గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ మృతి..

నవతెలంగాణ – ఉత్తర్ ప్రదేశ్: గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్‌ అన్సారీ (63) గుండెపోటుతో మృతి చెందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన మృతికి సంబంధించి అధికారులు మెడికల్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘‘యూపీలోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్సారీ గురువారం సాయంత్రం 8.25 గంటల సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో జైలు అధికారులు ఆయనను దుర్గావతి మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినప్పటికీ గుండెపోటుతో ఆయన చనిపోయారు’’ అని బులెటిన్‌లో పేర్కొన్నారు. అన్సారీ మృతితో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్‌లో 144 సెక్షన్‌ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్‌, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్‌ రిజర్వ్‌ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం అన్సారీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. ఆయనకు జైలులో విషపూరిత ఆహారం ఇచ్చారని ఇటీవలే ఆయన సోదరుడు, ఘాజీపుర్‌ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ ఆరోపించారు. అయితే ముఖ్తార్‌ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మరుగుదొడ్డిలో పడిపోయారని జైలు అధికారులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు.

Spread the love