రక్తపోటును తగ్గించే సూపర్‌ ఫుడ్స్‌..!

రక్తపోటును తగ్గించే సూపర్‌ ఫుడ్స్‌..!ఇటీవల కాలంలో అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్‌ సమస్య చాలా మందిలో బయటపడుతోంది. ఇది శరీరంలోని ధమనులను ప్రభావితం చేస్తుంది. రక్త నాళాల ద్వారా రక్తం ప్రవహించే శక్తి నిరంతరం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే, రక్త నాళాల్లో ప్రవహించే రక్తం ధమనుల గోడలపై అధిక పీడనాన్ని కలుగజేస్తే దాన్ని హై బ్లడ్‌ ప్రెజర్‌ అంటాం. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రకారం దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, రక్త ప్రసరణ వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీని ఫలితంగా గుండెపోటు, పక్షవాతం, ఇతర సమస్యలకు దారితీస్తుంది. రక్తపోటును కంట్రోల్‌లో ఉంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తినడం చాలా ముఖ్యం. తినే ఆహారం రక్తపోటు నియంత్రణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి రక్తపోటు తగ్గించుకోవడానికి తినాల్సిన కొన్ని ఉత్తమ ఆహారాలు ఏవో చూద్దాం.
అరటి పండ్లు : అరటిపండ్లలో గుండె ఆరోగ్యాన్ని పెంచే, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే అనేక ముఖ్యమైన పోషకాలుంటాయి. రక్తపోటును తగ్గించే న్యూట్రియంట్సూ ఉంటాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం రక్తపోటు పెరగడానికి కారణమయ్యే సోడియం మోతాన్ని తగ్గిస్తుంది.
బీట్‌రూట్‌ : రోజూ బీట్‌రూట్‌ తినడం లేదా బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఇందులో ఫైబర్‌, ఫోలేట్‌, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ సి వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. .
పెరుగు : రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజూ పెరుగు తినటం మంచిది. పెరుగులో రక్తపోటు స్థాయిలను నియంత్రించే విటమిన్లు, ఖనిజాలు, మెగ్నీషియం ఉంటాయి.
బెర్రీలు : ఈ పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌, ముఖ్యంగా నీటిలో కరిగే ఫైబర్‌, ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పోషకాలు కూడా మెండుగా లభిస్తాయి. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్‌ కాంపౌండ్‌ అయిన ఆంథోసైనిన్స్‌ ఉంటుంది, ఇది రక్తపోటు తగ్గించడానికి చాలా అవసరం.
పుచ్చకాయ : వేసవిలో దొరికే పుచ్చకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం కూడా అధికంగా దొరుకుతుంది. పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లతో హెల్తీగా రక్తపోటును తగ్గించుకోవచ్చు. పుచ్చకాయలో సిట్రులిన్‌ వంటి అమైనో యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్త నాళాలను వదులు చేసి ధమనులలో ఫ్లెక్సీబిలిటీని పెంచుతాయి, తద్వారా రక్తపోటు తగ్గుతుంది.
ఓట్స్‌ : పాపులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ఫుడ్‌ ఓట్స్‌. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. హెల్తీ ఫ్యాట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఓట్స్‌లోని ఫైబర్‌ రక్తపోటు, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి.

Spread the love