క్యాన్సర్‌పై అవగాహనతోపాటు వైద్య పరీక్షలూ అవసరం

– సినీ కార్మికులకు స్టార్‌ ఆస్పత్రి సహకారంతో వైద్య పరీక్షలు : ప్రముఖ సినీ హీరో చిరంజీవి
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
క్యాన్సర్‌పై అవగాహనతోపాటు వైద్య పరీక్షలూ అవసరం అని, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించడం ఎంతో అవసరమని ప్రముఖ సినిమా హీరో చిరంజీవి అన్నారు. క్యాన్సర్‌ నుంచి తమ అభిమానులు, సినీ కార్మికులను రక్షించేందుకు చిరంజీవి ఒక అడుగు ముందుకు వేశారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నేత్ర రక్తనిధి, స్టార్‌ హాస్పిటల్‌ సహకారంతో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్టార్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.గోపీచంద్‌, ఇతర వైద్యులతో కలిసి శుక్రవారం ఆయన రక్తనిధి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో ఇంకా లోపం ఉందనీ, దాన్ని పూర్తిస్థాయిలో భర్తీ చేయడానికి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల సహకారం ప్రభుత్వానికి అవసరమనీ అన్నారు. అవగాహనతో పాటు వైద్య పరీక్షలు నిరంతరంగా సాగితేనే క్యాన్సర్‌ నుంచి ప్రజలను కాపాడుకోగలుగుతామని తెలిపారు. క్యాన్సర్‌ పట్ల ఎంత అవగాహన కల్పిస్తే అంత ఈ వ్యాధిని దూరం చేయగలమని సూచించారు. స్టార్‌ ఆస్పత్రి సహకారంతో సినీ కార్మికులు, వారి కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించి సకాలంలో చికిత్స చేయించే ఏర్పాట్లు చేస్తామన్నారు. స్టార్‌ ఆస్పత్రి యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తూ ఈ సేవలు విస్తృతంగా కొనసాగించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణంలో నివసిస్తున్న వారు అత్యధికంగా కాలుష్య కోరల్లో వృత్తిరీత్యా జరిగే పరిణామాలతో ఎక్కువగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారని, దీనికి వైద్యులు సూచించే వైద్య పరీక్షలతోపాటు క్రమం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి సమస్యలను అధిగమించాలని అన్నారు. నిత్యం కాలినడక, యోగా వంటి కార్యక్రమాలు చేస్తూ ఆరోగ్యాన్ని కొంతమేర సురక్షితం చేసుకోవచ్చని సూచించారు. క్యాన్సర్లను సకాలంలో గుర్తిస్తేనే మనిషి ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా కాపాడుకోగలమని వైద్యులు సైతం తెలియజేస్తున్నారని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుని సకాలంలో చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో సినీ కార్మికులు, చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది, స్టార్‌ ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love