చీకటి వెలుగులు రంగేళి 2023

2023కి వీడ్కోలు పలికి, నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచ దేశాలలోని ప్రజలు సమాయత్తమవుతున్న తరుణమిది. భారతీయులు కూడా2023కి వీడ్కోలు పలికి, నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచ దేశాలలోని ప్రజలు సమాయత్తమవుతున్న తరుణమిది. భారతీయులు కూడా 2023కి గుడ్‌ బై చెప్పి, నూతన సంవత్సరంలో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 2023లో సంచలనం సష్టించి, వార్తల్లో నిలిచి, దేశాన్ని కుదిపేసిన కొన్ని సంఘటనలను ఇక్కడ మనం ఒక్కసారి మననం చేసుకుందాం.
గత సంవత్సరం ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా 2023 సంవత్సరం ప్రారంభం నుండి తగ్గుముఖం పడుతూ వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ విధించిన ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిని మే, 2023లో తొలగించింది. ఈ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ సంక్షోభాలు చెలరేగాయి. ఉక్రెయిన్‌, మయన్మార్‌ అంతర్యుద్ధంపై రష్యా దాడి, అనేక ఆఫ్రికన్‌ దేశాలలో తిరుగుబాట్లు, సాయుధ పోరాటాలు ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న అంతర్గత పోరాటాలకి అద్దం పట్టాయి. గాజా స్ట్రిప్‌ను పరిపాలించే హమాస్‌ ఇజ్రాయెల్‌పై దాడికి నాయకత్వం వహించడంతో, ఇజ్రాయెల్‌-పాలస్తీనా వివాదం తీవ్రమైంది. ఇంకా, అజెరి సైనిక దండయాత్ర తర్వాత 1,00,000 మంది ఆర్మేనియన్లు ఆ ప్రాంతం నుండి పారిపోయిన అనంతరం నాగోర్నో-కరాబాఖ్‌ వివాదం ముగిసింది. విపత్తు ప్రకతి వైపరీత్యాలలో కూడా ఈ సంవత్సరం అనేక విషాదాల్ని అందించింది. 21వ శతాబ్ధంలోనే అత్యంత ఘోరమైన భూకంపాలలో ఒకటిగా పరిగణించే భూకంపం టర్కీ, సిరియాలో సంభవించింది. ఈ భూకంపంలో దాదాపు 60,000 మంది మరణించారు. ఫ్రెడ్డీ తుఫాను చరిత్రలో సుదీర్ఘంగా నమోదైన ఉష్ణమండల తుఫాను. ఇది మలావి, స్మాంబిక్‌, మొజాంబిక్‌లలో 1,400 మరణాలకు దారితీసింది. పశ్చిమ మొరాకోలో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం బారినపడి 2,960 మంది మరణించారు. 2023 ఒక అతి పెద్ద బ్యాంకింగ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దాని ఫలితంగా అనేక దేశాలతో పాటు అమెరికన్‌ ప్రాంతీయ బ్యాంకులు కూడా పతనమయ్యాయి. స్విట్జర్లాండ్‌లో ఖదీూ ద్వారా క్రెడిట్‌ సూయిస్‌ కొనుగోలు చేయబడింది. సాంకేతికత రంగంలో 2023 సంవత్సరం సాదించిన ప్రగతి అంతా ఇంతా కాదు. అట్తిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ సాంకేతిక రంగంలో కొత్త పోకడలకి కారణమయింది.
భారతదేశానికి కూడా 2023 మిశ్రమ అనుభవాలనే అందించింది. ఒకపక్క దేశానికీ కొత్త పార్లమెంటు భవన నిర్మాణం, ప్రపంచంలోనే అంతరిక్ష రంగంలో భారత్‌ని అజేయమయిన శక్తిగా నిలబెట్టిన చంద్రయాన్‌-3 విజయం, కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న వ్యక్తులను సమర్థవంతమైన రెస్క్యూ మిషన్‌ ద్వారా రక్షించటం వంటి అంశాలు ఆనందానికి కారణమయితే, మరొక పక్క ఈశాన్య ప్రాంతంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిన జాతి హింస, మణిపూర్‌ మహిళలపై దాడులు, రాష్ట్రాలని అతలాకుతలం చేసిన ప్రకతి వైపరీత్యాలు, ప్రమాదాలు, క్రీడారంగంలోని లైంగిక వివక్షకు వ్యతిరేకంగా మహిళా మల్లయోధులు చేపట్టిన పోరాటం వంటి ఘటనలు అంతులేని ఆవేదనకీ, అంతకు మించి ఆందోళనకి కారణమయింది.
