దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

– ఏర్పాట్లు పూర్తి చేయండి :మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనీ, అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేయాలంటూ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. తొమ్మిదేండ్ల అభివృద్ధిపై వీడియోలు సిద్ధం చేయాలని ఆమె ఈ సందర్భంగా ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్‌ 2 నుంచి 23వరకు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తొమ్మిదేండ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరో సారి గుర్తుచేయాలని తెలిపారు. తండాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనుల వికాసం, సీఎం ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ స్కీమ్‌ వంటి అనేక పథకాల ద్వారా గిరిజనులు లబ్ధిపొందారని తెలిపారు. గర్భిణులకు, చిన్నారులకు అందిస్తున్న పోషక ఆహారం, ఇతర సౌకర్యాలను వీడియోలు, డాక్యుమెంటరీల ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. తొమ్మిదేండ్లకు ముందు గిరిజనుల పరిస్థితి,ప్రస్తుత పరిస్థితిని వారికి వివరించాలన్నారు. సమీక్షా సమావేశంలో ట్రైకార్‌ చైర్మెన్‌ రామచంద్రనాయక్‌, జీసీసీ చైర్మెన్‌ రామావత్‌ వాల్య నాయక్‌, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చోంగ్త్‌, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హౌలీ కేరి, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ రాజీవ్‌ సాగర్‌, బీసీ గురుకులం కార్యదర్శి మల్లయ్య బట్టు, ట్రైకార్‌ జీఎం శంకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love