గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్‌

నవతెలంగాణ – హైదరాబాద్: గోల్కొండ కోట‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి సోమ‌వారం ప‌రిశీలించారు. వేదిక‌తో పాటు వేడుక‌లు నిర్వ‌హించే ప్రాంతాల్లో క‌లియ‌తిరిగిన సీఎస్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను పురస్కరించుకుని అధికారులంతా సమన్వయంతో పనిచేసి, తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బ్లూ బుక్‌ ప్రకారం పోలీసుశాఖ తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్‌ మళ్లింపుల సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేయాలన్నారు. ట్రాఫిక్‌ నిర్వహణ, విద్యుత్తు, సీటింగ్‌, నీటి సరఫరా, పారిశుద్ద్యం, వైద్యసేవలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లను సీఎస్‌ పరిశీలించారు. వేడుకలు సజావుగా నిర్వహించేందుకు, వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జీఏడీ అధికారులు సీఎస్‌కు వివరించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు, ఆర్‌అండ్‌బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, జీహెచ్‌ఎంసీ కమిషన్‌ రోనాల్డ్‌రోస్‌, జలమండలి ఎండీ దానకిషోర్‌, ఐఅండ్‌పీఆర్‌ కమిషనర్‌ అశోక్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love