జనవరి… విజేతల కంట తడి …..
”బలవంతులు దుర్భల జాతిని బానిసలను కావించారు. నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదికిన దొరకదు. గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళ్ళతో…” అంటాడు శ్రీశ్రీ. సరిగ్గా అలాగే, దేశానికీ ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన విజేతల కన్నీళ్ళతో 2023 సంవత్సరానికి సంబంధించిన వర్తమాన ప్రస్థానం ప్రారంభమయింది. బిజెపి ఎంపి, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మహిళా క్రీడాకారుల్ని లైంగికంగా వేధిస్తున్నారని క్రీడాకారిణులు బహిరంగంగా ఆరోపించటంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌కి వ్యతిరేకంగా రెజర్లు రోడ్లపైకి వచ్చి భారీఎత్తున నిరసనలు చేశారు. 2023 జనవరిలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. రెజర్లకు ప్రజలతో పాటు వివధ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాని రద్దు చేయాలని, మహిళా క్రీడాకారినులపై లైంగిక వేధింపులకి పాల్పడుతున్న శరణ్‌ సింగ్‌ని అధ్యక్ష పదవి నుండి తొలగించి, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ వినేష్‌ ఫోగట్‌, సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా నేతత్వంలో పలువురు రెజ్లర్లు న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవటం దేశం మొత్తానికి దిగ్భ్రాంతిని కలిగించింది. బ్రిజ్‌ భూషణ్‌ తమ పార్టీ వాడే కావటంతో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంతో కూడిన నిశబ్దాన్ని ప్రదర్శించింది. ఈ సంవత్సరాంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అనుచరుడే అధ్యక్షుడిగా ఎన్నిక కావటంతో దేశానికి అనేక పతకాల్ని తీసుకొచ్చి, దేశం కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ఎగురవేసినందుకు గాను దేశం అందించిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తునామని క్రీడాకారులు ప్రకటిస్తున్నా, దేశాన్ని ఏలే నేతలకి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేకపోవటం సిగ్గుచేటు. ఇది బారత్‌ ప్రజల్ని కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అంతులేని ఆవేదనకీ గురిచేసిన ఒక సంఘటన.
ఫిబ్రవరి… లిక్కర్‌ కిక్‌బ్యాక్‌లు…
దేశ రాజకీయాల్లో అవినీతిని ఊడ్చేస్తామని, చీపురు గుర్తుతో అధికారంలోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా లిక్కర్‌ కుంభకోణంలో అరెస్ట్‌ కావటం దేశంలో రాజకీయంగా ఒక సంచలనం కలిగించింది. దేశాన్ని, దేశ రాజకీయాల్ని కుదిపేసిన లిక్కర్‌ స్కామ్‌ ప్రస్థానం 2022 లోనే ప్రారంభమయింది. అనేక మలుపులు తిరిగిన ఈ స్కాం కేసులో మనీష్‌ సిసోడియా కన్నా ముందు చాలామంది విచారణలని, అరెస్ట్‌లని ఎదుర్కొన్నారు. తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కె.కవితతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా పలువురు రాజకీయ నాయకులు, వారి కుమారులు ఈ లిక్కర్‌ స్కాంలో దోషులుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతనంగా ప్రవేశపెట్టిన ఎక్సైజ్‌ పాలసీని అడ్డం పెట్టుకుని అమ్‌ అద్మి ప్రభుత్వం అనేక అక్రమాలకి పాల్పడిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిపై విచారణ జరిపిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) ఫిబ్రవరి 26వ తేదీన మనీష్‌ సిసోడియాను అరెస్టు చేశారు. నూతన మద్యం పాలసీని అడ్డంపెట్టుకుని కొంతమందికి మద్యం విక్రయాల లైసెన్సులు ఇచ్చి వాటికి ప్రతిఫలంగా ‘కిక్‌బ్యాక్‌’ పేరుతో ఆర్ధిక ప్రయోజనాలు పొందారని, ఈ మొత్తం వ్యవహారంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని సిబిఐ ఆరోపించింది. మద్యం కుంభకోణంలో వచ్చిన అవినీతి సొమ్ముని ఆమ్‌ ఆద్మీ పార్టీ (AA) ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేయడానికి ఉపయోగించినట్లు బిజెపి ఆరోపిస్తుంది. ఇదే కేసులో ఢిల్లీ సిఎం కేజ్రివాల్‌ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో విచారణకి హాజారు కావాలని ఈడి కేజ్రివాల్‌ కి ఇప్పటి వరకు రెండు దఫాలుగా నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన రెండు సార్లు విచారణకి హాజరు కాకుండా తప్పించుకోవటం ఈ మొత్తం వ్యవహారంలో ఒక కొత్త కోణం.

