ద్వేషం కాదు దేశం ముఖ్యం

Not hate Country is important– దేశమంటే రాష్ట్రాల సమాహారం: తెలంగాణపై ప్రధాని వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ద్వేషం కాదు…దేశం ముఖ్యం. దేశమంటే రాష్ట్రాల సమాహారమని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణపై ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. ఏ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారో, అదే పార్లమెంటు సాక్షిగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పట్ల ప్రధాని పదే పదే అక్కసును వెళ్లగక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడిన చారిత్రక అంశాల పట్ల సున్నితంగా వ్యవహరించడం నేర్చుకోవాలని ప్రధానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంబరాలు జరగలేదనడం…ప్రధాని అహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.
రాష్ట్రం ఏర్పడిన నాడు ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు అంబరాన్నంటిన సంబరాలు కంటి కనబడలేదా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే ఉద్దేశంతో కోట్లాది మంది ప్రజల మనోభావాలని గాయపరిచేలా గతంలోనూ తల్లిని చంపి బిడ్డను తీశారని మోడీ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. గాంధేయ మార్గంలో కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరిగిందని అనడం అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధుల మూటలివ్వడం లేదు..కనీసం మాటల్లోనైనా మర్యాద చూపించాలని సూచించారు.
ఏడు మండలాలను లాక్కొని లోయర్‌ సీలేరు ప్రాజెక్టులో కలుపుకుని తొలి ద్రోహం చేశారని మండిపడ్డారు. నిటిఅయోగ్‌ సూచించిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథలకు బీజేపీ సర్కార్‌ నిధులివ్వడానికి నిరాకరించిందని గుర్తుచేశారు.కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌ కు తరలించుకుపోయారనీ, 157 మెడికల్‌ కాలేజీల్లో తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదనీ, అప్పర్‌ భద్ర, పోలవరంకు జాతీయ హౌదా ఇచ్చి మధ్యలో తెలంగాణకు మొండి చేయి చూపించారని విమర్శించారు. ఏపీ విభజన హామీలనూ నెరవేర్చలేదని తెలిపారు. డబుల్‌ ఇంజిన్‌ నినాదంతో ఊదరగొట్టిన డబుల్‌ డిజిట్‌ సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో బీజేపీ మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా అని తెలిపారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన బీజేపీకి పుట్టగతులుండవని విమర్శించారు.

Spread the love