రేపటి సమాజానికి నేటి భరోసా

For tomorrow's society Today's assuranceమహాకవి శ్రీశ్రీ 114వ జయంతిని, కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకుని తెలంగాణ సాహితి ఏప్రిల్‌ 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన శ్రామిక కవి సమ్మేళనం వర్తమానంలోని మతోన్మాద చర్యలను నిరసిస్తూ, ప్రజలు కలలుకంటున్న ప్రజాతంత్ర సమాజాన్ని హామీ ఇచ్చింది. మనుషులను మనుషులుగా కాకుండా కులాలుగా, మతాలుగా చూసే రోజు వచ్చిందని విచారం వ్యక్తం చేశారు అధ్యక్షత వహించిన ఏబూషి నర్సింహ. ”చీమలకు చక్కర వేసి – పాములకు పాలుపోసిన దయగల దేశం మనదేనా!? మరి మూకదాడులతో హింసోన్మాదం సష్టిస్తున్నం ఎందుకనీ? ఎందుకనీ?? పిల్లలూ దేవుడూ చల్లని వారని పాట పాడుకున్నోళ్ళం – మరి పిల్లల తల్లుల చెరిపి చంపుతె చూసి మాట్లాడ వెందుకనీ !? ఎందుకనీ!??” అంటూ వారు రాసి పాడిన పాట మతోన్మాద శక్తులను గల్లాపట్టి ప్రశ్నించింది.
”రెండు రెళ్ళు నాలుగన్నందుకు/ గుండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో/ క్షేమం అవిభాజ్యం అంటే/ జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో నే మనం ఇంకా ఉన్నాం” అంటూ – మనం నిజాలు మాట్లాడుతుంటే మన మీద నిప్పుల వర్షం కురిపిస్తున్న ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా మనం పెద్ద యుద్ధమే చేయాల్సి ఉందంటూ ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కవి యాకూబ్‌ పిలుపు నిచ్చారు. మన చుట్టూ ఉన్న మనుషులను మనం మనుషులుగా కాకుండా వారి వేషధారణను బట్టి అనుమానించే రోజులు రావడం మన భారత రాజ్యాంగాన్ని అవహేళన చేయడమేనని నిరసించారు. ఈ సభకు విశిష్ట అతిథిగా వచ్చిన మహెజబీన్‌ ‘పౌరసత్వం అపహాస్యం చేయబడుతున్న వేళ/ ఖీబఅసaఎవఅ్‌aశ్రీ తీఱస్త్రష్ట్ర్‌ర ఏం చేసుకోను?’ ప్రశ్నే దేశ ద్రోహమవుతున్న వేళ నేను అస్తిత్వ వేదనా కెరటమై ఎగిసిపడక తప్పదంటూ మన పాలకుల అప్రజాస్వామిక ధోరణిపై ఆగ్రహ కవిత్వమై పోయారు. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి మాట్లాడుతూ.. మార్క్స్‌ చెప్పిన సారాంశాన్నే శ్రీశ్రీ కవిత్వంగా అందించారని తెలిపారు. ఫాసిజం ప్రపంచమంతా, ముఖ్యంగా మన దేశంలో విస్తరించేందుకు యత్నిస్తున్న తరుణంలో శ్రీశ్రీ కవిత్వం మరింత అవసరమని అన్నారు. మనుషులను విభజిస్తున్న ఈ పరిస్థితిలో వర్గ సంఘర్షణతోనే మనిషి మనిషిగా మారతాడని తెలిపారు. హిందూ ముస్లీం ఘర్షణ జరిగిన ముజఫర్‌నగర్‌లో రైతు ఉద్యమంతో వర్గ సంఘర్షణ వారిని కలిపిందని చెప్పారు. అలాంటి సంఘ ర్షణకు ఉత్సాహమిచ్చే కవిత్వం రావాలని ఆకాంక్షించారు. సంపద సష్టికర్తలు శ్రామికులేననే విషయాన్ని జగమంతా చెప్పాలని పిలుపునిచ్చారు.
సుమారు 30 మంది కవులు పాల్గొన్న ఈ సమ్మేళనం దేశంలోని అసమానత్వాన్ని ప్రశ్నించింది. భారత రాజ్యాంగ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పింది. మనుషుల మధ్య ఉండాల్సిన స్నేహ సంబంధాలు మతం ఎగదోస్తున్న మంటల్లో సజీవంగా ఆహుతి అవుతున్న దుఃఖ సమయానికి విచారం వ్యక్తం చేసింది. కార్మికుల, కర్షకుల స్వేద దరహాసాన్ని ఆవిష్కరించింది. ఏప్రిల్‌ 28న కాకతీయ యూనివర్సిటీలో సమూహ సమావేశంపై జరిగిన దాడిని సమ్మేళనం తీవ్రంగా ఖండించింది.