మార్చి… కామెంట్‌ కలకలం..
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఒక నానుడి. కానీ నడుస్తున్న రాజకీయాలు దానికి భిన్నంగా సాగుతున్నాయి అనటానికి మార్చి, 2023లో జరిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్న రాహుల్‌ గాంధీపై వేసిన అనర్హత వేటు ఒక ఉదాహరణగా చూడొచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్నాటకలోని కోలార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ దేశంలో దొంగలందరి ఇంటి పేర్లలో ‘మోదీ’ అని ఎలా ఉందంటూ వ్యాఖ్యానించారని కొంతమంది ఆరోపించారు. ఆ వ్యాఖ్యల్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ రాహుల్‌ పై పరువు నష్టం కేసు దాఖలు చేసారు. ఈ కేసుపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు రాహుల్ని దోషిగా నిర్ధారించి, ఆయనకి రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు వెలువడిన వెనువెంటనే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేశారు. లోక్‌సభ సెక్రటేరియట్‌ జారీ చేసిన నోటీసులో ఆయన దోషిగా తేలిన రోజు మార్చి 23 నుండి సభకు అనర్హుడని పేర్కొనటం జరిగింది. ఈ ఘటన కాంగ్రెస్‌ వర్గాల్లో ఒక నైరాశ్యాన్ని కలిగిస్తే, దేశవ్యాప్తంగా ఒక కొత్త చర్చకి కారణమయ్యింది.
ఇదే నెలలో ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలలో బీజేపి క్రియశీల శక్తిగా అవతరించింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గట్టి విజయాన్ని సాధించగా, మేఘాలయ, నాగాలాండ్‌లలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలలో క్రియాశీలక బాగస్వామిగా అవతరించింది. మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. ఎన్‌పిపి, బీజేపిలు ఐదేళ్లపాటు కలిసి రాష్ట్రాన్ని పాలించినా ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. అయితే తిరిగి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మళ్లీ పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఏప్రిల్‌లో… జనాభా విరాట్‌ స్వరూపం ….
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా చాలాకాలం కొనసాగింది. అయితే 2023లో భారతదేశం ఈ మైలురాయిని అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. చైనా కంటే స్వల్పంగా 142.57 కోట్లతో భారత్‌ ముందుండగా, 140 కోట్లతో చైనా రెండో స్థానానికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి, రాబోయే మూడు దశాబ్దాల వరకు భారతదేశ జనాభాలో ఈ పెరుగుదల కనిపిస్తుందని, తర్వాత దాని క్షీణత ప్రారంభమవుతుంది అంచనా వేసింది. నిజానికి జనాభా పెరుగుదల అన్నది అంతగా అనందించాల్సిన అంశమేమీ కాదు. జనాభా పెరుగుదలకి అనుగుణంగా వారికి విద్య, ఉపాధి, వైద్యం వంటివి అందివ్వటం ప్రభుత్వాలకి తలకి మించిన భారంగా పరిణమిస్తుంది. దానితో పాటు సహజ వనరులపై తీవ్రమయిన ఒత్తిడి పెరుగుతుంది. అయితే భారతదేశ జనాభాలో యువత ఎక్కువుగా ఉండటం అభివద్ధి పరంగా భారతదేశానికీ కొంత కలిసొచ్చే అంశం.
ఇదే నెలలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయవేత్తగా ప్రారంభమయి గ్యాంగ్‌స్టర్‌గా, మాఫియా డాన్‌గా మారిన అతిక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ల ఎన్‌కౌంటర్‌ దేశంలో ఒక సంచలనం కలిగించింది. ఏప్రిల్‌ 15న నిందిత సోదరులు ఇద్దర్ని పోలీసులు ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్‌ కాలేజీకి చెకప్‌ కోసం తీసుకువెళుతుండగా ఈ దాడి జరిగింది. పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధుల సమక్షంలో అతిక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ను మీడియా ప్రతినిధుల వేషంలో వచ్చిన ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. పోలిసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులని, బహిరంగంగా పోలీసులు, మీడియా సమక్షంలో దాడి చేసి చంపటం పెను సంచలనం కలిగించింది.
