గ్రూప్‌-2 అభ్యర్థులపై లాఠీచార్జీ

– చెదరగొట్టే సమయంలో పోలీసుల అత్యుత్సాహం
– టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం
– వేలాదిగా తరలొచ్చిన బాధితులు
– రాతపరీక్షలను వాయిదా వేయాల్సిందే
– కమిషన్‌ కార్యదర్శిని కలిసిన అభ్యర్థులు
– రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ
– ఎల్లుండి ఉద్యమం ఉధృతం చేస్తాం : అభ్యర్థుల హెచ్చరిక
– ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి : కోదండరామ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో ఈనెల 29,30 తేదీల్లో నిర్వహిస్తున్న గ్రూప్‌-2 రాతపరీక్షలను వాయిదా వేయాల్సిందేనని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. వరుస పరీక్షలు వద్దనీ, సన్నద్ధమయ్యేందుకు తగిన సమయమివ్వాలని కోరుతున్నారు. అయితే వాటిని వాయిదా వేయాలని కోరుతూ వారు చేపట్టిన టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ జిల్లాల నుంచి వేలాదిగా అభ్యర్థులు తరలొచ్చారు. గ్రూప్‌-2 వాయిదా వేయాలంటూ ఫ్లకార్డులు పట్టుకుని పెద్దఎత్తున నినాదాలు చేశారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ సమయంలో పోలీసులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దొరికిన వారిని దొరికినట్టుగానే అరెస్టు చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం దిగొచ్చి పరీక్షలను వాయిదా వేసే వరకు నిరసనను విరమించేది లేదని అభ్యర్థులు స్పష్టం చేశారు. అయితే అభ్యర్థులు భారీగా హాజరు కావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. కొందరు అభ్యర్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి ఘర్షణ వాతావరణానికి దారితీసింది. శాంతియుతంగా నిరసన చేపట్టిన అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని పలువురు ఖండించారు. ఈ ఆందోళనకు టీజేఎస్‌ అధినేత కోదండరామ్‌, టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ వద్ద నిర్వహించిన నిరసనలో వారు పాల్గొన్నారు.
టీఎస్‌పీఎస్సీ నిర్ణయమే కీలకం…
టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, సభ్యుడు లింగారెడ్డిని ఏడుగురు గ్రూప్‌-2 అభ్యర్థులు కలిసి పలు విషయాలను చర్చించారు. ఈనెల ఒకటి నుంచి 23 వరకు గురుకుల బోర్డు పరీక్షలు, వచ్చేనెల 12 నుంచి అక్టోబర్‌ మూడో తేదీ వరకు జేఎల్‌ పరీక్షలతోపాటు, వచ్చేనెల 15న టెట్‌ రాతపరీక్షలున్నాయని అభ్యర్థులు వివరించారు. ఈ రెండు పరీక్షల వల్ల గ్రూప్‌-2 రాతపరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షకు పరీక్షకు మధ్య కాలవ్యవధి ఉండేలా చర్యలు తీసుకుంటామనీ, అభ్యర్థులు అన్ని పరీక్షలకు సన్నద్ధమయ్యేలా వెసులుబాటు కల్పిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 29,30 తేదీల్లో నిర్వహించే గ్రూప్‌-2 రాతపరీక్షలను వాయిదా వేయాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ బి జనార్ధన్‌రెడ్డి అందుబాటులో లేరనీ, అభ్యర్థుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని ఆయనకు పంపించామని కార్యదర్శి అనితా రామచంద్రన్‌ అభ్యర్థులతో చెప్పారు. చైర్మెన్‌ వచ్చాక రెండు రోజుల్లో (48 గంటల్లో) నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో అభ్యర్థులు ఆందోళనను విరమించారు.
ఆందోళనకు అనుమతి ఇచ్చిన డీసీపీ వెంకటేశ్వర్లు
టీఎస్‌పీఎస్సీ వద్ద గ్రూప్‌-2 అభ్యర్థుల ఆందోళనకు పోలీసుల అనుమతి లేదు. వారితో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆందోళన ఆపేయాలనీ, లేదంటే అందరినీ అరెస్ట్‌ చేస్తామంటూ హెచ్చరించారు. ఉదయం వచ్చిన కొందరు అభ్యర్థులను ముందస్తుగా అరెస్ట్‌ చేశామనీ, ఈ ఆందోళన విరమించకపోతే మిగతా వారినీ అరెస్ట్‌ చేస్తామని చెప్పారు. శాంతియుతంగా ధర్నా చేసుకుంటామమంటూ ఈ సందర్భంగా కోదండరాం చేసిన విజ్ఞప్తి మేరకు గంటపాటు అనుమతి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీపై నమ్మకం లేదని అభ్యర్థులు అన్నారు. మంత్రి కేటీఆర్‌ వచ్చి భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే గ్రూప్‌-2 రాతపరీక్షలను వాయిదా వేస్తున్నట్టు లిఖితపూర్వకంగా ప్రకటన ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. అభ్యర్థులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. అయినా వెళ్లకపోవడంతో లాఠీచార్జీ చేశారు.
రెండు నెలలు వాయిదా వేయాలి : కోదండరామ్‌
గ్రూప్‌-2 రాతపరీక్షలను రెండు నెలలపాటు వాయిదా వేయాలని కోదండరామ్‌ ఆందోళన సందర్భంగా డిమాండ్‌ చేశారు. అభ్యర్థుల న్యాయమైన డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. వరుసగా పరీక్షలను నిర్వహించడం వల్ల అభ్యర్థులు మానసికంగా ఒత్తిడికి లోనవుతారని అన్నారు. అభ్యర్థుల కోరిక మేరకు రెండు నెలల సమయమిచ్చి గ్రూప్‌-2 పరీక్షలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రియాజ్‌, పిల్లి సుధాకర్‌, విద్యార్థి జన సమితి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాసంపల్లి అరుణ్‌ కుమార్‌, గోపి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.
నేడు రాజకీయ నాయకులకు వినతిపత్రాలు
గ్రూప్‌-2 రాతపరీక్షలను వాయిదా వేయాలంటూ జిల్లాల్లో రాజకీయ పార్టీల నాయకులను శుక్రవారం కలిసి వినతిపత్రాలను సమర్పించాలని అభ్యర్థులు నిర్ణయించారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపట్టి, కలెక్టర్లకు వినతిపత్రాలను సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ నుంచి సానుకూల స్పందన రాకపోతే ఆదివారం నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అభ్యర్థులు భావిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలనూ ఏకం చేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ దశల్లో ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Spread the love