”ముళ్ళ మధ్య గులాబి పువ్వులాంటి సున్నితత్వం కార్మికుల నైపుణ్యం” అంటూ ఆలోచించదగిన కవిత వినిపించారు హనీఫ్‌. ”స్వదం అంటని పద్యాలకు పాదాలుండవు రెక్కలు తప్ప” అంటూ కోట్ల వెంకటేశ్వరరెడ్డి తన కవితలో ఉదయాస్తమయాల ఉనికిని ఎరుక చెప్పారు. ”పని పొగరు నా నెత్తిమీద రుమాలుకు నెమలీక రంగులద్ది నాట్యమాడుతది” అంటూ డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ రాసిన కవితలో ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాల కన్నా పని చేసుకొని బతకడమే మాకు గౌరవంగా ఉందంటూ శ్రమ జీవుల అంతరంగాన్ని ఆవిష్కరించారు. ”ప్రపంచీకరణ చంపుడు పందెంలో కుల వత్తుల ఉనికే తీరని ప్రశ్న” అంటూ మండల స్వామి రాసిన కవిత పనిముట్లకు పదునెక్కించిన వత్తి కార్మికుల ధైన్య స్థితికి అద్దం పట్టింది. ”ఎర్రటి ఎండల్లో నక్షత్రాల్లా మెరుస్తున్నారు కార్మికులు” అంటూ భాగ్య మంచి కవిత వినిపించారు.
”అవును. అతను మళ్ళీ ఈ దారిలోనే వస్తాడు. అతనికి స్వాగతం చెప్పేందుకు కొన్ని కొత్త పిడికిళ్ళను పోగేయాలి” అంటూ రేపటికి భరోసా కలిగించే కవిత్వం డా.చెమన్‌ వినిపించారు. ”అందమయిన వికత ముఖ చిత్రం” ఎలా ఉందో జ్వలిత వినిపిస్తూ సమాజం కారుస్తున్న మొసలి కన్నీటిని బట్టబయలు చేశారు. ”రాతి గోడలు, ముళ్ళ పొదల్లోని నిగూఢ రహస్యాలను, నిషేధించిన స్వప్నాలను” సి.హెచ్‌. ఉషారాణి తన కవితలో వినిపించారు. ”మానవ సంబంధాలకు వ్యాపారపు రంగుపూసి/ దుఃఖపు వాకిలిలో చేరగిలపడ్డామ” అంటూ ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ మలినమైన మానవ సంబంధాల మడత పేచీని విప్పి చెప్పారు. ”ప్రజాస్వామ్యం అంతా చిందర వందర గందరగోళమై శునకాలు చింపిన విస్తరి అయ్యింది” అంటూ మహేష్‌ దుర్గే తన కవితలో ఆవేదన వ్యక్తం చేశారు.
”మంచి మాటల నీతులు/ సమసమాజ నిర్మాణ రీతులు/ నీ కవితా జలపాతాలు/ కవీ, నీ గీతాలు” అంటూ డా. రాపోలు సుదర్శన్‌ శ్రీ శ్రీ పై కవిత వినిపిస్తే… ”నీ వెప్పుడూ/ నిప్పులు కక్కుతూ/ నింగికి ఎగిరే వాడివే/ నిప్పు కణికవై నిత్యం మాలో ప్రవహించే వాడివే” అంటూ నస్రీన్‌ ఖాన్‌ శ్రీశ్రీ ని మరోకోణంలో స్మరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూసి కవి ఎంత బలంగా ప్రభావితం అవుతాడో చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి వారిలో శ్రీశ్రీ కూడా అందుకు మినహాయింపు కాదు. అలాంటి కవి అవసరం నేడే ఎక్కువగా ఉంది. నేడు దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను అర్ధం చేసుకొని ప్రభావవంతమైన కవిత్వం రాయడం, తద్వారా సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం వర్తమాన కవులపై, మరి ముఖ్యంగా యువతపై ఉందని ఈ సమ్మేళనం అభిప్రాయపడింది. ఇంకా ఈ సమ్మేళనంలో కందుకూరి శ్రీరాములు, నాంపల్లి సుజాత, దాసరి మోహన్‌, కుడికాల వంశీధర్‌, ఉప్పల పద్మ, కొండా రవీంద్ర, ముజాహిద్‌, అశోక్‌ దుర్గం వారి వారి కవితలను వినిపించారు.
– ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌
98490 82693

Spread the love