చైతన్యధార

Consciousness‘అన్యాయాన్ని ఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు. పాలకుడైనా, పరాయివాడైనా’ అని ఎలిగెత్తి చాటిన తెలంగాణ తొలిపొద్దు కాళోజీ నారాయణరావు జయంతి నేడు. తప్పుని ఎత్తిచూపడమే కాదు, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రశ్నించడం నేర్పిన ప్రజాకవి ఆయన. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజల హక్కుగా పోరాడిన వ్యక్తి. తెల్లని కాగితంపై నల్లని పెన్నుతో, అక్షర సేద్యం చేస్తూ, తెలుగు మేడపై నివసిస్తూ, అన్యభాషల గాలుల్లో కొట్టుకుపోకంటూ తెలంగాణ భాషా గొప్పతనాన్ని తెలియజేసిన మహనీయుడు. ప్రజల సమస్యలనే తన సమస్యలుగా, ప్రజల గొడవను తన గొడవగా తీసుకుని ‘నా గొడవ’ పేరుతో రచనలు చేసిన అక్షరసూరీడు. నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన కలం నియంతృత్వాన్ని ధిక్కరించింది. ఒక చైతన్య ధారగా ప్రజలకు బాటలు వేసింది. గన్నులతో చేయలేని పని పెన్నుతోనే చేసి సిరాచుక్కలతో నిప్పుల్లాంటి రచనలు సాగిస్తూ యువతను ఉద్యమం వైపు నడిపించింది. ఆయన చేసిన ఉపన్యాసాలు, రచనలు, భావాలు తెలంగాణ యాసలో, అందరికీ అర్థమయ్యే వాడుకలో చెప్పడంలో నేటికీ రారెవరూ సాటి. ఆంధ్ర పాలకుల వివక్షలను తన కలంతో చురకత్తుల్లాంటి కవితలను కూర్చి లక్షల మెదళ్లను కదిలిస్తూ గళం విప్పిన ఘనాపాటి.
నాటి స్వాతంత్య్ర పోరాటం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు అక్షర సమరం చేసిన కాళోజీ పాలకుల ప్రజావ్యతిరేక విధానాలను ఏనాడో తూలనాడారు. చిన్నప్పుటి నుంచే చైతన్యాన్ని ఒంటబట్టించుకున్న ఆయన విద్యార్థి దశలోనే ఉద్యమాలు ప్రారంభించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వరంగల్‌లో విద్యార్థి నాయకుడిగా అనేక నిరసనలు చేపట్టారు. అణిచేయడానికి ఆనాటి పాలకులు పెట్టిన అన్ని నిర్బంధాలను ఆయన ఛేదించారు. జాతియోద్యమంలోనూ పాల్గొని జైలుజీవితం అనుభవించారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడే అక్షరాన్ని ఎక్కుపెట్టి తూటాల్లా పేల్చేవారు. ‘నమ్ముకుని అధికారమిస్తే నమ్మకం పోగొట్టుకుంటివి. పదవి అధికారం బూని పదిలముగా తల బోడిజేస్తివి. దాపునకు రాననుచు చనువుగా టోపీ పెడితివి. లాభపడితివి.’ ఇది అప్పటి రాజకీయ పరిస్థితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నేటికీ అద్దం పడుతున్న తీరును గమనించవచ్చు. ఎందుకంటే దేశంలో జరుగు తున్న పరిణామాలు ప్రజల దారిద్య్రాన్ని, పరదాల చాటున దాచిన పేదరికాన్ని బయటపెడుతున్నాయి. కులం, మతం, ప్రాంతం పేరుతో జరుగుతున్న అరాచక విధానాల్ని తెలియజేస్తున్నాయి. నాటి నిజాం అయినా, నేటి మోడీ అయినా జనం రక్తాన్ని జలగల్లా పీలుస్తూ వారి జీవితాలతో మృత్యుకేళి ఆడుతున్న తీరును ప్రజలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అందుకే అధికారపక్షంలో ఎవరున్నా, ఎలాంటివారైన తన రచనలను జంకకుండా, నిర్మోహ మాటంగా ప్రజలు అనుభవిస్తున్న బాధల్ని సూటిగా చెప్పేవారు కాళోజీ.
అన్యాయం ఎక్కడ జరిగినా దాని వ్యతిరేకత ఆయన కలంలో కనిపించేది. గళంలో వినిపించేది. విభజించి పాలించాలనే దురుద్దేశంతో మతాల మధ్య పాలకులు పెట్టే చిచ్చును ఆర్పేసేవారు. ‘అవనిపై జరిగేటి అవకతవకలు జూసి…ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు…పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె… మాయమోసము జూసి మండిపోవును ఒళ్లు…పతిత మానవు జూచి చితికిపోవును మనసు…ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు? అంటూ ఆయన హృదయఘోషను తానే ఆవిష్కరించుకున్నారు. ప్రజల మధ్య అగాధం ఏర్పడుతున్నప్పుడు కాళోజీ వేగంగా స్పందించేవారు. సమాజంలో పేరుకుపోయిన కుళ్లును కలంతోనే కడిగేసేవారు. అందరూ కలిసిమెలిసి జీవించే సోదరతత్వాన్ని ప్రజల్లో పెంపొందించేవారు. అందుకే.. ‘ఇదేంది? పోచమ్మ గుడి దగ్గర నువ్వే ఉంటవ్‌. హిందూ ముస్లింల మధ్య గొడవ జరిగితే నువ్వే ఉంటవ్‌, గణపతి ఉత్సవాల దగ్గరా నువ్వే ఉంటవ్‌, పౌరహక్కుల సమావేశాల్లో నువ్వే ఉంటవ్‌, ఆర్య సమాజ్‌ దగ్గరా నువ్వే ఉంటవ్‌?’ ఏందన్నా ఇదీ అని పోలీసులు కాళోజీని అడిగేవారు. కాళోజీకి పార్టీలు, భావజాలాలు లేవు. ఈ చట్రాల్లో ఆయన ఎప్పుడూ బంధీ కాలేదు. అన్యాయాన్ని ఎదిరించడమే ఆయన నేర్చుకున్న సిద్ధాంతం.అవహేళనల్ని తిప్పికొట్టడమే ఆయన ఎంచుకున్న అభిమతం. కానీ నేడు మతతత్వవాదులు ఆలయం దగ్గర వారే గొడవకు దిగుతారు. మసీదు దగ్గర వారే ఘర్షణకు ప్రేరేపిస్తారు. హిందూ,ముస్లింల మధ్య విభజన తీసుకొస్తారు. చివరకు ఈ దేశం మీది కాదని వెళ్లిపొమ్మంటారు.
‘పుట్టుక నీది…చావు నీది…బతుకంతా దేశానిది’ అని కాళోజీ తన వైఖరిని ప్రకటించి మరీ పోరాటాల్లో నిలిచారు. తెలంగాణ భాషను ప్రేమించారు. యాసలో జీవించారు. దాని ఆధారంగానే అక్షరాలు పూయించారు. ఆ అక్షరాలతోనే అన్యాయాన్ని ఎదిరించారు. ప్రజలను కదిలించారు. తన బాధలో ఆందరి బాధ చూసుకుంటూ ఇదే ‘నాగొడవ’ అంటూ సమరగీతిక సాగిస్తూ అస్తమించారు. నేడు కేంద్రంలోని బీజేపీ మత రాజకీయాలపై కాళోజీ స్ఫూర్తితో ఉద్యమించాలి. ఆయన పంచిన చైతన్యధారలో ప్రవహిస్తూ ముందుకు సాగాలి.

Spread the love