విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన చంపాయ్ సోరెన్ సర్కార్

నవతెలంగాణ – రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వ‌హించిన‌ విశ్వాస ప‌రీక్ష‌లో చంపై సోరెన్ ప్ర‌భుత్వం నెగ్గింది. విశ్వాస ప‌రీక్ష‌కు అనుకూలంగా 47 ఓట్లు, వ్య‌తిరేకంగా 29 ఓట్లు పోల‌య్యాయి. ఈ మేర‌కు చంపై సోరెన్ విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన‌ట్లు జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌క‌టించారు. అనంత‌రం చంపై సోరెన్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ హ‌ర్ష‌ధ్వానాలు మోగించారు. విశ్వాస ప‌రీక్ష ముగిసిన అనంత‌రం అసెంబ్లీ వాయిదా ప‌డింది. మ‌ళ్లీ మంగ‌ళ‌వారం స‌భ ప్రారంభం కానుంది. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్‌లో జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం)తో క‌లిసి జేఎంఎం ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. జేఎంఎం మిత్ర‌ప‌క్షాలైన కాంగ్రెస్‌కు 17, సీపీఎంకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. విప‌క్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల‌తో పాటు ఆ పార్టీ మిత్ర‌ప‌క్షాల‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వాస ప‌రీక్ష ఓటింగ్‌లో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. కోర్టు అనుమ‌తితో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య సోరెన్‌ను పోలీసులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. జ‌న‌వ‌రి 31వ తేదీన హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో హేమంత్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం చంపై సోరెన్ సీఎంగా ప్ర‌మాణం చేసి, ఇవాళ త‌న బ‌లాన్ని నిరూపించుకున్నారు.

Spread the love