ధరణి ఆపరేటర్లతో నెట్ సెంటర్ నిర్వాహకుల కుమ్మక్కు..!

అధికారులతో కుమ్మక్కై లావాదేవీలు చేస్తున్న బ్రోకర్లు.
ధరణి ఆపరేటర్ల చేతిలోనే..
డాటాని రెవెన్యూ సిబ్బందినే బయటకి ఇస్తున్నారా..?
తీసుకున్న డబ్బులు అధికారుల పేరు చెప్పి తీసుకుంటారా..? లేదా అధికారులు చెప్తే తీసుకుంటారా..?
నవ తెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్.
వ్యవసాయ భూముల రికార్డులు ధరణి పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసి పట్టా పాస్ బుక్కులను రైతులకు ఇబ్బందులు లేకుండా సరైన సమయంలో సులభతరం చేయడానికి గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ నీ తీసుకొచ్చింది.రెవెన్యూ రికార్డులు మొత్తం ధరణిలో నమోదు చేసింది. అప్పటినుంచి రైతులకు భూముల రికార్డుల నమోదు, అమ్మకం, కొనుగోలు,సౌతి వంటి వివరాలు ధరణిలో దరఖాస్తు చేసుకొని రెవెన్యూ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకొని,ఆ తేదీనాడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుండేది.గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వ్యవసాయ భూముల రికార్డులు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు.రైతులకు అందుబాటులో ఉండే విధంగా మండల రెవెన్యూ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రత్యేక ధరణి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు సులభతరం చేసింది. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఆన్ లైన్ లో నమోదు చేసుకొని పనులు సులభతరం చేసుకోవడానికి ధరణి పోర్టల్ నీ తీసుకువచ్చినట్లు గత ప్రభుత్వం తెలియజేసింది. లంచాలు,అవినీతి,అక్రమాలు ప్రభుత్వ కార్యాలయాలలో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కొత్త ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బ్రోకర్లు, కొందరు ప్రభుత్వ సిబ్బంది, ఆన్ లైన్ దరఖాస్తు చేసే ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు, కొందరు మీసేవ ఆపరేటర్లు రెవెన్యూ కార్యాలయాలలో మధ్యవర్తిత్వం చేస్తూ అధికారులతో మాట్లాడి ఎంతో కొంత ఇచ్చి మీ పని చేసి పెడతామని డబ్బులు తీసుకుంటున్నారు.
అధికారులతో కుమ్మక్కై లావాదేవీలు చేస్తున్న బ్రోకర్లు.
బ్రోకర్లు,మధ్యవర్తిత్వం చేస్తున్న వ్యక్తులు తీసుకున్న డబ్బులు అధికారుల పేరు చెప్పి తీసుకుంటారా..? లేదా అధికారులు చెప్తే తీసుకుంటారా..?తీసుకున్న డబ్బులు రెవెన్యూ కార్యాలయాలలో ఎవరెవరికి అందుతున్నాయి అని ఆరా తీయాల్సి ఉంది.
సూర్యాపేట జిల్లాలో కొన్ని మండలాలలో ధరణి పోర్టల్ లో వ్యవసాయ రికార్డులు దరఖాస్తు చేసుకున్న తర్వాత రెవెన్యూ కార్యాలయాలలో కొందరు సిబ్బందికి, ధరణి ఆపరేటర్లకు డబ్బులు చెల్లిస్తేనే పనులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తు న్నాయి.కొందరు రెవెన్యూ అధికారులు చెప్పిన ఇంటర్నెట్ సెంటర్లలో మాత్రమే దరఖాస్తు చేసుకుని వస్తే ధరణి నమోదులో పట్టా పాస్ పుస్తకాల వివరా లు నమోదు చేస్తున్నారని,రైతులు వారికి నచ్చిన వారి వద్ద ఆన్ లైన్ చేసుకొని వస్తే రిజెక్టు చేస్తున్నా రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.రెవెన్యూ అధికారులు కొందరు ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులతో కొమ్మక్ అవుతున్నారని మరికొన్ని కార్యాలయాలలో ధరణి ఆపరేటర్లతో ములాఖత్ చేసుకొని వారికి నచ్చిన విధంగా ధరణిలో మార్పులు చేస్తూ రికార్డులను తారుమారు చేస్తున్నారని సమాచారం.
