బోనం… సామూహిక ఉత్సవం

బోనం ఒక ఉత్సవం, ఒక ఊరేగింపు. ఆకుపచ్చని మొగులులా నేల అంతటా వ్యాపించిన యాపకొమ్మల వర్ణం. పసుపు పూసిన మోములు, చిత్తడి నేల, చెరువుల వలే చిన్ని అలలుగా కదలి వస్తున్న దశ్యం. ఆషాఢం అనగానే బోనాల ఉత్సవం కనులముందు కనబడుతుంది. పోశమ్మ, ఎల్లమ్మ, రేణుకమ్మ, మహంకాళీ, మల్లమ్మ గ్రామదేవతల చల్లని చూపుల అమ్మల జాతర. ఆ జాతరలో ఊరేగింపులు, పూనకాలు, రంగం, గట్టం, భవిష్యవాణి వినడం ఇవన్నీ నాయనమ్మతో పాటు ముడివేసుకున్న జ్ఞాపకాల బోనం. ఈ ఆచారాల ఆనందం ప్రతివాడకు అలంకారమవుకుంది. ఎటుచూసినా ఆకుపచ్చని, పసుపు పచ్చని ఉత్సవమే.
తెలంగాణాలో ఆడవాళ్లు ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే పండుగలు బతుకమ్మ, బోనాల పండుగ. రెండువందల ఏండ్ల చరిత్రగల పండుగ బోనాలపండుగ. తెలంగాణ రాష్ట్ర పండుగ ఇది. చిన్నప్పుడు పోశమ్మబోనాలకి బోనం అంకరించడం అంటే జత కుండలకు పసుపు పూసి, బొట్లు పెడుతుంటే ఆకాశంలో చుక్కలను లెక్కిస్తున్నట్లుండేది. కొంత మంది సున్నపుబొట్లు పెట్టి అలంకరిస్తుంటే వానాకాలం పండుగ వచ్చేసింది అని మురిసిపోవడం పిల్లలవంతు. ఆషాఢంలో మొదలై శ్రావణమాసం వరకూ, కొన్ని ప్రాంతాలలో శ్రావణంలో పండుగను చేసుకుంటారు. బియ్యం, పెసరపప్పు, బెల్లం, పాలతో తయారు చేసి కుండలో వేసి, ఏమాత్రం మిగల్చకుండా అంతా నైవేద్యం పెట్టేస్తుంటే, అమ్మకు సమర్పించిన తరువాతనే మనం ప్రసాదం తీసుకోవాలనేది ఒక నమ్మిక. అప్పటిదాకా ఆగాలంటే చాల కష్టంగానే ఉండేది. కుండలో ప్రసాదం, దానిపై గురిగిలో చింతపండు పులుసు, పెరుగు, బెల్లం వేసి, దాని మీద మూతలో నూనెదీపం పెట్టడం చుట్టూ యాపకొమ్మలతో అలంకరించడంతో బోనం సిద్ధం అవుతుంది. అందరూ బోనాలు ఎత్తుకుంటే చిన్నపిల్లలు మాత్రం తమసైజుకు తగినట్లు బోనం ఎత్తుకోవడం ఎంత మురిపెమైన దశ్యం. చిట్టి చిట్టి బోనాలు ఎత్తినప్పుడు, అమ్మవారి బాల రూపం ఇదేనేమో అనిపిస్తుంది. ఆషాఢంలో అమ్మవారు పుట్టింటికి వస్తుంది అనేది నమ్మిక. ఆమెకు ఇష్టమైన వంటలు కొత్త కుండలో వండినప్పుడు ఆ రుచే వేరు మరి. ప్రపంచమంతా అనేక మందిని బలి తీసుకున్న ప్లేగు వ్యాధి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతంలో కూడా అనేక మందిని బలి తీసుకున్నది. ఈ వ్యాధి బారిన పడి అనేక కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి. 1813 ప్రాంతంలో ఈ వ్యాధి ప్రపంచ మానవాళి చరిత్రలో మిగిలిపోయిన ఒక చేదు ఘట్టం. ఈ ప్రాంతంలో ఈ వ్యాధి తన విశ్వరూపం చూపడంతో అప్పట్లో ఇక్కడ ఉన్న మిలటరీ బెటాలియన్‌ విషయంలో ఆందోళన మొదలైంది. బెటాలియన్‌ లోని సైనికుల ప్రాణాలు కాపాడుకోవడానికి హైదరాబాదులోని మిలిటరీ బెటాలియన్‌ను ప్రభుత్వం ఉజ్జయినికి తరలించింది. మధ్యప్రదేశ్‌లో ఉండే ఉజ్జయిని నగరంలోని మహంకాళి దేవాలయంలో పూజలు చేసి ప్లేగు వ్యాధి తగ్గుముఖం పడితే సికింద్రాబాద్‌లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని కొందరు సైనికులు మొక్కుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు బెటాలియన్‌ సికింద్రాబాద్‌ చేరుకొని, సికింద్రాబాద్‌లో మహంకాళి ఆలయం కట్టించి, విగ్రహ ప్రతిష్ట జరిపి బోనాలతో మొక్కులు చెల్లించుకున్నారు. అలా అప్పుడు వాళ్లు మొక్కులు చెల్లించుకోవడం వల్లనే ప్లేగు వ్యాధి అరికట్ట బడిందని భక్తుల నమ్మకం. అప్పటినుండి ప్రజలు మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాన్ని బోనాలు సమర్పించడంగా జరుపుకుంటున్నారు. బోనాల పండుగ గురించి ఇంకా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కాకతీయుల కాలంనుండి