ఇదే నెలలో జరిగిన మరొక ముఖ్య సంఘటన అమతపాల్‌ సింగ్‌ అరెస్టు. అతిక్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రఫ్‌ల ఎన్‌కౌంటర్‌ జరిగిన కొన్ని రోజులకి పోలీసులకి సింహ స్వప్నంలా మారిన రాడికల్‌ సిక్కు స్వయం స్టైల్‌ బోధకుడు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌ అమతపాల్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. అమతపాల్‌ సింగ్‌ని అరెస్ట్‌ చేయటానికి పంజాబ్‌ పోలీసులు నెల రోజుల పాటు అతన్ని వెంబడించారు. ఎట్టకేలకి రోడే గ్రామంలో తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో అతన్ని అరెస్టు చేసారు. ఆయన అరెస్టు గల కారణాలు ఇలా ఉన్నాయి, దీప్‌ సిద్ధూగా ప్రసిద్ధి చెందిన సందీప్‌ సింగ్‌ సిద్ధూ, ‘పంజాబ్‌ హక్కుల కోసం పోరాడటానికి, దాని సంస్కతిని రక్షించడానికి’ ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అనే సంస్థని ప్రారంభించాడు. అయితే దేశంలో రైతు నిరసనల జరుగుతున్న సమయంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో దీప్‌ సిద్ధూ మరణించాడు. దీప్‌ సిద్ధూ మరణించిన కొన్ని నెలల తర్వాత అమతపాల్‌ సింగ్‌ ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌గా నియమించబడ్డాడు. అనంతరం అమతపాల్‌ సింగ్‌ అనేక వివాదాలకి కేంద్ర బిందువయ్యాడు. ఈ నేపద్యంలోనే అమతపాల్‌ సింగ్‌ అనుచరుడయిన తూఫాన్‌ను అజ్నాలా పోలీసులు అరెస్టు చేశారు దీనికి నిరసనగా అమతపాల్‌, అతని మద్దతుదారులు అజ్నాలా పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. నిరసనలు తీవ్రం కావటంతో తూఫాన్‌ను విడుదల చేసారు. కానీ తర్వాత ప్రభుత్వ ఉద్యోగిని తన విధిని నిర్వర్తించకుండా నిరోధించటం, అధికారుల మీద హత్యాయత్నం, దాడి లేదా క్రిమినల్‌ ఫోర్స్‌ కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసారు. అప్పటి నుండి సుమారు నెలరోజులపాటు అతన్ని వెంబడించిన తర్వాత అమతపాల్‌ సింగ్‌ని అరెస్ట్‌ చేసారు. అయితే అమతపాల్‌ సింగ్‌ స్వయంగా పోలీసులకి లొంగి పోయాడని అతని అనుచరులు, తల్లి తండ్రులు పేర్కొంటున్నారు.

మే మానవత్వం సిగ్గుపడిన మహావిషాదం
మండే ఎండలతో ప్రారంభమయ్యే మే నెల 2023లో మాత్రం తీవ్రమయిన హింసాత్మక ఘర్షణలతో ప్రారంభమయినది. భారతదేశంలోని ఈశాన్య భాగంలో ఉన్న మణిపూర్‌ గొప్ప సంక్లిష్టమైన చరిత్రను కలిగి ఉంది. ఇది ఒకప్పుడు స్వతంత్ర రాజ్యం. దాని ప్రత్యేక సాంస్కతిక గుర్తింపు స్థానిక తెగలు, సంఘాలచే ఏర్పడినది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, మణిపూర్‌ 1949లో ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయబడింది. కుకీ ప్రజల సారధ్యంలో ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ మే 3న పిలుపునిచ్చిన ‘ఆదివాసి సంఘీభావ యాత్ర’ సందర్భంగా మణిపూర్‌లోని వివిధ ప్రదేశాలలో చెలరేగిన హింసాత్మక ఘర్షణ 2023 మే నెల ప్రారంభమైంది. రాష్ట్రంలోని పదహారు జిల్లాల్లో పది జిల్లాల్లో కుకీ నేతత్వంలోని గిరిజన సంఘీభావ యాత్ర తర్వాత మే 3న రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు దక్షిణంగా ఉన్న చురచంద్‌పూర్‌ పట్టణంలో చేరుకోవటంతో హింస చెలరేగింది. ఈ యాత్రని ఆది నుండి వ్యతిరేకిస్తున్న మెయిటీ తెగకి చెందిన కొంతమంది ఆందోళనకారులు యాత్రకి అడ్డంకులు సష్టించటంతో ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఈ జాతి విద్వేషక ఘర్షణల్లో వందలాది ఇళ్లు, ప్రార్థనా స్థలాలు, వాహనాలు ధ్వంసం చేయబడ్డాయి. కుకీ మహిళలపై మెయిటీ పురుషులు లైంగిక హింసకు పాల్పడిన అనేక ఘటనలు వెలుగు చూసాయి. జులై 19న మెయిటీ పురుషుల గుంపు ఒకటి ఇద్దరు కుకీ మహిళలను గ్రామీణ రహదారిపై నగంగా ఉరేగిస్తునట్లు చూపించే ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో, దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ పైశాచిక దుర్ఘటనని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. బయటి సమాజం నుండి వస్తున్న నిరసనలకి తలొగ్గి ప్రభుత్వం కొన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. మెయిటీ, కుకీ జాతి సమూహాల మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం 150 మంది మరణించారు. వేలాది మంది గాయపడగా, 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 12,000 మందికి పైగా పొరుగున ఉన్న మిజోరాం రాష్ట్రానికి శరణార్దులుగా తరలిపోయారు. ఏది ఏమయినప్పటికీ సమకాలీన చరిత్రలో ఇదొక మాయని మచ్చగా నిలిచి పోతుంది.