ధరణి ఆపరేటర్ల చేతిలోనే..
వ్యవసాయ రికార్డులను ఏమి చేయాలన్నా రెవెన్యూ అధికారులు,ధరణి ఆపరేటర్ల చేతిలో ఉంటుంది. రెవెన్యూ కార్యాలయంలో ధరణి దోపిడీ రెవెన్యూ అధికారులకు తెలిసి జరుగుతుందా తెలియకుండా తెర వెనుక కొందరు రెవెన్యూ సిబ్బంది దోపిడీకి పాల్పడుతున్నారా అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది.వాస్తవానికి తమ ఇష్టం వచ్చిన చోట ధరణి ఆన్ లైన్ నమోదు చేసుకుని రెవెన్యూ కార్యాలయంలోని ధరణిని వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్
చేసుకోవాల్సి ఉంటుంది.మండల కార్యాలయం నుంచి మొదలుకొని జిల్లా కార్యాలయం వరకు ధరణి దోపిడీ ఇష్టానుసారంగా సాగుతున్నట్లు సమాచారం.కొందరు ఇంటర్నెట్ నిర్వాహకులు తాము అడిగినంత డబ్బులు చెల్లిస్తే మీ వ్యవసాయ భూముల రికార్డులు పట్టాపాస్ పుస్తకాలలో నమోదు చేసి ఇస్తామని అందిన కాడికి దండుకుంటున్నారు.రెవెన్యూ డాటా రెవెన్యూ కార్యాలయాలలోనే ఉండాలి కానీ బయట ఉండే కొన్ని ఇంటర్నెట్ సెంటర్లలో కొన్ని రెవెన్యూ కార్యాల యాలకు సంబంధించిన డాటా ఉండడంపై పలు అనుమానాలకు తావితీస్తోంది. కొన్ని ఇంటర్ నెట్ సెంటర్లలో పూర్తి రెవెన్యూ డాటా ఉన్నట్లు సమాచారం.డాటాని రెవెన్యూ సిబ్బందినే బయటకి ఇస్తున్నారా..?
డాటా మొత్తం ని రెవెన్యూ కార్యాలయ సిబ్బంది నే బయటకి ఇస్తున్నారా.తమ ఇష్టానుసారంగా రెవెన్యూ డాటాను బయటి వ్యక్తులకు ఏ విధంగా ఇచ్చారని పలువురు అనుమానిస్తున్నారు.కొందరు ధరణి ఆపరేటర్లు, ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు మండ లాలలో కొమ్మక్ అవుతూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ కార్యాలయాలలో అధికా రులకు తెలియకుండా కొందరు రెవెన్యూ సిబ్బంది. దోపిడీకి పాల్పడుతున్న వారిపై నిఘా ఏర్పాటు చేసి అవినీతి లేని రెవెన్యూ కార్యాలయాలుగా మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయదారులు, ప్రజలు కోరుతున్నారు.
ధరణి రిజిస్ట్రేషన్ దోపిడీని అరికట్టాలి..
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు..
ధరణి రిజిస్ట్రేషన్లలో రెవెన్యూ కార్యాలయాలలో కొందరు అధికారులు దోపిడికి పాల్పడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం రెవెన్యూ కార్యాలయానికి వెళితే డబ్బులు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలిసింది. రెవెన్యూ ధరణి రిజిస్ట్రేషన్లలో బ్రోకర్ల దందా ఎక్కువగా ఉంది.అధికారులు స్పందించి మధ్యవర్తిత్వం చేస్తున్న బ్రోకర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.అధికారులకు తెలియకుండా దోపిడీకి పాల్పడుతున్న కొందరు రెవెన్యూ సిబ్బందిపై నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలి.
Spread the love