ప్రతిపక్షాల ఐక్యతతో బీజేపీకి భయం !

BJP is afraid of the unity of the opposition!– ఇండియా కూటమిలోకి మరిన్ని పార్టీలు : నితీశ్‌ కుమార్‌ వెల్లడి
పాట్నా : ప్రతిపక్షాల ఐక్యతను చూసి బీజేపీ భయపడుతోందని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ముంబయిలో ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌, ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా) మూడవ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన మరికొన్ని రాజకీయ పార్టీలు కూటమిలో చేరనున్నాయని నితీష్‌ చెప్పారు. ముంబయి సమావేవం ఈ చేరికలకు వేదికవుతుందని అన్నారు. ”గతంలో ప్రతిపక్షాలన్నీ చెల్లాచెదురుగా వున్నాయి. కానీ నా చొరవ నేపథ్యంలో ఇప్పుడు అన్ని పార్టీలు ఒక తాటిపైకి వచ్చాయి. ప్రతిపక్షాలు సమైక్యంగా వ్యవహరిస్తున్నందువల్ల తాము నష్టపోతామని వారు (బీజేపీ) భయపడుతున్నారు. అందువల్లే వారు నాపై ధ్వజమెత్తుతున్నారు. ఆ విమర్శలను నేను పట్టించుకోను, నా పని చేసుకుంటూ పోతాను.” అని చెప్పారు. పాట్నా, బెంగళూరుల్లో ఇప్పటికే ఇండియా కూటమి సమావేశాలు రెండు జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 31, సెప్టెంబరు 1 తేదీల్లో ముంబయిలో మూడో సమావేశం జరగనుంది. అక్కడ భవిష్యత్‌ వ్యూహ రూపకల్పన జరగనుంది. ఈ సమావేశంపై నితీశ్‌ మాట్లాడుతూ లోక్‌సభ సీట్లపై కూడా ఈసారి చర్చ జరుగుతుందని చెప్పారు. ఏ సీటు నుండి ఎవరు పోటీ చేయాలనే అంశాన్ని కూడా చర్చించాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. అనేక అంశాలపై చర్చిస్తామని, కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు పెద్దగా సమయం లేనందున బహుశా ముంబయి సమావేశమే చివరి సమావేశం కావచ్చునని అన్నారు. మరోవైపు బీహార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ కూడా ప్రధానిపై తీవ్రంగా విమర్శలు చేశారు. పేదలు, రైతులు, మొత్తంగా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సంస్కరణల పేరుతో దేశంలోని ప్రభుత్వ సంస్థలను, వనరులను ప్రయివేటు కంపెనీలకు అమ్మేస్తున్నారంటూ విమర్శించారు. లక్షల కోట్ల విలువైన జాతీయాస్తులను ఎంపిక చేసిన ప్రయివేటు కంపెనీలకు ఎందుకు అమ్ముతున్నారు? దేశ సంపదను మోడీ ప్రభుత్వం పెంచలేనపుడు స్వాతంత్య్రానంతరం దశాబ్దాల తరబడి కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను చవకబారు ధరలకు అమ్ముతూ ఎందుకు దేశానికి నష్టం కలిగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇలాచేయడం వల్ల దేశానికి, ఆర్థిక వ్యవస్థకు ఎలా లాభమో మోడీ ప్రభుత్వం వివరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో దేశాన్ని తాకట్టుపెట్టేందుకు, విక్రయించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలనుఅడ్డుకునేందుకు ఈ దేశ ప్రజలు చివరికంటా పోరాడతారని అన్నారు.

Spread the love