బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు యథాతథం : రెజ్లర్‌ తండ్రి

న్యూఢిల్లీ : రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలు చేసిన ‘మైనర్‌’ రెజ్లర్‌ కోర్టులో తన స్టేట్‌మెంట్‌ను సవరించారు. సంఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను కాదని, మేజర్‌నేనని తెలిపారు. ఆమె తండ్రి మీడియాతో మాట్లాడుతూ, తన కుమార్తె వయసుకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను మాత్రమే మార్చారని, లైంగిక వేధింపుల ఆరోపణలు యథాతథంగా ఉన్నాయని చెప్పారు. గతంలో ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. అంతకుముందు ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోలేదని, కేవలం కొత్త స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని చెప్పారు. ‘మైనర్‌’ రెజ్లర్‌ ఫిర్యాదు మేరకు లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం (పోక్సో) ప్రకారం బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదైంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 10 ప్రకారం ఆయనపై కేసు నమోదవడంతో ఆరోపణలు రుజువైతే ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండేది. తాను మేజర్‌నని ఆమె కొత్తగా స్టేట్‌మెంట్‌ ఇచ్చిన నేపథ్యంలో బ్రిజ్‌ భూషణ్‌పై నమోదైన పోక్సో కేసు తొలగిపోయే అవకాశం ఉంది.
ప్రభుత్వ చర్చలు సఫలం
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మహిళా రెజ్లర్లతో తొలిత చర్చలు జరిపారు. అనంతరం కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా రెజ్లర్లతో చర్చలు జరిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై దర్యాప్తు పూర్తి చేసి, జూన్‌ 15నాటికి ఛార్జిషీటు దాఖలు చేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. అంతేకాకుండా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో అధికార మార్పిడికి అంగీకరించింది. ఈ ఫెడరేషన్‌కు త్వరలో జరిగే ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ కుటుంబ సభ్యులు పోటీ చేయకుండా చూస్తామని హామీ ఇచ్చింది. ఈ ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులను భర్తీ చేసేటపుడు బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఠాకూర్‌తో ఆరు గంటలపాటు జరిగిన చర్చల్లో రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌ పాల్గొన్నారు. చర్చలు ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ఈ ఫెడరేషన్‌లో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేస్తామని, దీనికి ఓ మహిళను అధ్యక్షురాలిగా నియమిస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత మంచి ఆఫీసు బేరర్లు ఉన్న మంచి ఫెడరేషన్‌గా పని చేస్తుందన్నారు. క్రీడాకారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.

Spread the love