బిర్యానీ రాజకీయాలు….!

Biryani politics...!– మతం రంగు పులుముతున్న కమలదళం
– ఈసీ నోటీసుకూ వెరవని ఆదిత్యనాథ్‌
– భోపాల్‌లో ఫెస్ట్‌నే నిర్వహించిన మజ్లిస్‌
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సీజన్‌లో బిర్యానీకి డిమాండ్‌ పెరిగిపోతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా బిర్యానీ రాజకీయాలే!. హైదరాబాద్‌, దేశ రాజధాని ఢిల్లీ, అవధ్‌, కొల్‌కతా నగరాల్లో బిర్యానీ ప్రియులు అధికంగా ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తమిళనాడులో కూడా బిర్యానీ పేరు మారుమోగుతోంది. బిర్యానీ మసాలా ఇప్పుడు రాజకీయాలను ఘాటెక్కిస్తోంది. ఓటర్లను ఆకర్షించడానికి వివిధ రాజకీయ పార్టీలు మద్యం, డబ్బుతో పాటు బిర్యానీ ప్యాకెట్‌ కూడా ఇచ్చుకుంటున్నాయి. వాస్తవానికి ఎన్నికల సీజన్‌ వచ్చిన ప్రతిసారీ బిర్యానీకి మంచి గిరాకీ ఉంటోంది.
మాంసం ముద్ద దిగాల్సిందే
ఓటర్లకే కాదు…ప్రచారంలో భాగస్వాములయ్యే పార్టీ కార్యకర్తలకు కూడా బిర్యానీ ప్యాకెట్‌ ఇవ్వాల్సిందే. తమిళనాడు రాజధాని చెన్నరులో ఈసారి బిర్యానీ కోసం విపరీతంగా అర్డర్లు వస్తున్నాయి. పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు తినిపించేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బిర్యానీని కొనుగోలు చేస్తున్నాయి. ప్రచారానికి తరలి రావాలంటే మంసం ముద్ద గొంతు దిగాల్సిందే మరి. చెన్నరులో చికెన్‌ బిర్యానీ ప్యాకెట్‌కు జిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయించిన రేటు రూ.150.
బిర్యానీని తయారు చేయడం, ప్యాక్‌ చేయడం, ఆ తర్వాత దానిని పంచడం చాలా సులభం. ఓటర్లు, కార్యకర్తలు కూడా ఎంతో ఇష్టంగా దీనిని లాగించేస్తున్నారు. పనిలో పనిగా ప్రచారంలో బిజీబిజీగా ఉండే నాయకులు, అభ్యర్థులు కూడా బిర్యానీని ఓ పట్టు పడుతున్నారు.
ప్రతిపక్షాలపై ఆరోపణల కోసం…
రాజకీయ నాయకులు… ముఖ్యంగా బీజేపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో బిర్యానీని ప్రస్తావించడం మరచిపోవడం లేదు. బీజేపీ తరచుగా తన రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల కోసం, మైనారిటీలను కించపరచడం కోసం బిర్యానీ రాజకీయాలను ఆశ్రయిస్తోంది. తద్వారా ఈ వంటకానికి మతం రంగు పులుముతోంది. ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజస్థాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ‘కాంగ్రెస్‌ పార్టీ పేద ప్రజలను ఆకలితో చంపుతుంది. అదే ఉగ్రవాదులకు బిర్యానీ పెడుతుంది’ అని ఆరోపించారు.
2020లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందు ముస్లింల పట్ల వివక్ష చూపుతున్న పౌరసత్వ సవరణ చట్టానికి, జాతీయ పౌరుల రిజిస్టర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ పాలక అమ్‌ఆద్మీ పార్టీపై విమర్శలు చేశారు. షహీన్‌బాగ్‌లోనూ, నగరంలోని ఇతర ప్రాంతాలలోనూ నిరసనలు తెలుపుతున్న వారికి అమ్‌అద్మీ పార్టీ బిర్యానీ సరఫరా చేస్తోందని ఆయన ఎత్తిపొడిచారు. తూర్పు ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో ముస్లింలు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. బిర్యానీ ప్రస్తావన తెచ్చినందుకు ఎన్నికల కమిషన్‌ యోగికి నోటీసు కూడా పంపింది.
అయినా మూతపడని నోరు
అయినప్పటికీ ఆదిత్యనాథ్‌ నోరు అంతటితో మూతపడలేదు. ‘పాకిస్తాన్‌ ఉగ్రవాదులను మన సైనికులు నరకానికి పంపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ, కేజ్రీవాల్‌ వారికి బిర్యానీ తినిపిస్తున్నారు. కానీ మేము బులెట్ల ఆహారాన్ని ఇస్తున్నాము’ అంటూ మరోసారి బిర్యానీ ప్రస్తావన తెచ్చారు. బీజేపీకే చెందిన మరో నాయకుడు, పార్టీ ఐటీ విభాగం జాతీయ కన్వీనర్‌ అమిత్‌ మాల్వియా సామాజిక మాధ్యమాలలో ఓ చిత్రాన్ని షేర్‌ చేశారు. షహీన్‌బాగ్‌లో బిర్యానీని పంచుతున్నారనడానికి ఇదే రుజువు అని రాశారు. ఇది ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ట్రోల్‌ అయింది. వాస్తవానికి నిరసన ప్రదేశాలలో ఏదో ఒకటి తినడం అసాధారణమేమీ కాదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అమ్‌ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించిన తర్వాత బిర్యానీ విక్రయాలు పెరిగాయి. బీజేపీ వ్యాఖ్యానాలు కూడా తగ్గిపోయాయి. బిర్యానీకి డిమాండ్‌ పెరగడంతో విక్రయదారులు అనేక ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
దక్షిణాదిలోనూ…
ఉత్తరాదిలో అలా ఉంటే దక్షిణాదిలో కూడా బీజేపీ మరో రకంగా బిర్యానీ రాజకీయాలు నడిపింది. కర్నాటకలో గత సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత ఎస్‌టీ సోమశేఖర్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఓ ఫిర్యాదు వచ్చింది. సోమశేఖర్‌ తన ఎన్నికల ప్రచారం సందర్భంగా కార్యకర్తలను బిర్యానీ తినమంటూ సూచించిన చిత్రాలను ఎవరో కెమేరాలో బంధించారు. ఇవి వైరల్‌ కావడంతో ఆయనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. కర్నాటకలోనే కాదు…మధ్యప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ వంటకం ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఓటర్లను ఆకర్షించి పార్టీ బలాన్ని పెంచుకోవడానికి మజ్లిస్‌ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఏకంగా బిర్యానీ ఫెస్ట్‌నే ఏర్పాటు చేశారు.

Spread the love