ఇదే నెలలో భారతదేశం కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించింధి. మే 28న కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘ఈ నూతన పార్లమెంట్‌ భవనం మొత్తం దేశం యొక్క సంస్కతి, సంప్రదాయం, ఆత్మను ప్రతిబింబిస్తుంది’ అని అన్నారు. సుమారు 971 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ పార్లమెంటు భవనం లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది పార్లమెంటు సభ్యులకు వసతి కల్పించటానికి వీలుగా నిర్మిచబడింది. భారత ప్రజాస్వామ్యం లౌకిక భావనల్ని బలపరుస్తుంది. పాలనా వ్యవస్థలలో మతాలకి సంబంధించిన అంశాల ప్రవేశాన్ని నిషేధిస్తుంది. అయితే రాజ్యంగా స్పూర్తికి విరుద్ధంగా, రాజ్యంగ విధానాలకి తిలోధకలిస్తూ, వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో చోళ రాజవంశం వారి సంప్రదాయ ఆచార రాజదండం అయిన ‘సెంగోల్‌’ని పట్టుకుని ప్రధాని నూతన పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించారు. ఇది ప్రజాస్వామ్య స్పూర్తికి, లౌకికత్వానికి విరుద్దమని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ మొత్తం కార్యక్రమాన్ని ఒక మతపరమైన కార్యక్రమంలాగా నిర్వహించటం, దేశ ప్రధమ పౌరురాలైన ద్రౌపతి ముర్ముని కార్యక్రమంలో భాగస్వామిని చేయకపోవటాన్ని నిరసిస్తూ 20 ప్రతిపక్ష పార్టీలు కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఇలా అనేక విమర్శల మధ్య కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంబించబడింది.

జూన్‌… ఆ ప్రమాదమొక తీరని విషాదం…
ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలోని బహనాగ బజార్‌ రైల్వే స్టేషన్‌లో జూన్‌ 3వ తేది సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో 288కి పైగా మరణిచటం దేశాన్ని ఒక పెను విషాదంలో ముంచేసింది. చెన్నైకి వెళ్లే కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు- హౌరా ఎక్స్‌ప్రెస్‌, బహనాగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో ఒక గూడ్స్‌ రైలును ఢకొీట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 1100 వందల మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రధాని మోడీ ఈ ప్రమాదాన్ని ‘దేశంలోనే అత్యంత విషాదకరమైన ప్రమాదాల్లో ఒకటి’గా పేర్కొన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ లతో కలిసి ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించి ఘటానా స్థలాన్ని పరిశీలించారు. రైల్వే సిగలింగ్‌ వ్యవస్థలోని లోపమే ఈ దుర్ఘటనకి కారణమని, ఇప్పటికయినా రైల్వే అధికారులు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేసాయి.

