పండించిన ప్రతి గింజకూ
గిట్టుబాటు ధర : ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హనుమకొండలో మెగా రైతు మేళా ప్రారంభం
నవతెలంగాణ-సుబేదారి
రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వేదికగా మూడ్రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాను మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని సమగ్ర చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. రైతులకు అవసరమైన ఆధునిక యంత్రాలు, పరికరాలను సబ్సిడీపై అందజేస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రైతు వారోత్సవాలు, మెగా రైతు మేళాలు నిర్వహిస్తూ రైతులకు నూతన సాంకేతికతను పరిచయం చేస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదగడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే కారణమని చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజకూ గిట్టుబాటు ధర లభించేలా చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడారు. నాడు వైఎస్ నేడు సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, వ్యవసాయ సంబంధిత అంశాల గురించి రైతులు తెలుసుకోవాలని సూచించారు. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వ్యవసాయ శాఖ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన దాదాపు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. భూసార పరీక్షలు, ఇతర రైతు సంబంధిత అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మెన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పారు, డాక్టర్ సత్య శారద, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజిత్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానసరాం ప్రసాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, డీఆర్‌డీఓ మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారులు రవీందర్ సింగ్, రాజమణి, ఉద్యాన శాఖ అధికారి అనసూయ పాల్గొన్నారు.
రైతు పక్షపాతి ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



