్యవసాయం పండుగలా మారుతుందన్నారు. ఎండిపోయిన వ్యర్థాలను కాల్చడం వ¶లంగా పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉందని వివరించారు. మనం సమాజానికి ఏ రకంగా ఆహారాన్ని అందిస్తున్నామో అదే రకంగా కాలుష్యం లేని ప్రకృతిని అందించాలని సూచించారు. పంట మార్పిడి ద్వారా రైతులు అధిక లాభాలు పొందొచ్చని, ప్రభుత్వం కూడా సహకార అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేశాక.. కేంద్రం కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. ఎంఎస్పీ ప్రకారం పంటలు కొనుగోళ్లు చేయడంలో కేంద్రం వెనుకడుగు వేయడం సరికాదన్నారు. అది రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు.
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో పరిశ్రమలు ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మారుతున్న ప్రపంచం పరిస్థితులకు అనుగుణంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, రేపో మాపో పెట్రోల్ ధరలు కూడా పెరగొచ్చన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ కొరతను అధిగమించడానికి గ్యాస్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ లాంటివి ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
వరి గడ్డితో బయోగ్యాస్ ఉత్పత్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



