కార్పొరేట్‌ మతతత్వ విధానాలను ఎండగట్టాలి

కార్పొరేట్‌ మతతత్వ విధానాలను ఎండగట్టాలి– ప్రజల సమస్యలను, హక్కులను ఎలుగెత్తి చాటాలి
– ఈ నెల పది నుంచి 20వరకు రాష్ట్ర వ్యాప్త ప్రచారం
– 19న కార్మిక కర్షక ఐక్యతా సదస్సులు
–  26న జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్‌, వాహనాల ర్యాలీలు : కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ దేశాన్ని కాపాడుకునేందుకు కేంద్రంలో మతతత్వ, కార్పొరేట్‌ అనుకూల బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి. కార్పొరేట్లకు వేల కోట్లు దోచిపెడుతున్న మోడీ సర్కారు సామాన్యుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్నద’ని కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ,రైతు, వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం), కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ దేశవ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్‌ అధ్యక్షతన సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశం జరిగింది. రాష్ట్రంలో జనవరి 10 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా కరపత్రాల ద్వారా మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృతంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. 19న జిల్లా కేంద్రాల్లో కార్మిక- కర్షక ఐక్యతా సదస్సులు నిర్వహించాలని తీర్మానించింది. 26న జిల్లా కేంద్రాల్లో ట్రాక్టర్‌, వాహనాల ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు డాక్టర్‌ హేమలత, వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం. సాయిబాబు మాట్లాడుతూ…. మోడీ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. ఎన్నో త్యాగాలు చేసి, పోరాడి సాధించుకున్న 29 చట్టాలను కుదించి, నాలుగు లేబర్‌ కోడులుగా తీసుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నదని విమర్శించారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకానికి నిధులలో కోత పెట్టిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయన్నారు. వాటిని నియంత్రించటంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సర్కారు.., ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఉన్న ఉపాధి అవకాశాలు కూడా పోతున్నాయన్నారు. ”మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. కార్పొరేట్లని తరిమికొట్టాలి. దేశాన్ని రక్షించాలి.” అనే నినాదంతో దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలకు యావత్‌ ప్రజానీకం సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఈ ఆందోళనల్లో అన్ని కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, మహిళా, విద్యార్థి లోకమంతా భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేష్‌, భూపాల్‌, ఎస్వీ రమ, మల్లికార్జున్‌, జయలక్ష్మి ,కూరపాటి రమేష్‌, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ జంగారెడ్డి, సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాదరావు, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బొప్పని పద్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love