జూలై… ముంచెత్తిన వరదలు…
ఈ సంవత్సరం జూలై నెలలో కురిసిన భారీవర్షాల వల్ల ఉత్తర భారతం అతలాకుతలమై పోయింది. యమునా నది 206 మీటర్లకు మించి ఉప్పొంగి ప్రవహించటంతో ఢిల్లీ రహదారులన్నీ జలమయం అయిపోయాయి. ఇదేవిధంగా, 2023 సంవత్సరంలో వచ్చిన నైరుతి రుతుపవన వర్షాల కారణంగా అత్యంత దారుణంగా నష్టపోయిన రాష్ట్రాలలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఒకటి. దాదాపు 26 రోజులుగా ఎడతెగకుండా కురిసిన వర్షాలు హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ విద్వంసాన్ని సష్టించాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం తదితర కారణాల వల్ల 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా మండి, కులు, మనాలి, సిమ్లా, కాంగ్రాలోని కొన్ని ప్రాంతాలలో పెద్దఎత్తున ఆస్థి నష్టం సంభవించింది. ఈ విపత్తు వల్ల రాష్ట్రానికి రూ.12,000 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో అంతులేని విషాదాన్ని కలిగించిన ఇదే నెలలో భారత్‌ గర్వించదగ్గ చంద్రయాన్‌-3 జూలై 14 న ప్రారంభించబడింది.

ఆగస్టు చేతికందిన చందమామ …
చంద్రయాన్‌ 3 ప్రయోగం 2023 జూలై 14 న మధ్యాహ్నం 2:35 గంటలకు జరిగింది. శ్రీహరికోట, సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదిక నుండి దీన్ని ఎల్‌విఎమ్‌-ఎమ్‌4 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ విక్రమ్‌ 2023 ఆగస్టు 23 సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో సురక్షితంగా సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసింది. దీంతో చంద్రునిపై విజయవంతంగా కాలు మోపిన దేశాల్లో నాల్గవ దేశంగా భారతదేశం పేరుగాంచింది. చంద్రుని దక్షిణ ధ్రువం వద్దకి సురక్షితంగా వ్యోమనౌకని ల్యాండ్‌ చేసిన మొదటి దేశంగా ఖ్యాతి గడించింది. చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో 2023 ఆగష్టు 26న దేశ ప్రధాని నరేంద్రమోడి బెంగళూరుకు చేరుకుని పీణ్యలోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రయాన్‌ – 3 దిగిన ప్రదేశానికి శివశక్తి అని నామకరణం చేయడంతో పాటు ఇకపై ప్రతియేటా ఆగష్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించారు.
రాజకీయ రంగంలో, ‘మోదీ’ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలపై 2019 క్రిమినల్‌ పరువునష్టం కేసులో శిక్ష పడి, పార్లమెంట్‌ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఈ నెలలో ఊరట లభించింది. రెండేళ్ళ శిక్షని విధిస్తూ గుజరాత్‌ హైకోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్‌ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసిన నాలుగు నెలల తర్వాత లోక్‌సభ సెక్రటేరియట్‌ తిరిగి దానిని పునరుద్ధరించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ వర్గాలకి ఒక కొత్త ఉత్సాహాన్ని అందించింది.

సెప్టెంబర్‌ స్పష్టత లేకుండా ముగిసిన సమావేశాలు
‘జీ20’ ది 24 సంవత్సరాల సూదీర్ఘ ప్రయాణం. 1999లో ఆసియాలో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌లు కలిసి ప్రపంచ ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించడానికి ఈ ‘జీ20’ వేదికను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రపంచమంతటా 2007లో ఆర్థిక మాంద్యం ఏర్పడిన అనంతరం ఆర్థిక మంత్రుల స్థానంలో దేశాధినేతలతో కూడిన గ్రూప్‌గా దీనిని మార్చారు. జీ20 సంస్థ తొలి సమావేశం 2008లో అమెరికాలోని వాషింగ్టన్‌లో జరిగింది. తొలుత ఆర్థిక సమస్యలపై చర్చించడంతో ప్రారంభమయిన జీ-20 ప్రస్థానం ఆ తరవాతి కాలాల్లో సుస్థిర అభివద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు, అవినీతికి అడ్డుకట్ట వంటి అంశాలపై చర్చించే స్థాయికి విస్తరించింది. ఇప్పటి వరకు మొత్తం 17 సమావేశాలు జరిగాయి. ‘జీ20’కి సంబందించిన 18వ సమావేశానికి భారత్‌ అతిధ్యమిచ్చింది. ఈ సమావేశం 2023 సెప్టెంబర్‌ 9,10వ తేదిలలో న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపం ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌- కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన మొదటి +20 సమ్మిట్‌. ‘వన్‌ ఎర్త్‌, వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఫ్యూచర్‌’ అనే నినాదంతో ప్రారంభమయిన ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘సంపన్న దేశాల కారణంగా ఏర్పడిన భూతాప ప్రభావం వల్ల వర్థమాన దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, అందువల్ల వర్ధమాన దేశాలు తమ గొంతు వినిపించడానికి జీ20 అధ్యక్ష స్థానంలో భారత్‌ ప్రయత్నిస్తుంది’ అని అన్నారు. అయితే యుక్రెయిన్‌లో రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ప్రపంచ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల ప్రభావం జీ20 సమావేశాల్లో జరిగిన చర్చలలో స్పష్టంగా కనిపించింది. యుక్రెయిన్‌, రష్యా విషయంలో తమతమ సొంత అభిప్రాయాలను పక్కనపెట్టి సంపూర్ణంగా చర్చలలో పాల్గొనాలని జీ20 దేశాల ప్రతినిధులకి ప్రధాని విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మొత్తానికి ప్రపచం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించడానికి ఏర్పాటు చేయబడిన ఈ సమావేశం వివిధ అంశాలపై ఏకాభిప్రాయానికి రాకుండానే ముగిసిపోయింది.

