అన్నపూర్ణి రాజ్‌కుమార్... అడ్డంకులు బద్దలుకొట్టింది. 40 ఏండ్ల వయసులో బంగ్లాదేశ్‌లోకి సరిహద్దు దాటిన మొదటి మహిళా ట్రక్కర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకుంది. పురుషులకు మాత్రమే పరిమితమైన డొమైన్‌లో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకుంది. లింగ మూస పద్ధతులను పగులగొట్టింది. ఆమె బద్దలు కొట్టిన ఈ అడ్డంకులతో పురుషాధిక్య రంగాలలో మహిళల ప్రవేశాన్ని మరింతగా ప్రేరేపిస్తోంది.
అన్నపూర్ణి తమిళనాడు నుండి 10 రోజుల పాటు ప్రయాణం చేసి సుమారు వెయ్యి కిలోమీటర్లు దాటుకుని పెట్రాపోల్ సరిహద్దు చెక్‌పోస్ట్‌కు చేరుకుంది. ‘విశాఖపట్నం సెజ్ నుండి కాటన్ నూలుతో కూడిన ట్రక్కును నడుపుకుంటూ గత శనివారం రాత్రి పెట్రాపోల్‌కు చేరుకుంది” అని పెట్రాపోల్‌లోని ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (LPAI) మేనేజర్ కమలేష్ సైనీ అన్నారు.
అడ్డంకులను అధిగమించడం
అన్నపూర్ణి తన ప్రయాణ సమయంలో అనేక రవాణా సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. జాతీయ రహదారుల వెంబడి మహిళల కోసం రెస్ట్‌రూమ్ సౌకర్యాలు లేకపోవడం ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల్లో ముఖ్యమైనది. ‘ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ ఆమె తన ట్రక్కును పార్క్ చేసిన హోటళ్లలోనే వసతిని ఏర్పాటు చేసుకుంది’ అని సైనీ జోడించారు. అయితే ఈ ప్రయాణంలో వసతికి సంబంధించి ఆమెకు ఎంపికలు చాలా తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఆమె రోడ్‌సైడ్ ధాబాలలో బస చేయకూడదని నిర్ణయించుకుంది. పురుషుల ఆధిపత్య కారణంతో ఆమె సాధారణంగా డ్రైవర్‌లు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలకు దూరంగా ఉంది.
బంగ్లాదేశ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దు వేగంగా దాటడానికి అవసరమైన క్లియరెన్స్ తీసుకోగలిగింది. ‘ఆమె చేసిన ప్రయాణం మహిళల కోసం రూపొందించిన LPAI మార్గదర్శకాలకు కట్టుబడి ఉంది. మేము బంగ్లాదేశ్ అధికారులతో కలిసి ఆమె ట్రక్ నుండి కాటన్‌ను వెంటనే దించాము. మధ్యాహ్నం 12:30 గంటలకు పెట్రాపోల్‌కు వేగంగా వెళ్లేందుకు వీలు కల్పించాము. సాధారణంగా ట్రక్కులు సరిహద్దులో చాలా సమయం వేచివుండాల్సి వుంటుంది. కానీ ఆమెకు ఆ నిరీక్షణ లేకుండా చేశాము’ అని సైనీ వివరించారు. తమిళం మాత్రమే మాట్లాడగలిగే ఆమె హిందీలో కొంత మాట్లాడగలదు. తన సంభాషణ కోసం ఆమె తోటి డ్రైవర్ల సహకారం తీసుకుంది.
లింగ సముపార్జన
బంగ్లాదేశ్ నుండి ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆమెకు ప్రత్యేక సౌకర్యాలతో కూడిన మహిళా వసతి గృహంలో వసతి కల్పించారు. ఇది లింగ పక్షపాతాలను తొలగించడానికి, కస్టమ్స్ క్లియరింగ్, ఫార్వార్డింగ్ ఏజెంట్‌ల వంటి పాత్రలలో స్త్రీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభ ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. పెట్రాపోల్ సి అండ్ ఎఫ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి కార్తిక్ చక్రవర్తి, ఢిల్లీ నుండి పెట్రాపోల్‌కు ఇటీవలి పర్యటన సందర్భంగా హోం వ్యవహారాల సీనియర్ మంత్రిత్వ శాఖ అధికారులలో అసంతృప్తిని వెల్లడి చేశారు. ఈ రంగాలలో వేళ్లూనుకున్న పురుషాధిక్యతను పరిశీలించారు.
ఆమె చేసిన ఈ ప్రయాణం ఫలితంగా సాంప్రదాయకంగా పురుషాధిపత్య రంగాలలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు, మహిళల భద్రత అంశాలపై దృష్టి సారించేందుకు చర్చను లేవదీసింది. మహిళా డ్రైవర్లకు సరైన సౌకర్యాలు కల్పిస్తే ఈ రంగంలో మరింత మంది మహిళలు వచ్చేందుకు ఆసక్తి చూపుతారని ఆమె ఈ సందర్భంగా పంచుకుంటుంది.
LPAI సభ్యురాలు రేఖా రాయ్కర్ కుమార్, మహిళా కార్మికులకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించాలని కోరుతూ మార్చి 19న పెట్రాపోల్‌లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ‘లింగ వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే సరిహద్దు సంబంధిత వృత్తులలో భాగస్వాములు అయ్యేలా మహిళలను ప్రోత్సహించాలనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా చీకటి పడిన తర్వాత మహిళలకు కొన్ని సమస్యలు, ఆందోళనలు మొదలవుతాయి. హోటల్ సిబ్బందిలో అందరూ మగవారు ఉండటమే దీనికి ప్రధాన కారణం’ అని రేఖా అంటున్నారు. మరింత సమగ్రమైన కార్యాలయ వాతావరణాన్ని పెంపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాల గురించి ఆమె నొక్కిచెప్పారు.
అన్నపూర్ణి సాధించిన ఈ విజయం దీర్ఘకాలంగా ఉన్న లింగ మూస పద్ధతులను సవాలు చేస్తూ, సాంప్రదాయకంగా పురుషాధిపత్య రంగాలలో వృత్తిని కొనసాగించేందుకు మరింత మంది మహిళలకు మార్గం సుగమం చేసింది. కష్టాలను ఎదుర్కునే ఆమె సంకల్పం, పట్టుదల ఇతర మహిళలు అద్దాల పైకప్పులను ఛేదించడానికి అడ్డంకులు లేకుండా వారి కలలను స్వీకరించడానికి ప్రేరేపించాయి.