సచేతనమైన సాహిత్య ‘ధార’

'ధార' సాహిత్య వ్యాస సంకలనం
‘ధార’ సాహిత్య వ్యాస సంకలనం

ఒక రచయిత అభిరుచిని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలంటే అతను ఎన్నుకునే సాహిత్యాంశాన్ని తడిమి చూస్తే తెలిసిపోతుంది. పాత్రికేయ వృత్తిలో చేరడానికి ముందే సాహిత్యం పట్ల ఇష్టాన్ని పెంచుకున్న వర్ధమాన రచయిత అనంతోజు మోహన్‌కృష్ణ. ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే సాహిత్యాన్ని చదవడమే గాక దానిని మననం చేసుకుంటూ సాధ్యమైనంత మేర తన పరిధిలో తాను విశ్లేషించుకోవడమో, ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడమో, వివేచనాత్మక దృష్టితో చూడటమే చేస్తూ వాటిని అక్షరీకరించుకుంటూ పోయిన సృజనశీలి, క్రియాశీలి మోహన్‌కృష్ణ.
ఈ విషయం అతని సాహిత్య వ్యాసాల సంపుటి ‘ధార’ చదివితే అర్ధమవుతుంది. పదిహేను వ్యాసాలతో వున్న ‘ధార’లో దాశరథి లోని స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి, ప్రజా ఉద్యమాల్లోని భాగస్వామ్యం లాంటి పలు పార్శ్వాలను స్పర్శించాడు. వట్టికోట ‘గంగు’ నవల పరామర్శతో ప్రజాసాహిత్యాన్ని పలకరించాడు.
జాషువా తన రచనలతో ప్రజల్లో కలిగించిన చైతన్యాన్ని పలవరించాడు. ”రాజు మరణించే నొక తార రాలిపోయే/ కవియు మరణించే నొక తార గగనమెక్కె/ రాజు జీవించే రాతి విగ్రహములందు/ సుకవి జీవించే ప్రజల నాలుకల యందు” అని కవి గొప్పతనాన్ని జాషువా తెలియపరిచిన పద్యాన్ని గుర్తు చేసుకుంటూ తనలోని రచయితను, కవిని చైతన్య పరుచుకుంటాడు. ఈ సంపుటిలో రావూరి భరద్వాజ ప్రసిద్ధ నవల ‘పాకుడు రాళ్లు’ విశేషణాలతో బాటు, కథన రూపకం ‘సశేషం’ రచనను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది.
కందుకూరి వీరేశలింగం, కుసుమ ధర్మన్న, కాళోజి, శ్రీశ్రీ, సినారె, గిడుగు, అనిసెట్టి, అలిశెట్టి వీరి సాహిత్య విశేషణాలు, వ్యక్తిత్వ విలక్షణతలు, గోర్కి నవల ‘అమ్మ’ పై విశ్లేషణ, బాలసాహిత్యాన్ని సృష్టిస్తున్న పెండెం జగదీశ్వర్‌ పరిచయం ఆసక్తిని కలిగిస్తాయి. సచేతనమైన సాహిత్యాన్ని అందిస్తున్న మోహన్‌ కృష్ణ వ్యక్తిత్వం, వ్యక్తీకరణలు రమేష్‌ రాంపల్లి గారి ముందుమాటలో అభివ్యక్తమవుతాయి.
సామాజిక స్పృహతో, సమాజం పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్న మోహన్‌ కృష్ణ సాహితీరంగంలో తనదైన ముద్ర సృష్టించుకోగలడనే నమ్మకాన్ని కలిగిస్తుంది ‘ధార’. సాహితీ ప్రముఖుల సాహిత్యాన్నే గాక వారి జీవితాలను, జీవన నేపథ్యాలను స్థూలంగా వివరిస్తూ తన అభిరుచికి తగినట్లుగా సాహిత్యానికి ప్రథమ సోపానాలు వేసుకున్న మోహన్‌ కృష్ణ సాహితీ శిఖరాలందుకోవాలని ఆశిద్దాం.

– డా . రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, 99088 40186

Spread the love