ఈ పండుగను జరుపుకుంటున్న కథ ఉన్నది. ఇంకా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల్లో మలేరియా విజభించినప్పుడు అనేకమంది మత్యువాతబారిన పడినపడ్డారట. ఇదంతా అమ్మవారి కోపంవల్లే జరిగింది అని, అమ్మకు బోనాలను పెద్దఎత్తున సమర్పించుకున్న తరువాతనే అమ్మవారు శాంతించింది అనేది పక్కింటి అత్తమ్మ కథ. గోల్కొండలో జగదాంబిక ఆలయంలో ఆది, మంగళ, గురువారాల్లో బోనాల సమర్పణతో ఒక ఉత్సాహ ఉత్సవ వెల్లువకు నాంది జరుగుతుంది. లాల్‌ దర్వాజలో మూసీనది పొంగినప్పుడు అనేక కుటుంబాలు నదీప్రవాహంలో కొట్టుకుపోయాయి. నిజాం ప్రభువు అయిన మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ బంగారు చాటలో పట్టుచీర, ముత్యాలు సమర్పించారు. అప్పుడు నది శాంతించిందని అంటారు. ఇలా అనేక కథలు, సంఘటనలు బోనాల పండుగ ప్రతిష్టను మరింత పెంచాయి. ఏ ఆపదా రావద్దని, ఏ గండం ఊరిని తాకవద్దని అమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు ఈ ఆషాఢపు బోనాలతో. గుడిలో బోనం చెల్లించాక నీళ్ల సాక, కల్లు సాక పెట్టి, చల్లగా చూడమని అమ్మవారిని వేడుకుంటారు. చిన్నప్పుడు బోనాలు సమర్పించాక ఆ జాతరలో, ఆ దప్పుల దరువులతో మారుమ్రోగిపోతున్న ఆ జాతలో ఎగిరే జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనివి. పోతురాజుల కోలాహలం వస్తుంటే ఒక రకమైనా ఉత్సాహం అంతటా నిండిపోతుంది. ప్రతి ఆడపడుచు తన పసుపు కుంకుమలు ఎల్లవేళలా కాపాడామని కోరుకుంటూనే గ్రామంలో అందరినీ చల్లంగ చూడమని, ఏ పీడ చీడ దరిచేరనీయవద్దు అని వేడుకోవడం ఒక విశేషం. తాను, తన కుటుంబమే కాదు, అందరి క్షేమం కోరుకోవడమే ఈ పండుగ విశేషం. చివరగా గట్టం/ రంగంతో అమ్మవారి పలుకులు వినడానికి అనేక మంది హాజరవుతూ, భవిష్యత్తును తెలుసుకోవాలని ఎంతో ఉత్సాహ పడతారు. ప్రతి ఏటా ఆషాఢంలో అమ్మవారిని బోనాల పండుగతో కొలుచుకోవడం కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక గొప్పవరమే.
బోనం – విశ్వాసం
బోనం అంటే భోజనమే. బువ్వను నెత్తికెత్తుకుని తాము నమ్ముకున్న దేవతకు అర్పించే పండుగ. బతకడానికి అందరికీ బువ్వ కావాలి. రోగాలు రాకుండా చూడాలి. అందరూ సంతోషంగా వుండేట్టు చూడాలి. ఇవన్నీ నిజజీవితంలో దక్కడం కష్టమైన కాలం. గ్రామ దేవతలు ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ, మల్లమ్మ మొదలైన వారిని వేడుకుంటే చల్లగ చూస్తుందన్న విశ్వాసం అనాదిగా సామాన్య ప్రజలకు వున్నది. ఎందుకంటే ఆరోగ్యాన్ని, అవసరాలని చేకూర్చే, తీర్చే వారెవరూ కానరాని వేళ, భరోసా కనపడని సందర్భాన, ఒక విశ్వాసం కొండంత ధైర్యాన్నిచ్చిన కాలం. నేటికీ సంప్రదాయంగా గ్రామీణ జనులు ఒక ఉత్సవంలా చేసుకునే పండుగ బోనాలు. ఈ సందర్భంగా ప్రజలు చెడు తొలిగిపోవాలని కోరుకుంటారు. దుర్మార్గం నశించాలనీ, తమని, గ్రామాన్ని చల్లగా కాపాడాలని వేడుకుంటారు. ఇది ఎవరికి వారు వ్యక్తిగతంగా పూజ చేయడం, ధ్యానం చేయడం కాదు. సామూహికంగా కుటుంబాలకు కుటుంబాలు కదిలి చేసుకునే ఉత్సవం. ఒక సందోహం. ఒక సంతోష సమ్మేళనం.
ప్రజల ఉత్సవం
వర్షాకాలంలో ముసురుకునే వ్యాధుల బాధల నుండి రక్షించమని అందరూ కలిసి కోరుకోవడం ఇందులోని ముఖ్యాంశం. ఏది ఏమైనా ఇది ప్రజల ఉత్సవం. అందులోనూ సామాన్యుల ఉత్సవం. ఆర్భాటాలు, ఆడంబరాలు పెరిగి సంప్రదాయ వేడుకలను కూడా ఈవెంట్‌లా మారుస్తూ, వ్యాపారమయం చేస్తున్న కాలంలో వాటికి భిన్నంగా ప్రజలు కలుసుకునే సందర్భాన్ని బోనాలు ప్రతిబింబిస్తాయి. ఇక్కడ కూడా స్పాన్సర్లు, రాజకీయాలు జొరబడతాయి. జాగ్రత్తగా వుండాలి. బోనం వర్ధిల్లాలి!

Spread the love