అక్టోబర్‌ విరుచుకు పడ్డ వరదలు …
ఈ నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఈశాన్య భారతదేశంలోని సిక్కిం రాష్ట్రంలోని వాయువ్యంలో 17,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమనదీయ సరస్సు దక్షిణ లొనాక్‌ సరస్సు 2023 అక్టోబర్‌ 3-4 మధ్య రాత్రి గ్లేసియల్‌ లేక్‌ అవుట్‌బర్స్ట్‌ ఫ్లడ్‌ ని ఎదుర్కొంది.  (గ్లేసియల్‌ లేక్‌ అవుట్‌బర్స్ట్‌ ఫ్లడ్‌) అంటే హిమానీనదం లేదా మంచు, ఇసుక, గులకరాళ్లు, శిధిలాల వెనుక సహజ సంచితంగా నిల్వ చేయబడిన నీరు వేగంగా విడుదలైనప్పుడు సంభవించే ఆకస్మిక వరదలను  వరదలు అంటారు.
సరస్సు ఆనకట్ట తెగిపోవటంతో నిమిషాల వ్యవధిలోనే వరద చుంగ్తాంగ్‌ వద్ద నిర్మించిన తీస్తా ఆనకట్టను బద్దలు కొట్టుకుంటూ ముందుకు ఉరికింది. దీంతో ఒక్కసారిగా తీస్తా నది దిగువన ఉన్న ప్రాంతలాలో నీటి మట్టాలు 20 అడుగులకు చేరుకున్నాయి. సిక్కింలోని మంగన్‌, గాంగ్టక్‌, పాక్యోంగ్‌, నామ్చి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌, కూచ్‌ బెహార్‌, జల్పైగురి, డార్జిలింగ్‌ జిల్లాల్లోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు పదిహేను ప్రధాన వంతెనలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారి 10 యొక్క భాగాలు కూలిపోవడంతో రాజధాని గ్యాంగ్‌టక్‌తో సహా రాష్ట్రం యొక్క ఉత్తరం భాగమంతా బయట ప్రపంచంతో పూర్తిగా సంభందాల్ని కోల్పోయింది. ఈ వరదల ప్రభావం వల్ల ఆర్మీ సిబ్బందితో సహా సుమారు 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1968 సిక్కిం వరదల తర్వాత సంభవించిన వరదల్లో ఇది అత్యంత ఘోరమైన వరద అని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెలలోనే కేరళలోని కలమస్సేరిలో కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన పేలుడు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కొచ్చి సమీపంలోని కలమస్సేరి వద్ద ఉన్న పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌లో అక్టోబర్‌ 29వ తేది ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగిన వరుస పేలుళ్ళ ఘటనలో ఒకరు మహిళ మతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. జమ్రా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లోని ప్రార్థనా సమావేశాన్ని పునరుద్ధరణవాద క్రైస్తవ వర్గమైన యెహోవాసాక్షులు ఎవాంజెలిస్ట్‌ గ్రూప్‌ కి చెందిన మాజీ సభ్యుడే ఈ దాడికి బాధ్యత వహిస్తూ కొడకరాలో పోలీస్‌ స్టేషన్లో లొంగిపోవడంతో పోలీసు దర్యాప్తు ఆశ్చర్యకరమైన మలుపు తిరిగింది.

