నటి డింపుల్‌ హయతీపై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో క్రిమినల్‌ కేసు

నవతెలంగాణ – హైదరాబాద్
ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్‌ స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్‌ హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ జర్నలిస్ట్‌ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్‌ అధికారి నగర ట్రాఫిక్‌ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ సీ (2)లో టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్‌ హయతీ తన స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. భవనానికి చెందిన పార్కింగ్‌ స్థలంలో పార్క్‌ చేసిన డీసీపీకి చెందిన అధికారిక వాహనానికి అడ్డుగా డింపుల్‌ హయతీ, విక్టర్‌ డేవిడ్‌లు తమ బీఎండబ్ల్యూ కారును పెట్టడంతోపాటు అకారణంగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఎం.చేతన్‌ కుమార్‌తో వాగ్వాదానికి దిగుతుంటారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్‌ చేసుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 14న రాత్రి పార్క్‌ చేసిన డీసీపీ అధికారిక వాహనంను డింపుల్‌ హయతీ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కారుకు ఇతర వాహనాలు తగలకుండా జాగ్రత్త కోసం పెట్టిన కోన్స్‌ను, డీసీపీ కారును కాలితో తన్నుతూ వీరంగం సృష్టించింది.ఇదేంటని ప్రశ్నించిన కానిస్టేబుల్‌ విధులకు ఆటంకం కలిగించింది. దీంతో కానిస్టేబుల్‌ చేతన్‌ కుమార్‌ మూడురోజుల కిందట జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డింపుల్‌ హయతీతోపాటు ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం హీరోయిన్‌ డింపుల్‌ హయతీ, విక్టర్‌ డేవిడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఆర్‌పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చి పంపించారు.

Spread the love