తిరుమల నడకదారిలో చిరుత కలకలం

నవతెలంగాణ – హైదరాబాద్: అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని టీటీడీ అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. అటవీ శాఖ అమర్చిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుత సంచారాన్ని గుర్తించినట్లు చెప్పారు. బాలిక లక్షితపై దాడి జరిగిన అనంతరం ఇప్పటికే ఆరు చిరుతలను బోన్లలో బంధించి, వివిధ ప్రాంతాల్లో విడిచిపెట్టారు. వాటిలో నాలుగోసారి పట్టుబడిన చిరుత చిన్నారిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో చిరుత సంచారం కనిపించడంతో తితిదే అటవీ శాఖ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులను గుంపులుగా పంపడం, వారికి చేతికర్రలు అందించడంతో పాటు ఆ మార్గంలో సిబ్బందిని ఉంచినట్లు డీఎఫ్‌వో వివరించారు.

Spread the love