ప్రభుత్వ భూముల్లో పేదలకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: సిపిఎం డిమాండ్

నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రభుత్వ భూముల్లో పేదలకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం నిజామాబాద్ నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సిపిఎం నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ నగర్ చౌరస్తాలో గల ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఏఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కె రమేష్ బాబు, నగర కార్యదర్శి పెద్ది సూరి మాట్లాడుతూ.. దుబ్బ ప్రాంతంలోని 171, 172 సర్వే నెంబర్లలో గల ప్రభుత్వ స్థలంలో ఇళ్ల స్థలాలు లేని పేదలని ఏకం చేసి నెల 15 రోజుల క్రితం గుడిసెలు వేసి భూ పోరాటం ప్రారంభించడం జరిగింది. గుడిసెలు వేసిన పేదలు రాత్రి బవల్లు అక్కడే నివాసం ఉంటూ వర్షాల కారణంగా విష సర్పాలు, కీటకాలు, తేళ్లు, ఇతర లేక ప్రమాదాలు ఉన్నప్పటికీ ప్రాణాలను లెక్కచేయకుండా జానేడు నివాస స్థలం కోసం పోరాడుతున్నారు అని అన్నారు, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి ఇది మా స్థలం మీరు ఖాళీ చేయాలి అని ప్రజల్ని బెదిరిస్తున్నారు అన్నారు, ఇట్టి ప్రభుత్వ స్థలాలు రియల్ ఎస్టేట్, అక్రమ కబ్జాదారుల, కబంధహస్తాలకు బలికాకుండా వెంటనే రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకొని సర్వే చేసి ప్రభుత్వ స్థలానికి హద్దులు పాతి రక్షణ కల్పించి గుడిసెలు వేసుకున్న ప్రజలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే అధికారికంగా పంచిపెట్టాలని అన్నారు. ఇండ్లు నిర్మించుకొనుటకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు మొత్తం 15 లక్షలు ఎలాంటి నిబంధనలు లేకుండా ఇవ్వాలని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రోడ్లు, విద్యుత్తు, నీటి సౌకర్యాలు కల్పించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాల్యాల గోవర్ధన్ జిల్లా కమిటీ సభ్యులు బెజగం సుజాత నగర కార్యదర్శి వర్గ సభ్యులు కటారి రాములు పి మహేష్ నగర కమిటీ సభ్యులు డి కృష్ణ, నరసన్న, అనసూయమ్మ, అబ్దుల్, 300 మంది గుడిసె వాసులు పాల్గొన్నారు.

Spread the love