బీజేపీది దిగజారుడుతనం

BJP is decadent– మహిళా బిల్లు చరిత్రను మరిచిపోయింది
– బిల్లును స్వాగతిస్తున్నాం.. వెంటనే అమలు చేయాలి
– 34 ఏండ్ల కిందటే కేరళలో మొట్టమొదటగా మహిళా రిజర్వేషన్లు : సీపీఐ(ఎం) లోక్‌సభ ఎంపీ ఎఎం ఆరీఫ్‌
పార్లమెంట్‌లో పెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని సీపీఐ(ఎం) లోక్‌సభ ఎంపీ ఎఎం ఆరీఫ్‌ పేర్కొన్నారు. బుధవారం మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. చట్టాలు చేయడంలోనూ, విధానాల రూప కల్పనలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. దేశంలో చాలా సుదీర్ఘంగా బిల్లుపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కానీ ఏదో బీజేపీయే మొత్తం చేసినట్టు కవరింగ్‌ చేస్తుందని దుయ్యబట్టారు. ఈ బిల్లు కోసం మహిళా సంఘాలు, బృందా కరత్‌, అనీరాజా, శ్రీమతి టీచర్‌ వంటి మహిళా నేతలు సుప్రీం కోర్టుకు వెళ్లారని వివరించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టడానికి కృషిచేసిన వారందరికి ఈ క్రెడిట్‌ దక్కుతుందని అన్నారు. రాజ్యాంగం సమానన్యాయం, సమాన హౌదా హామీ ఇస్తుందని, ఈ బిల్లు కోసం పని చేసిన మహిళా నాయకులందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో బీజేపీ మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి పెట్టిందని, కానీ ఆ ఐదేండ్లు ఎందుకు పెట్టలేదని విమర్శించారు. అప్పుడే బిల్లు ఆమోదం పొంది ఉంటే, ఇప్పటికే 33 శాతం మహిళలు సభలో కూర్చోనేవారని అన్నారు. ”రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈబిల్లును ఆమోదించొచ్చు. కానీ ఆమోదించలేదు. అనేక బిల్లులు చర్చ లేకుండానే, స్టాండింగ్‌ కమిటీ పరిశీలన లేకుండా ఆమోదించింది. నాలుగున్నరేండ్ల తరువాత అకస్మాత్తుగా బిల్లును తెచ్చారు. మీరు (బీజేపీ) మహిళలను మోసం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఈ బిల్లుతో హడావుడి చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మహిళ రిజర్వేషన్లు అమలు కావు. కానీ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పడానికి ఒక సాధనం దొరుకుతుంది. ఆగస్టులో సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. ఎందుకు రిప్లై దాఖలు చేయటం లేదని ప్రశ్నించింది. మహిళా రిజర్వేషన్‌ అమలు చేస్తారా? లేదా? తెలపాలని సుప్రీం కోర్టు కోరింది. సుప్రీం కోర్టు ప్రశ్నలకు ఈ బిల్లు ఒక వనరు” అని పేర్కొన్నారు. 2010లో రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించిందని, కానీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి మాట్లాడేటప్పుడు ఈ చరిత్ర ఏమీ లేదని అన్నారు. కేవలం నారీశక్తి, సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌ అంటూ నినాదాలే ఇచ్చారని ఎద్దేవా చేశారు. బీజేపీ దిగజారుడు ప్రచారం చేస్తుందని, జీ 20 లోగోలో బీజేపీ గుర్తు కమలం పెట్టారని, చంద్రయాన్‌-3 బీజేపీ విజయమన్నట్టు ప్రచారం చేశారని, పార్లమెంట్‌ సిబ్బంది యూనిఫాంపైన బీజేపీ గుర్తు ముద్రించారని ధ్వజమెత్తారు. కేరళలో స్థానిక సంస్థల్లో 32 ఏండ్ల క్రితమే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే కేరళలో మొదటి సారిగా మహిళ రిజర్వేషన్లు అమలు చేశామని తెలిపారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా వెంటనే మహిళ రిజర్వేషన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love