నేటి నుంచి నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాలు…

నవతెలంగాణ – మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ శిక్షణ శిబిరాలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ వెలుపల బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న తొలి శిక్షణ శిబిరం ఇదే కావడంతో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించకున్నది. రెండురోజులపాటు జరిగే ఈ శిక్షణా శిబిరాలను బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంతి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్‌ వేదికను పరిశీలించిన నాందేడ్‌ ఎస్పీ శ్రీకృష్ణ కొకాటే నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నాందేడ్‌ విమానాశ్రయం నుంచి సీఎం కేసీఆర్‌ ప్రయాణించే మార్గంలో ఆయన కాన్వాయ్‌లోనూ అనుమతి ఉన్న వాహనాలనే అనుమతిస్తామని తెలిపారు. అనుమతిలేని వాహనాలను అవసరమైతే సీజ్‌ చేస్తామని చెప్పారు. మరోవైపు సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ ప్రయాణించే నాందేడ్‌ విమానాశ్రయం – అనంత్‌లాన్స్‌ మార్గంలో ట్రయల్న్‌ నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు ఉమ్మడి కార్యాచరణను రూపొందించారు. రాష్ట్ర సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, పార్టీ సీనియర్‌ నేత రవీందర్‌సింగ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Spread the love