కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

నవతెలంగాణ – గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీలోకి బి.ఆర్.ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు సూరపనేని సాయికుమార్ తో సహా సుమారు 200 మంది కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  ఆధ్వర్యంలో జరిగిన మండల ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు దనసరి సీతక్క సమక్షంలో మండల కేంద్రం మరియు రాఘవ పట్నం గ్రామాల నుండి బి.ఆర్.ఎస్.పార్టీ నుండి బి.ఆర్.ఎస్.పార్టీ మండల అధ్యక్షులు సూరపనేని సాయి కుమార్  ఆధ్వర్యంలో సుమారుగా రెండు వందల మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భముగా సీతక్క గారు మాట్లాడుతూ నూతనంగా కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన వారందరికీ స్వాగతం తెలుపుతూ, ప్రతి ఒక్కరికీ అండగా నేను ఉన్నానని, అందరూ ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ మహాబాద్ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసి, రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ, భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతావని సంకెళ్లు తెంచి భరతమాత నుదిట సింధూరం దిద్దిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీ కొందరు నాయకులు విమర్శించడం సిగ్గు చేటు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆర్థిక సంస్కరణలు, పంచవర్ష ప్రణాళికలు, ప్రాజెక్టులు, రాజాభరణాల తొలగింపు, బ్యాంకింగ్ వ్యవస్థ, భూ సంస్కరణల చట్టం, పేదలకు భూములకు పంపిణీ, వ్యవసాయాభివృద్ధి, భారీ, మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పడం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, లక్ష రూపాయల పంట రుణమాఫీ, ఆహార భద్రత చట్టం, అటవీ హక్కుల చట్టం, ఇందిరా క్రాంతి పథం, డ్వాక్రా రుణాలు, పేద ప్రజల అభివృద్ధి కొరకు ఎన్నో అత్యుత్తమ పథకాలు రూపొందించిన అత్యుత్తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచి, ఇంధనం ధర పెంచి, జి.ఎస్టీ ద్వారా పేదల నడ్డి విరుస్తూ, ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ వ్యక్తుల చేతిలో దేశం యొక్క భవితవ్యాన్ని తాకట్టు పెట్టారని అన్నారు.
మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతూ, కావాలని మతం పేరిట మారణహోమం చేస్తూ భారత దేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని గద్దెనెక్కిన బీజేపీ పార్టీ, ప్రధాని అయి పదేండ్లు కావోస్తున్నా ఇంతవరకు ప్రతి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని అన్నారు. తాతల దగ్గరి నుండి ధనిక కుటుంబం అయిన రాహుల్ గాంధీ గారి కుటుంబం ప్రజా సేవా కొరకు వారి డబ్బును పెట్టారు తప్ప, ఇప్పటివరకు సొంత ఇల్లు కూడా లేని వ్యక్తి రాహుల్ గాంధీ  అని అన్నారు. దేశానికి ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ కావాలంటే మనమందరం చేతి గుర్తుకు ఓటు వేసి బలరాంనాయక్ గారిని గెలిపించాలని కోరారు. గత 34 యేండ్ల నుండి గాంధీ కుటుంబం నుండి ప్రధాని అయ్యే అవకాశం ఉన్న కూడా తృణపాయంగా వదిలిన కుటుంబం రాహుల్ గారి కుటుంబం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాల్లు, యూత్ నాయకులు అందరూ పాల్గొన్నారు.
Spread the love