ప్రపంచ పేద దేశాల వేదికగా మారిన బ్రిక్స్‌ !

BRICS has become a platform for the world's poor countries!– దక్షిణాఫ్రికా, గ్రీస్‌ పర్యటనకు బయలుదేరుతూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు
– బ్రిక్స్‌ విస్తరణపై ప్రధానంగా చర్చలు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన, పేద దేశాలు ఎదుర్కొనే సవాళ్ళను చర్చించే వేదికగా బ్రిక్స్‌ మారిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్‌ల్లో నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరడానికి ముందు ఆయన ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. మంగళవారం నుండి గురువారం వరకు జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగే 15వ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొంటున్న మోడీ ఈ పర్యటనా సమయంలో బ్రిక్స్‌-ఆఫ్రికా ఔట్‌రీచ్‌, బ్రిక్స్‌ ప్లస్‌ డైలాగ్‌ల్లో పాల్గొంటారు. అలాగే పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు.
వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి బలమైన ఎజెండాను బ్రిక్స్‌ అమలు చేస్తోందని మోడీ పేర్కొన్నారు. అభివృద్ధి చొరవలు చేపట్టడం, బహుముఖ్య వ్యవస్థలను సంస్కరించడంతో పాటూ మొత్తంగా పేద, వర్ధమాన దేశాలకు ఆందోళన కలిగించే అంశాలను చర్చించేందుకు బ్రిక్స్‌ ఒక వేదికగా మారిందని భావిస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. భవిష్యత్‌ సహకారానికి రంగాలను గుర్తించడానికి, వ్యవస్థాగత అభివృద్ధిని సమీక్షించడానికి బ్రిక్స్‌ సదస్సు మంచి అవకాశమని అన్నారు.
ఆఫ్రికా, మధ్య ప్రాచ్యానికి చెందిన 20కి పైగా దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. వారిలో చాలామంది ఇప్పటికే బ్రిక్స్‌ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సదస్సులో ఇది కూడా ప్రధాన చర్చనీయాంశంగా వుండనుంది. దక్షిణాఫ్రికాలో దిగిన వెంటనే అరెస్టు అయ్యే అవకాశం వున్నందున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ సదస్సుకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా హాజరవుతారని భావిస్తున్నారు.
గ్రీస్‌ ప్రధాని ఆహ్వానం మేరకు ఈ నెల 25న దక్షిణాఫ్రికా నుండి గ్రీస్‌కు మోడీ వెళతారు. 40ఏళ్ళ తర్వాత గ్రీస్‌లో పర్యటిస్తున్న మొదటి భారత ప్రధాని తానే అయిన గౌరవం దక్కిందని మోడీ వ్యాఖ్యానించారు. బహుముఖాలుగా సంబంధాలను విస్తరించుకునేందుకు, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు తాను ఎదురుచూస్తున్నానని మోడీ పేర్కొన్నారు. అక్కడ గల భారతీయులతో కూడా ఆయన సమావేశం కానున్నారు.
జోహాన్నెస్‌బర్గ్‌ చేరుకున్న మోడీ
బ్రిక్స్‌ సదస్సుకు అదనపు ప్రాధాన్యత
షెడ్యూల్‌ టైం ప్రకారం జోహాన్నెస్‌బర్గ్‌ వాటర్‌క్లాఫ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌కు చేరుకున్న ప్రధాని అక్కడ నుండి నేరుగా బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం లీడర్స్‌ డైలాగ్‌ సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత బ్రిక్స్‌ లీడర్స్‌ రిట్రీట్‌లో కూడా పాల్గొన్నారు. 2019 తర్వాత ముఖాముఖి బ్రిక్స్‌ నేతలు భేటీ అవుతున్న సమావేశం ఇది. పైగా ఇరాన్‌, బంగ్లాదేశ్‌, ఇతర వర్ధమాన దేశాలను కలుపుకోవడం ద్వారా బ్రిక్స్‌ను విస్తరించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సు అదనపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అనేక అతిథి దేశాల నేతలతో సమావేశమై, చర్చించేందుకు ఎదురుచూస్తున్నట్లు మోడీ జోహాన్నెస్‌బర్గ్‌లో పేర్కొన్నారు.

Spread the love