నవంబర్‌ గెలిచి ఓడిన భారత్‌…
ఈ నెలలో దేశవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది ప్రజలు తీవ్రమయిన ఆశనిపాతాన్ని చవిచూశారు. పాల్గొన్న 10 మ్యాచులలో అద్భుతమైన ప్రతిభని కనబరచినప్పటికీ భారత్‌ వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకోలేకపోయింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత్‌ క్రీడాభిమానులకి తీవ్రమైన నిరాశని మిగిల్చింది. వన్డే ప్రపంచ కప్‌ టోర్నీలో మొదటి నుంచి దూకుడుగా ఆడి వరుస విజయాల్ని సాధించిన భారత్‌ టీం ఫైనల్‌ పోరులో చతికిలపడింది. ఈ ఓటమి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత్‌ క్రీడాభిమానులకి తీవ్రమైన నిరాశని కలిగించింది.
అయితే ఇదే నెలలో ఒక ఆనందకరమయిన విషయం ఏమిటంటే, ఉత్తరాఖండ్‌లో సొరంగం కూలిపోవడంతో అక్కడ శిధిలాల మద్య చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావటానికి జరిపిన భారీ రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతంగా ముగియటం దేశ ప్రజల్ని ఆనందానికి గురి చేసింది. సుమారు 400 గంటలకు పైగా కొనసాగిన ఈ ఆపరేషన్‌ ఫలితంగా, ఆ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు అందరు సురక్షితంగా బయటపడటంతో దేశమంతా సామూహిక ఉపశమనం పొందింది.

డిసెంబర్‌ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు
మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 3, 4 తేదీల్లో ప్రకటించబడ్డాయి. దీంతో కొత్త ప్రభుత్వాలు కొలువుతీరే కోలాహలంతో డిసెంబర్‌ నెల ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) విజయం సాధించింది. మూడు రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలబడ్డ బిజెపిని తెలంగాణలో మూడో స్థానానికి పరిమితం చేశాయి. రాష్ట్రాన్ని సుమారు పదేళ్లపాటు పరిపాలించిన బిఆర్‌ఎస్‌ని పక్కన పెట్టి ప్రజలు కాంగ్రెస్‌కి అధికారమిచ్చారు. తెలంగాణ మూడవ ముఖ్య మంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు.
ఈ నెలలో జరిగిన ఒక దుర్ఘటన భారత దేశాన్ని కుదిపేసింది. భారత్‌ పార్లమెంట్లో కొంతమంది వ్యక్తులు దాడి చెయ్యటం దేశం యావత్తుని ఆందోళనకి గురి చేసింది. భారత్‌ ప్రజాస్వామ్య వ్యవస్థలకి దేవాలయంగా భావించే పార్లమెంటుపై దాడి జరగటం మన రక్షణ వ్యవస్థల్లోని డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం పార్లమెంట్‌ పై ఉగ్రవాదులు దాడి చేసారు. సరిగ్గా అదే రోజు మళ్ళీ దాడి జరగటం సంచలనం సష్టించింది. డిసెంబర్‌ 13న కొందరు వ్యక్తులు స్మోక్‌ క్యాన్లు పట్టుకుని లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సందర్శకుల గ్యాలరీ నుండి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి, పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో పాటు, ఒక రకమయిన పసుపు పొగను విడుదల చేసారు. ఈ హటాత్తుగా జరిగిన ఈ దాడికి భయపడి సభ్యులు అందరూ భయంతో పరుగులు తీసారు. ఈ దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తుల పాసులపై బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహా సంతకం చేసారు. ఈ ఘటన అనంతరం భద్రతా ఉల్లంఘనకి కారణమయిన అంశాలను విచారణ జరిపించటంతో పాటు, దీనిని ఉగ్రవాద చర్యగా ప్రకటించి, బిజెపి ఎంపి ప్రతాప్‌ సింహాపై చర్యలు తీసుకోవాలని ఇండియా బ్లాక్‌ పార్టీలు డిమాండ్‌ చేశాయి. కాని ఫలితం శూన్యం.
అనేక విషాదాలని, విపత్తుల్ని, కొన్ని సంతోషాలని అందించిన 2023 కాలగమనంలో కలిసి పోనుంది. కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. సాధ్యం కాదని తెలిసిన కూడా, ఈ కొత్త సంవత్సరం కష్టాలు లేని కాలం కావాలని కోరుకుందాం… విషాదాలు లేని కొత్త ఉషోదయాలకి ఈ నూతన సంవత్సరం వేదిక కావాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
డా|| కె. శశిధర్‌ , 94919 91918 

Spread the love