బీజేపీది మహిళా వ్యతిరేక పాలన

– సమానత్వమున్న దేశాల్లో వేగంగా అభివృద్ధి
– స్త్రీలను వంటింటికి పరిమితం చేసే యత్నం
– హక్కుల కోసం ఐక్యపోరాటాలు చేయాలి
– మహిళా దినోత్సవ కార్యక్రమంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పురుషులతో పాటు మహిళల్ని సమానంగా గౌరవించే దేశాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని పలువురు వక్తలు అన్నారు. మన దేశంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయనీ, బీజేపీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక పాలన చేస్తున్నదని చెప్పారు. మనుస్మృతిని తిరిగి అమల్లోకి తెచ్చి మహిళలను వంటింటికే పరిమితం చేసే దుర్మార్గపు ప్రయత్నాల్లో ఉందని విమర్శించారు. మహిళాభ్యున్నతి కోసం ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐద్వా, సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, టీఎస్‌యూటీఎఫ్‌ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్టు విధానం ద్వారా 12 గంటల పని చేయించుకుంటూ తీవ్ర శ్రమ దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు పనిప్రదేశం నుంచి ఇంటికొచ్చాక రోజువారీ పనులు చేసుకోవడంతో తీవ్రంగా అలసిపోయి అనారోగ్యాల పాలవుతున్న తీరును వివరిం చారు. ఆడ, మగ అనే వివక్ష చూపకుండా పిల్లలను పెంచాలని కోరారు. భ్రూణ హత్యలు విపరీతంగా పెరిగిపోతుండటంతో వివాహం చేసుకోవడానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఉందని చెప్పారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడుతూ..ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో మహిళల పాత్ర మరువలేనిదని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యలో మతభావజాలాన్ని జొప్పించి మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూపే ప్రయత్నం చేస్తున్నదన్నారు. అన్ని పార్టీలూ మద్దతు తెలుపుతున్నప్పుడు లోక్‌సభలో మహిళా బిల్లును పెట్టడానికి ఏం అడ్డం వస్తున్నదని బీజేపీని ప్రశ్నించారు. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందితే చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరిగి ఆ పార్టీ భావజాల వ్యాప్తికి ఆటంకం అవుతుందనే బీజేపీ అడ్డుపడుతున్నదని విమర్శించారు. శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ..ఓటుహక్కు, సమానపనికి సమాన వేతనం, కనీసం మనుషులుగా గుర్తించండి అని మహిళలు రోడ్లెక్కి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిన రోజును గుర్తుచేసుకుంటూ మహిళా దినోత్సవాన్ని ఓ స్ఫూర్తి దినంగా జరుపుకుంటున్నామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళలంటే చిన్నచూపు చూసే పరిస్థితి ఉందన్నారు. అంతరాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా జరుగుతున్న పోరాటంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ రైతాంగ పోరాట స్ఫూర్తితో లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం పోరాటం చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి మాట్లాడుతూ..30 శాతం కుటుంబాలను మహిళలే పోషిస్తున్నారనీ, మహిళల ఉపాధి కోసం ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు ఐదారువేల రూపాయలే జీతాలిస్తున్నారనీ, వాటితో ఎలా బతకాలో పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని జైలు నుంచి స్వాగతిస్తూ ర్యాలీలు తీయటం బీజేపీ దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనింగ్‌ కమిటీ కన్వీనర్‌ బి.పద్మ మాట్లాడుతూ..మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటి, ఆఫీసు పనులు చేసి సరైన తిండి తీసుకోకపోవడం వల్ల దేశంలోని 50 శాతానికి పైగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని వాపోయారు. నేడు అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా రాణిస్తున్న మహిళలను వంటింటికే పరిమితం చేసే విధానాలను బీజేపీ అమలు చేస్తున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌, ఐద్వా ఉపాధ్యక్షులు ఆశాలత, సీఐటీయూ నాయకులు ఆర్‌.వాణి, శ్రామిక మహిళా సెంట్రల్‌ సిటీ కన్వీనర్‌ మీనా, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love